shops closed
-
టీటీడీ హెచ్చరిక.. వాటిని వినియోగిస్తే షాపులు సీజ్
సాక్షి,తిరుమల: తిరుమలలో దుకాణాలు, హోటళ్ల యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. టీటీడీ రెవెన్యూ విభాగం, ఆరోగ్య శాఖ, నిఘా, భద్రతా విభాగం అధికారులు 10 బృందాలుగా ఏర్పడి తిరుమలలోని పలు ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లతో కూడిన వస్తువులు, షాంపులు, బొమ్మలు, దుస్తులు విక్రయించకూడదని ఆదేశించారు. చదవండి: కాకినాడ: యాచకుడి మృతి.. సంచుల నిండా నోట్లు చూసి మైండ్ బ్లాక్ -
దుకాణం.. ఫర్ సేల్: అమ్మకం బోర్డు పెట్టిన 1,200 మంది!
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు చిన్న వ్యాపారులు కుదేలయ్యారు! సుదీర్ఘ లాక్డౌన్లు, ఆంక్షలు, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు అన్నీ కలసి చిన్న వ్యాపారాల పాలిట శాపంగా పరిణమించాయి. దీంతో వ్యాపారాలను నడపలేక వాటిని అమ్మేసి బయటపడదామనుకుంటున్నారు. ఒక ఆన్లైన్ మార్కెట్ పోర్టల్‌లో 1,200 మంది తమ వ్యాపారాలను విక్రయానికి పెట్టడం దీన్నే సూచిస్తోంది. లాక్డౌన్లతో వ్యాపారాలను కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నకాడికి అమ్ముకుని ఊరట పొందేందుకు మొగ్గుచూపిస్తున్నారు. లాక్డౌన్ల ప్రభావం ఎక్కువగా చిన్న టూర్ (పర్యాటక) ఆపరేటర్లు, వ్యాయామ కేంద్రాలు (జిమ్‌లు), రెస్టారెంట్లు, ఈవెంట్ నిర్వహణ సంస్థలు, సెలూన్లు, ప్లే స్కూళ్లు, క్లౌడ్ కిచెన్లపై ఉన్నట్టు ఎస్‌మెర్జర్స్ అనే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డేటా తెలియజేస్తోంది. ‘‘సగటున ఒక్కో చిన్న వ్యాపార సంస్థ 2019–20తో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం మేర ఆదాయం నష్టపోయాయి. ప్రధానంగా రెస్టారెంట్లు, సెలూన్లు, సూపర్మార్కెట్లు, వినోద కేంద్రాలకు అయితే ఆదాయం 90–95% పడిపోయింది’’ అని ఎస్‌మెర్జర్స్ వ్యవస్థాపకుడు విశాల్ దేవనాథ్ తెలిపారు. 2021లో భారీ మార్పు.. 2018లో ఎస్‌మెర్జర్స్ వేదికపై 3.37 లక్షల కంపెనీలు నమోదు చేసుకున్నాయి. 2019లో 3.86 లక్షల సంస్థలు సాయం కోరుతూ నమోదు చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత వీటి సంఖ్య 6.10 లక్షలు దాటిపోయింది. ఇందులో 32,000 కంపెనీలు 2019లో విక్రయానికి ఉంచినవి కాగా, 2020లో 36,000, 2021లో తొలి నాలుగు నెలల్లోనే 11,000కు వీటి సంఖ్య పెరిగిపోయింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇటీవలే నిర్వహించిన సర్వే ప్రకారం.. కరోనా కారణంగా 82 శాతానికి పైగా వ్యాపార సంస్థలు సమస్యలను ఎదుర్కొంటుండగా.. వీటిల్లో 70 శాతం సంస్థలు కరోనా ముందు నాటి డిమాండ్‌ను చేరుకునేందుకు కనీసం మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. -
బేగంబజార్‌లో కరోనా కలకలం
సాక్షి, అబిడ్స్(హైదరాబాద్): బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బేగంబజార్‌లో 100 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌కు కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు వ్యాపారస్తులకు కరోనా రావడం, మార్కెట్లో విపరీతమైన రద్దీ ఉండడంతో బేగంబజార్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి దుకాణాల వేళలను మార్చారు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరిచి సాయంత్రం 5 గంటల వరకే మూసివేస్తామని ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ అగర్వాల్‌లు తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్ మార్కెట్, మిట్టికా షేర్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్ నిబంధనలు పాటిస్తాయన్నారు. ప్రతి దుకాణం వద్ద కొనుగోలుదారులు, వ్యాపారస్తులు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్ వాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. -
హైదరాబాద్‌లో మూతబడుతున్న దుకాణాలు
-
ఇక ఆ షాపులు స్వచ్ఛంద లాక్డౌన్..
