హేట్సాఫ్.. సింధు !
ఉద్విగ్న క్షణాలు వీడాయి. ‘జయహో సింధు’ నినాదాలు మిన్నంటాయి. విశ్వ క్రీడా వేదికపై బాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ప్రదర్శించిన పోరాట పటిమకు ‘పశ్చిమ’ ప్రజానీకం జేజేలు పలికింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డులకు ఎక్కిందని తెలిసి సంబరాలు జరుపుకుంది. సింధు పూర్వీకులు మన జిల్లా వాసులే. ఆమె తాతయ్య ఏలూరు నగరానికి చెందిన వారు. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు వెళ్లారు. సింధు తండ్రి పుసర్ల వెంకటరమణ అక్కడే జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినప్పటికీ మన జిల్లాతో ఆ కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు, ఆమె కుటుంబ సభ్యులు ఏటా రెండు మూడుసార్లు పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయానికి వస్తుంటారు. ఆ కుటుంబానికి రాట్నాలమ్మ అంటే ఎనలేని భక్తిభావం. సింధు రియో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు జూన్ 19న కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తండ్రి వెంకటరమణ శుక్రవారం కూడా ఈ ఆలయానికి వచ్చారు. రాట్నాలమ్మ ఆశీస్సులు, కోట్లాదిమంది భారతీయుల దీవెనలే రియోలో సింధు రజత పతకాన్ని సాధించడానికి కారణమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈనెల 25 లేదా 26వ తేదీన సింధుతో కలిసి అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పారు.
జయహో సింధు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)ఫఒలింపిక్ పోటీల్లో భారత దేశం తరపున తెలుగు బిడ్డ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం సాధించడంతో నగరంలో యువత సంబరాలు చేసుకున్నారు. శేఖర్ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్ కమ్ముల సోమశేఖర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. అలాగే పీవీ సింధు రూపాన్ని నగరానికి చెందిన సూక్ష్మ కళారూపాల శిల్పి మేతర సురేష్ బాబు అగ్గిపుల్లపై చెక్కారు.