ఆటో బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
కైకరం (ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం వద్ద శుక్రవారం తెల్లవారు జూమున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి, డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని భవానీపురానికి చెందిన ఆకుమళ్ల రమణారెడ్డి(29) గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో వాషింగ్‌మెషీన్లు, కూలర్లలోడుతో తణుకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కైకరం వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్ రమణారెడ్డి అక్కడక్కిడే మృతిచెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.