అబిడ్స్/చార్మినార్/రాంగోపాల్‌పేట: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ గురువారం సమావేశమై బేగంబజార్ మార్కెట్‌ను ఈ నెల 28 నుంచి జూలై 5వ తేదీ వరకు పూర్తిగా మూసేయాలని నిర్ణయించింది. గత కొన్నిరోజులుగా బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, షాహినాయత్‌గంజ్, మహారాజ్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ మార్కెట్లలో పలువురు వ్యాపారులకు కరోనా రావడంతో మిగిలిన వారంతా వణికిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనేకాక రాష్ట్రం నలుమూలల వ్యాపారస్తులంతా బేగంబజార్ నుంచి కిరాణా సామగ్రితో పాటు పప్పులు, ఇతర వస్తువులు హోల్‌సేల్ రేట్లకే కొనుగోలు చేసి విక్రయాలు చేస్తారు. వ్యాపారస్తులకు కరోనా వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా మొత్తం కిరాణా హోల్‌సేల్ దుకాణాలను మూసేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి తెలిపారు. పాతబస్తీలోని వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించడానికి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ఎత్తేసిన అనంతరం సిటీలో కరోనా వైరస్ ప్రభావం అధికం కావడంతో ఈ నెల 30వ తేదీ వరకు తమ వ్యాపారాలను మూసి ఉంచాలని వస్త్ర వ్యాపారుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుంచి అన్ని రకాల రిటైల్ మార్కెట్లతో పాటు హోల్‌సేల్ వస్త్ర వ్యాపారాలను మూసివేశారు. ఇటు పాతబస్తీలోని లాడ్‌బజార్ కూడా మూతపడనుంది. అక్కడి వ్యాపారులు కూడా వారం రోజుల పాటు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ జనరల్‌బజార్‌లో చీరల వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. చిత్ర దర్గా నుంచి మహంకాళి స్ట్రీట్ వరకు కొనసాగుతున్న పట్టు, ఫ్యాన్సీ చీరల వ్యాపారులు గురువారం నుంచి జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇటు జనరల్‌బజార్‌లోని బంగారు ఆభరణాల దుకాణాలను జూలై 5 వరకు మూసేస్తున్నట్లు సికింద్రాబాద్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏపీలో మరికొన్ని షాపులకు లాక్డౌన్ సడలింపులు
-
బర్డ్ ఫ్లూ...కలకలం
సాక్షి, యలహంక: కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందని నిర్ధారణ కావడంతో కర్ణాటకలో కొన్నిచోట్ల కోడి మాంసం విక్రయించే దుకాణాలు మూతపడ్డాయి. ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుందన్న భయంతో ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. బ్యాటరాయణపుర పరిధిలో ఇప్పటికే కోడి మాంసం అంగళ్లను మూసివేశారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కోళ్లలో కొన్ని మృతిచెందడంతో వాటిని పరీక్షించగా విషయం బయటపడింది. దాసరహళ్లిలోని కేజీఎన్ కోడి మాంసం విక్రయించే అంగడిలో తమిళనాడు నుంచి తీసుకొచ్చిన 15 నాటు కోళ్లలో నాలుగు చనిపోయాయి. వాటిని హెబ్బాళ్లోని పసువుల ఆస్పత్రికి పరీక్షలకోసం తరలింగా అక్కడి నుంచి భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు. అక్కడ పరిశీలించిన వైద్యులు కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి (హెచ్ 5 ఎన్ 1) సోకిందని నిర్ధారించారు. విషయం తెలిసిన అధికారులు దాసరహళ్లి చుట్టు పక్కల రెండు కిలోమీటర్ల పరిధిలోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయించారు. బర్డ్ ఫ్లూ సోకిందేమోనని మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోళ్లు చనిపోతే విధిగా పరీక్షలు చేయించాలని దుకాణ నిర్వాహకులను కోరుతున్నారు. -
బంద్ స్వచ్ఛందం
