పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్, పోస్టల్ సిబ్బంది
వృద్ధుల నుంచి రూ.200 వసూలు చేసి టీడీపీ 13వ వార్డు కౌన్సిలర్ కొడుకు
దీనిపై మున్సిపల్ చెర్‌పర్సన్ భర్త ఆగ్రహం
ఇరువురి మధ్య తోపులాట
కదిరి : కదిరి పట్టణంలోని నిజాంవలీ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ప్రజలందరూ చూస్తుండగానే తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. స్థానికుల కథనం ప్రకారం... మంగళవారం రాత్రి నిజాంవలీ కాలనీలోని 13, 14, 15వ వార్డుల్లో పోస్టాఫీసు, మున్సిపల్ శాఖ అధికారులు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ మూడు వార్డులకు టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 13వ వార్డు నుంచి ఎన్నికైన కౌన్సిలర్ తుమ్మల అమీనాబీ కుమారుడు అయూబ్ వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.1000 పెన్షన్ మొత్తంలో రూ.200 నొక్కేస్తున్నాడని స్థానికులు అదే పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ సురయాభాను భర్త బాబ్జాన్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పటికే అర్ధరాత్రి 2 గంటలవుతోంది. చైర్‌పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 15వ వార్డులో కూడా కొంతమందికి అప్పటికే పెన్షన్లు అందించారు. ఆ వార్డుకు చెందిన వృద్ధులకు సైతం రూ.200 పట్టుకొని రూ.800లే పంపిణీ చేశారు. ముసలీ, ముతకా చేసేది లేక రూ.800 తీసుకొని వెనుదిరిగారు. ఈ విషయం వారు తమ ఇళ్లలో చెబితే వారి కుటుంబీకులు అప్పటికే పెన్షన్ల పంపిణీ చేస్తున్న చోటుకు చేరుకున్నారు. అదే సమయంలో చైర్‌పర్సన్ భర్త బాబ్జాన్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు అతనికి ఫిర్యాదు చేశారు.
ముసలోళ్లకు ఇచ్చే రూ.1000 నుంచి రూ.200 కమిషన్ ఎందుకు తీసుకుంటున్నారని ఆయన అక్కడున్న అధికారులను ప్రశ్నించారు. ఇందుకు వారు అక్కడే ఉన్న టీడీపీ నేత అయూబ్ వైపు చూడటంతో ‘ఈ కమీషన్ల బాగోతం మీదేనా’ అనగానే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకొన్నారు. తన భార్య ప్రాతినిధ్యం వ హించే 15వ వార్డులో పెన్షన్ పంపిణీ చేయడానికి మీరెవరని ఆయన అయూబ్‌పై మండిపడ్డారు. నిజాంవలీ కాలనీలోని 3 వార్డులు తననే చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్పారనగానే బాబ్జాన్‌కు మరింత కోపమొచ్చింది. ఆయన వెంటనే కందికుంటకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. ప్రజల ముందు గొడవ పడితే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో ఆయన ఇరువురికి ఫోన్ ద్వారానే సర్దిచెప్పి సమస్య సద్దుమనిగేలా చేశారు. తన భార్య చైర్‌పర్సన్ అనే విషయం మీకు తెలిసి కూడా ఆమెకు తెలీకుండా అయూబ్ ఆధ్వర్యంలో పింఛన్లను పంపిణీ చేయడమేంటని అక్కడున్న మున్సిపల్ సిబ్బందిని బాబ్జాన్ మందలించారు. అర్ధరాత్రి పూట వణికించే చలిలో ముసలోళ్లకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారనడంతో పోస్టల్, మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో పెన్షన్లు పంపిణీ చేయడంపై మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌ను ‘సాక్షి’వివరణ కోరింది. పంపిణీ రోజంతా చేసినా సమయం సరిపోలేదని తెలిపారు. రూ.1000 బదులు రూ.800 ఇస్తున్నారన్న ఆరోపణలపై అలాంటిదేమీ లేదని, అయినా సరే విచారిస్తామని చెప్పారు.
అర్ధరాత్రితమ్ముళ్ల మధ్య రగడ
Published Fri, Jan 2 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement
Advertisement