సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.టక్కర్
తిరుచానూరు : దేశంలోనే అత్యంత వ్యాపార అనుకూలత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా శ్రమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.టక్కర్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో శుక్రవారం భారతదేశ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన, పరిశ్రమల పురోగతిపై సమీక్ష జరిగింది. రాయలసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 15ఏళ్ల పాటు రెండెంకల వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుందన్నారు. 25వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల మౌలిక వసతులు 30రోజుల్లోపు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనలో జాప్యం వహించరాదని హెచ్చరించారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తుల్లో 2014లో 8.3శాతం నమోదయ్యిందని, 2015లో 10.99శాతం నమోదవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో 15.99శాతంగా నమోదయ్యిందని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేకాధికారి కృష్ణయ్య, అమరరాజ బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, సీఐఐ చైర్మన్ శివకుమార్, సీఐఐ తిరుపతి ప్రతినిధి ఎం.విజయనాయుడు, డైరెక్టర్ జీఎస్.రతి, జాయింట్ కలెక్టర్ గిరీషా, తిరుపతి మున్సిపల్ కమిషనర్ వినయ్‌చంద్, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల, పరిశ్రమల జోనల్ అధికారులు, 300మంది ప్రతినిధులు పాల్గొన్నారు.