నేడు వరల్డ్ మెజీషియన్ డే
ఇంద్రజాలం.. ఆనందం, ఉత్కంఠను కలిగిస్తోంది.. కార్పొరేట్ జీవితంలో ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు.. మనసును రీచార్జి చేసేందుకు మేజిక్ దోహదపడుతుంది. మాయలోళ్లు (మెజీషియన్) చేసే విన్యాసాలు అబ్బురపరచడంతో విశ్వవాప్తంగా ఈ కళ పేర్గాంచింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఇంద్రజాలం రానురానూ చిన్నచూపునకు గురవుతోంది. ఉత్సవాలు, వివాహ, పుట్టినరోజు వేడుకలు, రాజకీయ నాయకుల సభావేదికలపై ఆహుతులను ఉత్తేజపరిచేందుకు ఈరోజుల్లో ఎక్కువుగా మేజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల పలువురు మెజీషియన్లు ఇతర వృత్తులవైపు చూస్తున్నారు. గతంలో జిల్లాలో 100 మందికిపైగా ఉన్న ఇంద్రజాలికులు ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉండటం ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 23వ తేదీన ప్రపంచ ఇంద్ర జాలికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
- ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్)
మేజిక్‌లు 23 రకాలు
ఇంద్రజాల కళలో 23 రకాలు ఉన్నారుు. ఒక్కో కళాకారుడూ కొన్ని రకాలను మాత్రమే ప్రదర్శించడంలో నిష్ణాతులవుతుంటారు. అన్ని రకాల కళలను ఒకే వ్యక్తి చేసే అవకాశం ఉండదని మెజీషియన్లు అంటున్నారు. సుమారు 10 రకాల మేజిక్‌లు మాత్రమే తరచుగా చేస్తుంటారు. వాటిలో మెకానికల్ రకం మొదటిది దీనిలో కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి ఇంద్రజాలికులు మేజిక్ చేస్తారు. హస్త లాఘవం మరో రకం. వస్తువులను చేతిలోనే దాచి, గాలిలో నుంచి తీసినట్టుగా చూపించడం దీని ప్రత్యేకత.
సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ..
ఇల్యూయన్ మరో రకం. ఇది ఆహుతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మనిషి లేదా జంతువును ముక్కలుగా చేయడం, అక్కడి నుంచి మాయం చేయడం. మరలా యథావిధిగా అమర్చడం దీని ప్రత్యేకత. ఇటువంటి మేజిక్‌లను మనం ఎక్కువుగా ఎగ్జిబిషన్‌లలో చూస్తుంటాం. వెంట్రిలాక్విజం రకానికి ప్రత్యేక స్థానం ఉంది. బొమ్మతో మాట్లాడించడం ఇందులో మనకు కనిపిస్తోంది. సైంటిఫిక్ మేజిక్ మరో రకం. లెక్కలు, సైన్స్‌పై మేజిక్‌లు చేయడం ఈ రకంలోకి వస్తుంది. ఇటువంటి రకాలు ఎక్కువుగా ప్రాచుర్యంలో ఉన్నారుు.
కొత్తవారు రావడం లేదు
మెజీషియన్ వృత్తిలోకి కొత్తగా ఎవరూ రావడం లేదని కళాకారులు అంటున్నారు. అభిరుచి మేరకు నేర్చుకుని వారి ఖాళీ సమాయాల్లో స్నేహితులు, కుటుంబసభ్యులను మెప్పించడానికే ఈ కళను నేర్చుకున్న వారు తప్ప ఇదే జీవనాధారంగా గడిపేవారు జిల్లాలో ఒకరిద్దరూ తప్ప ఎవరూ లేరనే చెప్పాలి.
14 ఏళ్ల వయసు నుంచీ..
ఏలూరుకు చెందిన సాయిరామ్ ఈవెంట్స్ అధినేత కొవ్వలి శ్రీనివాస్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఇంద్రజాలికుడిగా నిలిచారు.1964లో కొవ్వలి సేతు మాధవరావు, లక్ష్మి నరసమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన శ్రీనివాస్ చిన్నతనం నుంచి ఇంద్రజాలంపై ఆసక్తి పెంచుకున్నారు. విఠలాచార్య చిత్రాలు చూసి మాయలు, మంత్రాలకు ఆకర్షితులయ్యూరు. 14 ఏళ్ల వయసులో ఏలూరులో ఆచార్య జి.డీలానంద్ అనే సినీ ఆర్చురీ డెరైక్టర్ (లవకుశ చిత్రంలో ధనుర్ విద్య) వద్ద శిష్యునిగా చేరారు. 1979 నుంచి మెజీషియన్‌గా
షోలు చేస్తున్నారు. దీనినే జీవనాధారంగా భావించి ముందుకు సాగుతున్నారు.
ఆదరణ తగ్గలేదు
దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది కార్యక్రమాలను నిర్వహించి అభిమానులను సొంతం చేసుకున్నాను. నా వద్ద సుమారు 30 మంది ఇంద్రజాల విద్యను నేర్చుకుని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అభిరుచి ఉన్నవారే. ఇంద్రజాల కళకు ఆదరణ తగ్గలేదు. గతంలో కంటే ఎక్కువ షోలు చేస్తున్నాం.
- కొవ్వలి శ్రీనివాస్,
సీనియర్ మెజీషియన్
అబ్రకదబ్ర మాయూ లేదు.. మర్మం లేదు..
Published Mon, Feb 23 2015 1:51 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
Advertisement