ఏజెన్సీ బంద్ సంపూర్ణం
ఏజెన్సీ బంద్ సంపూర్ణం
Published Fri, Sep 9 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
పోలవరం : జిల్లాలోని ఏజన్సీ మండలాల్లో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని, పీసా చట్టాన్ని అమలు చేయాలని, అన్ని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య వ్యవస్థను మెరుగుపర్చాలని, ఏజెన్సీలో విద్యార్థుల సంఖ్య తగ్గారంటూ పాఠశాలలు మూసివేస్తున్న ప్రభుత్వ తీరు మారాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేపట్టారు. ఉదయం నుంచి కూడా పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో బంద్ స్పష్టంగా కనబడింది. జనజీవనం స్తంభించింది.
బంద్ సందర్భంగా పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బుట్టాయగూడెంలో జరిగిన ర్యాలీలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సీతారామ్ పాల్గొన్నారు. బంద్ సందర్భంగా పోలవరంలో దుకాణాలు, వ్యాపార ‡సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు ఏటిగట్టు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్వహించారు. బస్సులు యథావిధిగా తిరిగాయి. ఏజెన్సీకి వెళ్లే బస్సులు మాత్రం బంద్ నిర్వాహకులు అడ్డుకున్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎ.రవి, మండల సీపీఎం కార్యదర్శి గుడెల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
l
Advertisement