బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం
బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం
Published Fri, Mar 24 2017 6:42 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
భీమవరం: వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధ రేటు సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆరోపించారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం కౌలు రైతుల సంఘం జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. 80 శాతం భూములను వీరే సాగు చేస్తున్నా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. కౌలు రైతులు, రైతుమిత్ర, జేఎల్ గ్రూపుల రుణమాఫీకి నిధులు కేటాయించక పోవడం వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఉన్నచిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని చెప్పారు. రుణమాఫీ కోసం రూ.3600 కోట్లు కేటాయించినా అవి వ్యవసాయం చేయని భూస్వాములకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఆఖరునాటికి కౌలు రైతులు, రైతు మిత్ర, జేఎల్ గ్రూపులకు ఇచ్చిన రూ.594 కోట్ల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీలేని పంట రుణాలకు కేవలం రూ.177 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కేటాయింపులకు ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందని, కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేటపట్టడం లేదని విమర్శించారు. కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంతులవారీ విధానంలో పూర్తి స్థాయిలో నీరందిస్తామని అధికారులు చేసిన ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ధనికొండ శ్రీనివాస్, జొజ్జవరపు శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, పెచ్చెట్టి నర్సింహమూర్తి, కవల వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement