జగమంతా నిండాలి జానపదం
- సంగీత విద్వాంసుడు
హైటెక్ తరంలోని యువతను జానపదం వైపు మళ్లించాలనేదే తన ధ్యేయమని చెబుతున్నారు సంగీత విద్వాంసుడు, ఆమెరికాలోని ఫార్మి(ఫోక్ ఆర్ట్స్ రీసెర్చ్ అండ్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్) వ్యవస్థాపకుడు మానాప్రగడ శ్రీసాయి సాయిచక్. జానపద గీతోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన సాయిచక్ ‘సిటీ ప్లస్’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
నాన్న నుంచి కళలు..
మా నాన్న మానాప్రగడ నరసింహమూర్తి. జానపద కళాభిమాని, కళాకారుడు. ఆయన నుంచే నాకు కళలు అబ్బాయి. మూడేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాను. హార్మోనియంతో మొదలుపెట్టి కీబోర్డు వాయించడం వరకు చిన్నప్పుడే నేర్చుకున్నాను. పియానోపై మక్కువతో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. రెండింటిలోనూ ప్రావీణ్యం సాధించడంతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. పియానో వాయించడంలో నాకంటూ సొంత స్టైల్ ఉండాలని భావించా. ‘జల్‌రా’ పేరిట పియానో స్టైల్ సృష్టించా.
‘వందేమాతరం’తో గిన్నిస్ రికార్డు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 2010 మే 16న వందేమాతరం గీతాన్ని 265 భాషల్లో పాడినందుకు తొలి గిన్నిస్ రికార్డు సాధించా. ప్రీమౌంట్ సిటీలో 2010 ఆగస్టు 15న ఒకే బృందంతో 277 భాషల్లో పాడి రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించా. ఆ తర్వాత.. 2011, నవంబర్ 18న అత్యంత వేగంగా పియానో వాయించే కళాకారుడిగా మూడో గిన్నిస్ రికార్డు సాధించా. అమెరికా ప్రభుత్వం ఔట్‌స్టాండింగ్ రీసెర్చర్‌గా గుర్తింపునిచ్చింది. అది కమిషనర్ స్థాయి హోదా.
స్వరాలు ఒకటే.. బాణీలే వేరు
భారతీయ, అమెరికన్ సంగీతాల్లో స్వరాలు ఒకటే.. బాణీలు వేరు. భారత్‌లో గళానికి, రచనకు ప్రాధాన్యమిస్తారు. అమెరికాలో సంగీతానికి ప్రాధాన్యమిస్తారు. మా నాన్న జానపదాలపై పరిశోధన చేశారు. ఆయన శ్రమ వృథా కాకూడదు. ఆయన కృషిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఏటా భారత్ వచ్చి జానపద గీతోత్సవం ఏర్పాటు చేస్తున్నా. పదేళ్లుగా 30 మంది విశ్రాంత జానపద కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నా.
- కోన సుధాకర్‌రెడ్డి