దేవుడి ముందు బిక్షగాడిలా వేడుకుంటాను... | youth have to set goal as musician : AR Rehman | Sakshi
Sakshi News home page

దేవుడి ముందు బిక్షగాడిలా వేడుకుంటాను...

Published Mon, Jan 6 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

దేవుడి ముందు బిక్షగాడిలా వేడుకుంటాను...

దేవుడి ముందు బిక్షగాడిలా వేడుకుంటాను...

‘‘భారతీయుడిగా పుట్టడమే ఓ గొప్ప అదృష్టం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని పొందడం అంటే ఇంకా గొప్ప విషయం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా గురువులకు ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగంగా తన హృదయాన్ని ఆవిష్కరించారు ఎ.ఆర్. రహమాన్. సంగీత రంగానికి రెహమాన్ చేస్తున్న సేవలకుగాను ప్రపంచవ్యాప్తంగా ఆయన 25వ లెజెండ్‌గా గుర్తింపు పొందారు. గత నెల ఈ అవార్డుని స్వీకరిస్తున్న సమయంలో రెహమాన్ చెప్పిన మాటలివి. నేడు ఈ సంగీత సంచలనం పుట్టినరోజు. ఈ సందర్భంగా రెహమాన్ మనోభావాలు ఈ విధంగా...
 
  మ్యూజిక్‌ని మన దేశంలో సీరియస్‌గా తీసుకోవాలి. దీన్ని ఒక వృత్తిగా తీసుకోవడానికి వెనకాడుతున్నారు. తమ అబ్బాయి లేక అమ్మాయి డాక్టరో, ఇంజినీరో అవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అంతేకానీ ఓ మంచి మ్యుజీషియన్ అవ్వాలని కోరుకోరు. కానీ, నా చిన్నప్పుడు మా ఇంట్లో పరిస్థితి వేరు. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వాలనుకునేవాణ్ణి. అయితే, మా అమ్మగారికి మాత్రం నన్ను మ్యుజీషియన్‌గా చూడాలని ఉండేది. మన దేశంలో మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చేవారి సంఖ్య తక్కువే. అదే విదేశాల్లో అనుకోండి.. మా అబ్బాయి పాప్ ఆర్టిస్ట్ అనో మా అమ్మాయి రాక్‌స్టార్ అనో చెప్పుకోవడానికి గర్వపడతారు. మనం దేశంలో కూడా ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నా.
 
  నాకు సంగీతం అంటే ప్రాణం. అందుకని నా పిల్లలు ఈ రంగంలోకి వస్తానంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? అయితే, పిల్లలను ఏ విషయంలోనూ ఒత్తిడి చేయకూడదు. వాళ్ల అభిరుచులను గౌరవించాలి. అందుకే, నా పిల్లలు ఏం చేస్తానంటే ఓ తండ్రిగా దాన్ని ప్రోత్సహిస్తా. మా అమ్మాయి ఖతీజా బాగా చదువుతోంది. ప్లస్ టూలో 94 పర్సంట్ సాధించింది.  నేనొకప్పుడు సాదా సీదా వ్యక్తిని. ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి మా అమ్మగారు కారణం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన సంగీత పరికరాలను అద్దెకి ఇచ్చేది మా అమ్మగారు. ఆ డబ్బుతో మమ్మల్ని పోషించేది. వాటిని అమ్మేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని, ఆ డబ్బుని వడ్డీకి ఇస్తే కుటుంబం గడిచిపోతుందని కొంతమంది మా అమ్మగారికి సలహా ఇచ్చారు. కానీ, ఆమె అందుకు ఒప్పుకోలేదు. ‘నాకో కొడుకు ఉన్నాడు. తను చూసుకుంటాడు’ అని ధీమాగా చెప్పేది.
 
  నాకు సంగీతం, దేవుడు తప్ప మరొకటి తెలియదు. నేనీ స్థాయిలో ఉండటానికి కారణం ఆ దేవుడే. అందుకే, స్టార్‌డమ్ నాలో ఏ మార్పూ తీసుకు రాలేదు. డబ్బులు వస్తాయి.. పోతాయి. ఫేమ్ వస్తుంది.. పోతుంది. అందుకే వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. నా దృష్టిలో ఎవరి స్థాయిలో వాళ్లు సెలబ్రిటీయే. సక్సెస్ అవ్వడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. వినయంగా ఉండటం కూడా అవసరం. విజయాన్ని, పేరుని నెత్తికి ఎక్కించుకుంటే ప్రమాదం. ఆ ప్రమాదం దరిదాపుల్లోకి కూడా నేను వెళ్లను. ఈ సందర్భంగా ఓ ఉదాహరణ చెబుతా. మనం కనక హైవేలో కారుని మితిమీరిన వేగంతో నడిపాం అనుకోండి.. అదుపు తప్పుతాం. జీవితం కూడా అంతే. డబ్బు, పేరుని నెత్తికెక్కించుకోకుండా అదుపులో పెట్టుకోవాలి.
  వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేను సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి ఓ కారణం నా భార్య. మా పెళ్లికి ముందు నేను తనతో మనసు విప్పి కొన్ని విషయాలు చెప్పాను.
 
  ‘పెళ్లయిన తర్వాత మనిద్దరం ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు, ఎవరైనా అర్జంటుగా పాట తయారు చేసి ఇవ్వమని అడగొచ్చు. అప్పుడు మన ప్లాన్‌ని మార్చుకోవాల్సి వస్తుంది’ అన్నాను. నా జీవితం ఇలా ఉంటుంది అని పెళ్లికి ముందే తనకు చెప్పడంవల్ల ఈ రోజు మేమిద్దరం కలిసి ఉన్నాం. లేకపోతే ఎప్పుడో విడిపోయేవాళ్లం. నేనో పాట తయారు చేయడం మొదలుపెట్టిన ప్రతిసారీ... ఇక అయిపోయాం అనిపిస్తుంది. దేవుడి ముందు బిక్షగాడిలా గిన్నె పట్టుకుని, ఆ గిన్నెలో ‘సరైన ఆలోచనలు నింపు’ అని వేడుకుంటాను. ఇలా ప్రతి పాటకూ ఆ దేవుడి సహాయం తీసుకుంటాను. ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు నా మీద చాలా దయ చూపిస్తున్నాడు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement