‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది, కూసుండనీదురా కూసింత సేపు‘ అంటారు నండూరి సుబ్బారావు తన ఎంకి పాటల్లో. 107 ఏళ్ల వయసున్న కుంజమ్మకు ఈ మాట సరిగ్గా సరిపోలుతుంది. కుంజమ్మ గాయని. కర్ణాటక సంగీతకారిణి. తన పన్నెండవ ఏట నుండి ఆమె గుండె ఆమె గొంతులో స్వరబద్ధంగా కొట్టుకుంటూ ఉంది. ‘సంగీతమే నా హృదయ స్పందన’ అంటారు కుంజమ్మ, గమకం వంటి ఒక చిరునవ్వుతో. కుంజమ్మ 21వ ఏట ఆమె భర్త చనిపోయారు.
ఆర్మీలో పనిచేసేవారు ఆయన. ఆనాటి నుంచీ సంగీతమే ఆమెకు జీవనాధారం, ్రపాణాధారం అయింది. నేటికీ కొల్లమ్‌లో ఆమె ఉంటున్న పూయప్పల్లిలో ఆమె గాత్రం గుడి గంట వంటిది. ఆ ఊళ్ళో ఏ వేడుకా, ఏ పెళ్ళీ, ఏ పుట్టిన రోజూ ఆమె పాడకుండా, ఆమె హార్మనీ వాయించకుండా మొదలైనట్టు కాదు, ముగిసినట్టూ కాదు. అంత్యక్రియల్లోనూ ఆమె స్వరం అనునయిస్తూనే అవతలి వారిని సాంత్వన పరుస్తుంది.
కుంజమ్మకు కూతురు లిల్లీకుట్టి. కుంజమ్మకు పూయప్పల్లి ఆత్మబంధువు. ఊరికన్నా ఆమె చిన్నదో, ఆమెకన్నా ఊరు చిన్నదో చెప్పలేం. లేదా కుంజమ్మ, పూయప్పల్లి కవలలు అయి ఉండాలి. ఆమెకు కాస్త విశ్రాంతిని ఇచ్చేటందుకు ఆమె వయసు ఎంత ప్రయత్నిస్తున్నా... ‘పోవే, నాకు విశ్రాంతి ఏంటీ?!’ అని గాత్రాన్ని, సంగీత వాద్యాన్ని శ్రావ్యంగా పలికిస్తూనే, సుమధుర రాగాలను ఒలికిస్తూనే ఉన్నారు కుంజమ్మ!!
Comments
Please login to add a commentAdd a comment