వ్యాయామ కళాశాలకు మినీ స్టేడియం
వ్యాయామ కళాశాలకు మినీ స్టేడియం
Published Sat, Apr 22 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
దెందులూరు : రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలకు మరోసారి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. కళాశాలకు మినీ స్టేడియం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలను జారీ చేసింది. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల కృషి, సహాయ, సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం మినీ స్టేడియం మంజూరు చేసిందని తెలిపారు. స్టేడియం మంజూరు ద్వారా వ్యాయామ కళాశాలకు మరింత కీర్తి ప్రతిష్టలు రావటమే కాకుండా, శిక్షణ పొందే వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులకు మరెంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తన సొంత వ్యయంతో కళాశాలలో రెండో సంవత్సరం వ్యాయామ విద్యనభ్యసిస్తున్న ఐదుగురికి ప్రతి సంవత్సరం ఫీజులు చెల్లిస్తానన్నారు.
ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలు ప్రారంభం..
వ్యాయామ కళాశాలలో శుక్రవారం ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్రామ్యూరల్ డైరెక్టర్ వి.శ్యామలా ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల్లో 16 గ్రూపులకు చెందిన డీపీఈడీ, బీపీఈడీ వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో గ్రూపులో 25 మంది ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాగంటి మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న వ్యాయామ అధ్యాపకులు పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో వ్యాయామ అభివృద్ధి, రాష్ట్ర, జాతీయ స్థాయి విభాగాల్లో ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్నారు. తొలుత వాలీబాల్ సర్వీస్ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకర్షణ గా నిలిచింది.
Advertisement
Advertisement