పురుగుమందుల గిడ్డంగిపై విజిలెన్స్ దాడులు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో ఎటువంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న పురుగుమందుల గిడ్డంగిపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. విజిలెన్స్ ఏవో ఎం. శ్రీనివాసకుమార్, డీసీటీవో జి.జయకుమార్, ఎస్‌ఐ ఎస్.రామకృష్ణ, మండల వ్యవసాయాధికారి ఎస్.చెన్నకేశవు సంయుక్తంగా గిడ్డంగిలో తనిఖీలుచేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుమందులను గుర్తించారు. గిడ్డంగిలో ప్లాస్టిక్ కవర్లతోపాటు, కొన్ని లేబుళ్లు లభ్యం కావడం, ఆ లేబుళ్లపై ఫార్మోలేటెడ్‌బై ఎన్‌జీ గూడెం అని ఉండడంతో అధికారులు నాగులగూడెం కూడా తనిఖీకి వెళ్లారు. అక్కడ మందులు తయారు చేస్తున్నారనే అనే అంశంపై ఆరా తీశారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్రమంగా సరుకు నిల్వ ఉంచిన గిడ్డంగి లైసెన్సు కె.రాజేశ్వరి పేరుమీద ఉందని చెబుతున్నారని, ఇక్కడ పురుగుమందుల నిల్వకు, విక్రయాలకు అనుమతులు లేవని విజిలెన్స్ అధికారులు చెప్పారు. గిడ్డంగిలోని రూ.ఆరులక్షల71వేల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై 6ఏ కేసుతోపాటు, అనధికార నిల్వపై మరో కేసు నమోదుచేసినట్టు వివరించారు.