‘గడపగడపకూ వైఎస్సార్’తో బెదిరిన టీడీపీ
కొయ్యలగూడెం : గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ప్రజలకు చేరువకావడంలో పార్టీ శ్రేణులు విజయం సాధించాయని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా టీడీపీ జనచైతన్య యాత్రలు నిర్వహిస్తూ జనం చేత చీత్కారాలకు గురైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి యర్రంపేటలో మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలు లేని ప్రాంతాల్లో టీడీపీ జన చైతన్యయాత్రలు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రక్షణ కవచంలా నిలబడుతుందని, వారిపై దాడులు సహిస్తే ముందుగా నేనే టీడీపీ శ్రేణులను ఎదుర్కోవడానికి సైనికుడిని అవుతానని ఆళ్ల నాని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే కాలం దగ్గరల్లోనే ఉందని చెప్పారు. ముందుగా పొంగుటూరులో సర్పంచ్‌ల ఛాంబర్ మండల అధ్యక్షురాలు కాసగాని వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాశం రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, సర్పంచ్‌ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీగంజిమాల, స్థానిక నాయకులు కంఠమణి సుబ్బారాయుడు, గద్దే సురేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చింతలపూడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.