బంద్ స్వచ్ఛందం
బంద్ స్వచ్ఛందం
Published Sat, Sep 10 2016 11:14 PM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
– అడుగడుగునా అవరోధాలు సృష్టించిన ప్రభుత్వం
– ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు
– జిల్లా అంతటా నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు
– బంద్‌కు సహకరించిన వర్తకులు, వ్యాపారులు, ప్రజలు
– పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులు నడిపిన అధికారులు
– జనం లేకుండానే ప్రయాణించిన బస్సులు
భారీగా మోహరించిన పోలీసులు... నాయకుల గృహ నిర్బంధాలు... అక్రమ అరెస్టులు.... ఇలా అడుగడుగునా ఆంక్షలు... ఇవేవీ బంద్‌ను అడ్డుకోలేకపోయాయి. ప్రత్యేక హోదా ఆశచూపి దగాచేసిన కేంద్రం, కేంద్రం విదిల్చిన అరకొర సాయమే మహా ప్రసాదమంటూ స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా ప్రజానీకం రోడ్డెక్కింది. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రత్యేక హోదా కావాల్సిందేనని నినదించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన ఈ బంద్‌కు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాయి.
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతమైంది. ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలిగించింది. కాంగ్రెస్, వామపక్షాలతోపాటు పలు రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఫలితంగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఆర్టీసీ అధికారులపై వత్తిడితెచ్చి బస్సులు నడిపింది. అయితే ఆ బస్సుల్లో ప్రయాణికులు అంతంత మాత్రంగానే కనిపించారు. విజయవాడ బస్‌స్టాండ్‌లోని అన్ని ప్లాటఫారాలు ఖాళీగా కనిపించాయి. బంద్ సమాచారం ముందే తెలిసిన ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జిల్లా అంతంటా మోహరించిన పోలీసులు 590 మంది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు తెల్లవారుజాము 3 గంటల నుంచే వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ,సీపీఎం నేతల ఇళ్లకు వెళ్లి వారిని గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు నేతల ఇళ్లవద్దకు తరలిరావడంతో నాయకులను పోలీసుస్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు ఉంచి వదిలిపెట్టారు.
వైఎస్సార్ పార్టీ నేతల భారీ ర్యాలీ
బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో పాదయాత్ర, భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారికి అడుగడుగున అడ్డంకులు కలిగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కె.పార్థసారథి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆసీఫ్‌తో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు లెనిన్ సెంటర్ నుంచి రాఘవయ్య పార్కు వరకు పాదయాత్ర నిర్వహించారు. అక్కడి నుంచి బందరు రోడ్డులో బెంజ్ సర్కిల్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సారథి, రాధాను పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెస్, వామపక్ష నేతలు ఆధ్వర్యంలో...
ప్రత్యేక హోదా కావాలంటూ వామపక్షాల నేతలు బంద్‌లో పాల్గొన్నారు. సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర అధ్యక్షుడు దోనేపూడి శంకర్, సినీ నటుడు శివాజీ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై నిరసన తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీఆర్‌డీఏ రాజధాని ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు, పార్టీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, గఫూర్, ఐద్వా ప్రతినిధి రమాదేవి తదితరులు బందరురోడ్డు ర్యాలీ నిర్వహించారు. ఉదయం బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారాకో నిర్వహించిన నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు భారీగా వచ్చి నాయకులపై దౌర్జనం చేసి బలవంతంగా అరెస్టులు చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో ధర్నా చేయగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో
ప్రత్యేక హోదా కోసం జరిగిన బంద్‌కు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ప్రెస్‌క్లబ్ నుంచి అలంకార్ సెంటర్ మీదగా లెనిన్ సెంటర్‌కు, అక్కడి నుంచి ఆంధ్రప్రతిక కార్యాలయం మీదగా తిరిగి ప్రెస్ క్లబ్‌కు ఈ ర్యాలీ చేరింది.
జిల్లాలో నిరసనలు ఇలా...
ప్రత్యేక హోదా కోసం జిల్లాలో బంద్ ప్రశాంతగా జరిగింది. బందరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)ని పోలీసులు ఆయన ఇంటివద్ద అరెస్టుచేసి, మధ్యాహ్నానికి బంటుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉస్సేన్‌పాలెం, రామరాజుపాలెం జంక్షన్ వద్ద ఉద్యమకారులు రాళ్లు రువ్వడంతో రెండు బస్సుల అద్దాలు పగిలాయి. పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో బంద్‌నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును ఉదయం అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసనగా ఆయన పోలీస్ స్టేషన్ వద్దే స్నానం చేశారు. నందిగామలో దున్నపోతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో బ్యానర్లు కట్టి నిరసన తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్ బంద్‌లో పాల్గొనగా పోలీసులు అరెస్టు చేశారు. కైకలూరులో నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పలువురు నల్ల టీషర్టులు, నల్లబ్యాడ్జీలు ధరించి బంద్ పాటించారు. మైలవరం నియోజకవర్గంలో జరిగిన బంద్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి జోగి రమేష్ నాయకత్వం వహించి మైలవరం సెంటర్‌లో ధర్నా చేశారు. నూజీవీడులో పలువురు కౌన్సిలర్లు ధర్నా చేశారు. గుడివాడ నియోజకవర్గంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ నాయకత్వంలో బంద్ జరిగింది. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేసి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్‌ప్రసాద్, ఉప్పాల రాము ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అవనిగడ్డలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో బంద్‌ప్రశాంతంగా జరిగింది.
Advertisement
Advertisement