గణితశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉన్నతస్థితి
ఏలూరు సిటీ : గణితశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంటే మెరుగైన జీతాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చని వరంగల్ నిట్ ప్రొఫెసర్ డీవీఎల్‌ఎల్ సోమయాజులు అన్నారు. స్థానిక సీఆర్‌ఆర్ అటానమస్ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గణితశాస్త్రంలో అధునాతన పద్ధతులు అనే అంశంపై ప్రారంభమైన జాతీయ సెమినార్ రెండోరోజు శుక్రవారం ఆసక్తికంగా సాగింది. ముఖ్యవక్తగా హాజరైన సోమయాజులు మాట్లాడుతూ గణితశాస్త్రంతో సామాజిక వ్యవస్థ ముడిపడి ఉందన్నారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఫ్రొఫెసర్ బి.మిశ్రా మాట్లాడుతూ కాస్మలాజికల్ మోడల్ అనే అంశంపై వివరణ ఇస్తూ గణితంతో విశ్వంలో దాగి ఉన్న డార్క్ ఎనర్జీని లెక్కించి, కనుమరుగవుతున్న శక్తి వనరులకు బదులుగా ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ మ్యాథ్స్ స్టాటస్టిక్స్ డీన్ ప్రొఫెసర్ బి.పద్మావతి మాట్లాడుతూ గణితం అభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. దేశవిదేశాల్లో ఉన్నత సంస్థల్లో అత్యున్నత స్కాలర్‌షిప్‌లు, మిలియన్ డాలర్ ప్రైజ్‌లున్నాయని తెలిపారు. నోబుల్ బహుమతితో సమానమైన అవార్డులు గణిత విద్యార్థులకు అందుతున్నాయని ఆమె తెలిపారు. మ్యాథ మెటికల్ మోడలింగ్–ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే అంశంపై తిరుపతి వేంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎన్.భాస్కరరెడ్డి అవగాహన కల్పించారు. ముగింపు సభకు సీఆర్‌ఆర్ విద్యాసంస్థల పాలకమండలి అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, కార్యదర్శి ఎన్‌వీకే దుర్గారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వీర్రాజు చౌదరి, పీజీ కరస్పాండెంట్ వి.రఘుకుమార్, డైరెక్టర్ సి.అరుణకుమారి, అధ్యాపకులు పీసీ స్వరూప్, వి.రామబ్రహ్మం, కె.చలపతిరావు, బి.శ్రీనివాసరావు, కె.హేమలత, ఎన్.అను, కె.శైలజ, వి.లక్ష్మీకుమారి, ఆయా కళాశాలల అధ్యాపకులు, ఇతియోపియా దేశం నుంచి, ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు హాజరయ్యారు.