లలిత స్వర కమలం | Fine voice lalitha | Sakshi
Sakshi News home page

లలిత స్వర కమలం

Published Sun, Oct 26 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

లలిత స్వర కమలం

లలిత స్వర కమలం

లేలేత పదాలు.. సంగీతంలో లాలిత్యం.. గానంలో మాధుర్యం.. కలగలసిన కమ్మదనం లలిత గీతం. తేటతెలుగుతో ముడివేసుకున్న లలిత సంగీత ఝరి.. ఈనాటి సంగీత ఆధునిక హోరులో వినిపించకుండా పోయింది. శిశిరాన్ని తరిమి కోకిలకు గొంతుక య్యే వసంతంలా.. లలిత సంగీతానికి పూర్వవైభవం తెచ్చే ఆమని రాగం వస్తుందన్నారు ప్రముఖ గాయకురాలు వేదవతి ప్రభాకర్. లలిత గీతాలకు చలనం నేర్పిన స్వరకర్త, పదకర్త పాలగుమ్మి విశ్వనాథం సంస్మరణార్థం సప్తపర్ణిలో శనివారం జరిగిన స్మృత్యాంజలి కార్యక్రమంలో ఆమె లలిత గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె సిటీప్లస్‌తో పంచుకున్న మరిన్ని విషయాలు..
 
 పాలగుమ్మి విశ్వనాథం అనేక మంది లలిత సంగీతకారులకు అవకాశం కల్పించారు. అయితే ఆయన స్వరకల్పన చేసిన, రాసిన ఎక్కువ గీతాలు పాడే అవకాశం, అదృష్టం నాకు లభించింది. ఆయన కేవలం స్వరకర్తే కాదు, ఎంతో బాగా పాటను నేర్పించే వారు. లలిత సంగీతం ఎలా పాడాలి, పాడటానికి కావలసిన మెలకువలు, ఈ సంగీతానికి గాత్రాన్ని ఎలా పలికించాలి,మైక్ ఎలా వాడాలి ఇలా ఎన్నో ఆయన నేర్పించారు.

నాడు ప్రాభవం

లలిత సంగీతానికి ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత లేదు. అప్పట్లో సినిమా సంగీతంతో పాటు లలిత సంగీతానికి ఎంతో ప్రాధాన్యం, ఆదరణ వుండేది. ఆ సమయం లైట్ మ్యూజిక్ స్వర్ణయుగం అని చెప్పాలి. అప్పట్లో అనేక మంది లైట్ మ్యూజిక్ కంపోజర్స్
 ఉండేవారు. ఈ కాలంలో క్లాసికల్, లైట్ మ్యూజిక్‌కి ఆడియన్స్తగ్గిపోయారని చెప్పాలి. లలిత సంగీత కచేరీకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు సినిమా పాటలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది.
 సంగతుల సంగతి..

 లైట్ మ్యూజిక్ అంటే చాలా తేలికగా పాడవచ్చుఅనుకుంటారు. కానీ అది అంత సులువైన విషయం కాదు. సంగీతంలో
 సంగతుల సాధన చాలా ముఖ్యం. అందుకే వెస్ట్రన్ మ్యూజిక్ అయినా, హిందుస్తానీ, కర్ణాటిక్ ఏ సంగీతమైనా పాడుతూ ఉండాలి. కొన్ని సినిమా పాటల్లో  క్లిష్టమైన సంగతులు ఉంటాయి. వాటినీ ప్రయత్నించాలి. మనసులో అనుకున్న భావాన్ని గొంతులో
 పలికించగలిగితేనే లలిత గీతం ఆకట్టుకుంటుంది.

 లలిత రాగాలు..

 శాస్త్రీయ రాగాలపై అవగాహన ఉంటే లలిత సంగీతం వినసొంపుగా ప్రజెంట్ చేయగలుగుతాం. లలిత సంగీతంలో శాస్త్రీయ పోకడ ఎక్కువగా కనిపించకపోయినా.. ప్రభావం మాత్రం ఎంతో కొంత ఉంటుంది. శాస్త్రీయ సంగీత సాధన చేస్తే మన గొంతుకను లలిత సంగీతానికి అనువుగా మలచుకోవడం సులువవుతుంది. అలా కాకుండా లలిత సంగీతం పాడినా.. అది ఎక్కువ రోజులు
 నిలబడలేదు.

ఈ తరం సుస్వరం..

 ఈ తరం పిల్లల్లో లలిత గీతాలపై మక్కువ కనిపిస్తోంది. సాలూరి రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి ఇలా ఆనాటి మేటి తరం పాటలను ఇంటరె ్నట్‌లో వెతుక్కుని మరీ నేర్చుకుంటున్నారు.  పలు టీవీ షోల్లో చిన్నారులు  చూపుతున్న ప్రతిభ చూస్తుంటే ఆనందం వేస్తోంది.
 
బుల్లితెర..భారీ బాధ్యత..

లలిత సంగీతానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే టీవీ ద్వారానే సాధ్యం. ఈ విషయంలో మనం చేసే ప్రయత్నం ఎక్కువ మందికి రీచ్ కావాలంటే బుల్లితెరతోనే సాధ్యం. అప్పట్లో దూరదర్శన్, రేడియో మాత్రమే ఉండేవి. ఆడియన్స్‌కు లైట్ మ్యూజిక్‌ని వినే అవకాశం కల్పిస్తే ఆదరణ తప్పకుండా ఉంటుంది. మంచి సినిమా వస్తే ఎలాగైతే చూస్తారో.. మంచి సంగీతం వస్తే కూడా తప్పకుండా వింటారు. అందుకే  టీ వీ చానళ్లు బాధ్యతగా తీసుకుంటే లలిత సంగీతానికి తప్పకుండా మంచిరోజులు వస్తాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement