సాక్షి, సిటీబ్యూరో: కేవలం శుక్రవారం... అది కూడా మధ్యాహ్నం పూట... ప్రార్థనలకు వెళ్లే యజమానుల దుకాణాలే టార్గెట్... సగం దింపిన షట్టర్‌ను ఎత్తి ఏది దొరికితే అది ఎత్తుకుపోతారు... ఈ పంథాలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి వాహనం, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం తెలిపారు. పాతబస్తీ, ఫలక్‌నుమా పరిధిలోని వట్టేపల్లికి చెందిన మహ్మద్ అక్రమ్ వెల్డింగ్ వర్కర్‌గా, మహ్మద్ పాషా కూలీగా పని చేసేవారు. దురలవాట్లకు బానిసైన అక్రమ్ అందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికి కొన్నాళ్ల క్రితం నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం వెళ్లే వ్యాపారులు తమ దుకాణాల షట్టర్స్ సగం వరకే కిందికి దించుతుంటారు. దీనిని గుర్తించిన అక్రమ్ ఆయా షాపుల్లోకి దూరి అందినకాడికి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. తస్కరించిన నగదుతో పాటు చోరీ వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. గతంలో అతడిపై షాహినాయత్‌గంజ్, కుల్సుంపుర, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల పరిధిల్లో కేసులు నమోదయ్యాయి.
అక్రమ్‌ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. 2018 జూన్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను ఏడాది తర్వాత భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది అక్టోబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని అక్రమ్ ఈసారి ముఠా కట్టి పంజా విసరాలని భావించాడు. తన స్నేహితుడైన పాషాకు విషయం చెప్పడంతో సహకరించడానికి ముందుకు వచ్చాడు. ఆ నెల మొదటి వారంలో తన స్నేహితుడు ఖాలీద్‌తో కలిసి రెండు రోజుల పాటు బీదర్‌లో ‘పర్యటించిన’ అక్రమ్ ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి తీసుకువచ్చాడు. పాషాతో కలిసి దీనిపై తిరుగుతూ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరూ కలిసి చోరీ బైక్‌పై సంచరిస్తూ ఓ చెత్త వాహనం డ్రైవర్‌ను గమనించారు. అతడు తన ఫోన్‌ను వాహనం సీటుపై ఉంచి ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించిన వీరు ఫోన్ తస్కరించారు.
నిందితులు అక్రమ్, పాషా
అదే నెల ఆఖరి వారంలో అదే చోరీ బైక్‌పై టోలిచౌకి ప్రాంతంలో సంచరించారు. ఆ సమయంలో నవాజ్ చికెన్ షాప్ షట్టర్ సగం దించిన యజమాని ప్రార్థనల కోసం వెళ్లారు. దీనిని గమనించిన అక్రమ్ వాహనాన్ని కొద్దిదూరంలో ఆపాడు. పాషాను దాని సమీపంలోనే ఉంచి యజమాని రాకను గమనించమని చెప్పాడు. అక్రమ్ నేరుగా దుకాణంలోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.85 వేల నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశాడు. ఈ డబ్బును ఇద్దరూ కలిసి ఖర్చు చేశారు. ఈ రెండు ఉదంతాలకు సంబం«ధించి బాధితుల ఫిర్యాదుతో స్థానిక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని ఛేదించేందుకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ ముజఫర్, పి.మల్లికార్జున్, ఎన్.రంజిత్‌కుమార్‌లతో కూడిన బృందం చోరీ జరిగిన దుకాణం సమీపంలోని సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేసింది. ఫలితంగా అనుమానితుల జాడ తెలియడంతో లోతుగా దర్యాప్తు చేసింది. ఆదివారం అక్రమ్, పాషాలను పట్టుకుని వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను గోల్కొండ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment