మొగల్తూరు : డెల్టా ఆధునికీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే చేలల్లో నీరు నిలిచిపోతోందని డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజు చెప్పారు.
పనుల్లో నాణ్యత లేకే సాగునీటి సమస్య
Published Fri, Aug 12 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
మొగల్తూరు : డెల్టా ఆధునికీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే చేలల్లో నీరు నిలిచిపోతోందని డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజు చెప్పారు. శుక్రవారం మండలంలోని కాలువలు, చేలను పరిశీలించి అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాలువలకు పూర్తిస్థాయిలో నీరు వదిలితే చేలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిన్నూరు కాలువ శివారు భూములకు నీరందక పోవడానికి కారణం అనధికార తూములేనని, కాలువకు 120 క్యూసెక్కులు వదలాల్సి ఉండగా 167 క్యూసెక్కులు వదిలామని, అయినా శివారు భూములకు నీటి ఎద్దడి ఉందన్నారు.
రామన్నపాలెం అడవిపర్ర ప్రాంతంలో నీరు నిలిచిపోతుందని, దీనికి సంబంధించి దర్బరేవు డ్రెయిన్‌పై కొత్తకాయలతిప్ప వద్ద రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉందన్నారు. వచ్చే వేసవిలో ఈ పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో సుమారు 90 శాతం వ్యవసాయ పనులు పూర్తయ్యాయని, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోనే సాగు ఆలస్యమవుతుందన్నారు. శివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శిథిలావస్థకు చేరుకున్న మొగల్తూరు లాకు స్థానంలో నూతనంగా లాకు ఏర్పాటు చేయటానికి రూ.36 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
Advertisement
Advertisement