
నేడు మోహినీ ఉత్సవం
కదిరి: కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. ఆ అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తారు. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారాన్ని ధరిస్తారని భక్తుల నమ్మకం. వయ్యారాలు పోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి కుచ్చుల వాలుజడ నేటి ఉత్సవంలోని ప్రత్యేకత. ఉభయదారులుగా కోటా వెంకట కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు తెలిపారు.