సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
ఎస్సీ, ఎస్టీ కేసులపై సత్వర చర్యలు
Published Fri, Sep 23 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
– జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
చిత్తూరు (కలెక్టరేట్) : ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్‌జైన్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే చర్యలు తీసుకుని దోషులకు శిక్ష పడేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. అట్రాసిటీ యాక్టును అమెండ్ చేస్తూ ఇన్విస్టిగేషన్ కాలపరిమితి 30 నుంచి 60 రోజులకు పెంచారని, ఈ లోగా చర్యలు తీసుకుని చార్జీషీటు ఫైల్ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు సబ్ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉంటే సత్వర చర్యల కోసం లేఖ రాయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 26వ తేది మధ్యాహ్నం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో వర్క్‌షాపు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 15 రోజులకు ముందే డివిజన్, మండల స్థాయి కమిటీలను నిర్వహించాలన్నారు. నారాయణవనంలో 30 ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందన్నారు. వారి క్లైయిమ్‌లకు ఆధారాలు పొంది పట్టాలివ్వాలన్నారు. కార్వేటినగరం చాకలివానిగుంటలో గిరిజనులకు పట్టాలు అందకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టాలు అందని గిరిజనులుంటే వారి క్లైయిములు పరిశీలించి వారికి పట్టాలిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రగిరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, తిరుపతి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, సునీల్‌కుమార్, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, జయలక్ష్మి, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీశాఖల అధికారులు, ఎస్సీ,ఎస్టీల నాయకులు పాల్గొన్నారు.
Advertisement