– అడుగడుగునా అవరోధాలు సృష్టించిన ప్రభుత్వం – ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు – జిల్లా అంతటా నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు – బంద్‌కు సహకరించిన వర్తకులు, వ్యాపారులు, ప్రజలు – పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులు నడిపిన అధికారులు – జనం లేకుండానే ప్రయాణించిన బస్సులు భారీగా మోహరించిన పోలీసులు... నాయకుల గృహ నిర్బంధాలు... అక్రమ అరెస్టులు.... ఇలా అడుగడుగునా ఆంక్షలు... ఇవేవీ బంద్‌ను అడ్డుకోలేకపోయాయి. ప్రత్యేక హోదా ఆశచూపి దగాచేసిన కేంద్రం, కేంద్రం విదిల్చిన అరకొర సాయమే మహా ప్రసాదమంటూ స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా ప్రజానీకం రోడ్డెక్కింది. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రత్యేక హోదా కావాల్సిందేనని నినదించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన ఈ బంద్‌కు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాయి. సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతమైంది. ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలిగించింది. కాంగ్రెస్, వామపక్షాలతోపాటు పలు రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఫలితంగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఆర్టీసీ అధికారులపై వత్తిడితెచ్చి బస్సులు నడిపింది. అయితే ఆ బస్సుల్లో ప్రయాణికులు అంతంత మాత్రంగానే కనిపించారు. విజయవాడ బస్‌స్టాండ్‌లోని అన్ని ప్లాటఫారాలు ఖాళీగా కనిపించాయి. బంద్ సమాచారం ముందే తెలిసిన ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జిల్లా అంతంటా మోహరించిన పోలీసులు 590 మంది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు తెల్లవారుజాము 3 గంటల నుంచే వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ,సీపీఎం నేతల ఇళ్లకు వెళ్లి వారిని గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు నేతల ఇళ్లవద్దకు తరలిరావడంతో నాయకులను పోలీసుస్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు ఉంచి వదిలిపెట్టారు. వైఎస్సార్ పార్టీ నేతల భారీ ర్యాలీ బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో పాదయాత్ర, భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారికి అడుగడుగున అడ్డంకులు కలిగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కె.పార్థసారథి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆసీఫ్‌తో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు లెనిన్ సెంటర్ నుంచి రాఘవయ్య పార్కు వరకు పాదయాత్ర నిర్వహించారు. అక్కడి నుంచి బందరు రోడ్డులో బెంజ్ సర్కిల్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సారథి, రాధాను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్, వామపక్ష నేతలు ఆధ్వర్యంలో... ప్రత్యేక హోదా కావాలంటూ వామపక్షాల నేతలు బంద్‌లో పాల్గొన్నారు. సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర అధ్యక్షుడు దోనేపూడి శంకర్, సినీ నటుడు శివాజీ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై నిరసన తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీఆర్డీఏ రాజధాని ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు, పార్టీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, గఫూర్, ఐద్వా ప్రతినిధి రమాదేవి తదితరులు బందరురోడ్డు ర్యాలీ నిర్వహించారు. ఉదయం బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారాకో నిర్వహించిన నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు భారీగా వచ్చి నాయకులపై దౌర్జనం చేసి బలవంతంగా అరెస్టులు చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో ధర్నా చేయగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం జరిగిన బంద్‌కు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ప్రెస్‌క్లబ్ నుంచి అలంకార్ సెంటర్ మీదగా లెనిన్ సెంటర్‌కు, అక్కడి నుంచి ఆంధ్రప్రతిక కార్యాలయం మీదగా తిరిగి ప్రెస్ క్లబ్‌కు ఈ ర్యాలీ చేరింది. జిల్లాలో నిరసనలు ఇలా... ప్రత్యేక హోదా కోసం జిల్లాలో బంద్ ప్రశాంతగా జరిగింది. బందరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)ని పోలీసులు ఆయన ఇంటివద్ద అరెస్టుచేసి, మధ్యాహ్నానికి బంటుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉస్సేన్పాలెం, రామరాజుపాలెం జంక్షన్ వద్ద ఉద్యమకారులు రాళ్లు రువ్వడంతో రెండు బస్సుల అద్దాలు పగిలాయి. పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో బంద్నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును ఉదయం అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసనగా ఆయన పోలీస్ స్టేషన్ వద్దే స్నానం చేశారు. నందిగామలో దున్నపోతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో బ్యానర్లు కట్టి నిరసన తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్ బంద్‌లో పాల్గొనగా పోలీసులు అరెస్టు చేశారు. కైకలూరులో నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పలువురు నల్ల టీషర్టులు, నల్లబ్యాడ్జీలు ధరించి బంద్ పాటించారు. మైలవరం నియోజకవర్గంలో జరిగిన బంద్‌కు నియోజకవర్గ ఇన్చార్జి జోగి రమేష్ నాయకత్వం వహించి మైలవరం సెంటర్లో ధర్నా చేశారు. నూజీవీడులో పలువురు కౌన్సిలర్లు ధర్నా చేశారు. గుడివాడ నియోజకవర్గంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ నాయకత్వంలో బంద్ జరిగింది. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేసి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్‌ప్రసాద్, ఉప్పాల రాము ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అవనిగడ్డలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో బంద్ప్రశాంతంగా జరిగింది. -
ఏజెన్సీ బంద్ సంపూర్ణం
పోలవరం : జిల్లాలోని ఏజన్సీ మండలాల్లో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని, పీసా చట్టాన్ని అమలు చేయాలని, అన్ని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య వ్యవస్థను మెరుగుపర్చాలని, ఏజెన్సీలో విద్యార్థుల సంఖ్య తగ్గారంటూ పాఠశాలలు మూసివేస్తున్న ప్రభుత్వ తీరు మారాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేపట్టారు. ఉదయం నుంచి కూడా పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో బంద్ స్పష్టంగా కనబడింది. జనజీవనం స్తంభించింది. బంద్ సందర్భంగా పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బుట్టాయగూడెంలో జరిగిన ర్యాలీలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సీతారామ్ పాల్గొన్నారు. బంద్ సందర్భంగా పోలవరంలో దుకాణాలు, వ్యాపార ‡సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు ఏటిగట్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్వహించారు. బస్సులు యథావిధిగా తిరిగాయి. ఏజెన్సీకి వెళ్లే బస్సులు మాత్రం బంద్ నిర్వాహకులు అడ్డుకున్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎ.రవి, మండల సీపీఎం కార్యదర్శి గుడెల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. l -
పన్ను చెల్లించని షాప్‌లు క్లోజ్
శంషాబాద్: పంచాయతీకి పన్ను చెల్లించలేదంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పంచాయతీ అధికారులు 12 దుకాణాలకు తాళాలు వేశారు. గురువారం ఉదయం ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మూతపడిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శంషాబాద్ శాఖతోపాటు వినూత్న హోండాషోరూం కూడా ఉన్నాయి. పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆయా సంస్థలు స్పందించలేదని అధికారులు తెలిపారు. -
జనగామలో బంద్ : దుకాణాలు మూసివేత
వరంగల్ : వరంగల్ జిల్లా జనగామలో వ్యాపార వర్గాలు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. పట్టణంలోని ఓ వ్యాపారిని మీడియా ప్రతినిధి వేధించాడు. దీంతో సదరు వ్యాపారి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో వ్యాపారులు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జనగామ పట్టణంలోని వ్యాపార దుకాణాలు అన్ని మూసివేశారు. మీడియా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాపార వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.