nireekshana
-
హై ఓల్టేజ్ యాక్షన్
సాయిరోనక్, ఎనా సహా జంటగా వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నిరీక్షణ’. టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై పి.రాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్ తొలిసారి మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘నిరీక్షణ’. ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ‘రాక్షస..’ అనే ప్రమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా రోల్ రిడా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రద్ధాదాస్, సన ప్రత్యేక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి వి., సంగీతం: ‘మంత్ర’ ఆనంద్. -
‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో
సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. ఆయన తనయులు రమేష్, జీవా తెలుగు, తమిళ భాషల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'విద్యార్థి' చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైన రమేష్ ఆ తర్వాత తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా రమేష్ తెలుగులో నటించిన సినిమా 'ఒకటే లైఫ్'. ఇప్పుడు హీరో రమేష్ 'నిరీక్షణ' చిత్రంలో మొదటిసారిగా మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిరోనక్, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'నిరీక్షణ'. ఈ చిత్రంలో హీరో రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా శ్రద్ధా దాస్, సన స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, మధుసూదన్, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ పాటలను అందిస్తున్నారు. -
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ప్రియురాలిని చుక్కతో పోల్చడం మామూలే. కానీ విధివశాత్తూ ఆమెకే దూరమైపోతే ఇక నాయకుడు చేయగలిగేదేమిటి? వేలాది నక్షత్రాల్లో ఆమెను వెతుక్కోవడమే. నిరీక్షణ చిత్రంలోని ఈ పాట రాసినవారు ఆచార్య ఆత్రేయ. సంగీతం కూర్చినవారు ఇళయరాజా. పాడినవారు కె.జె.జేసుదాస్. 1982లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు బాలు మహేంద్ర. అర్చన, భానుచందర్ నటీనటులు. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే పూసిందే ఆ పూలమాను నీ దీపంలో కాగిందే నా పేద గుండె నీ తాపంలో ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం తానాలే చేశాను నేను నీ స్నేహంలో ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగా వ్యర్థం చట్టందే రాజ్యం -
పూసిందే ఆ పూల మాను నీ దీపంలో...
చిత్రం: నిరీక్షణ రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇళయరాజా గానం: కె. జె. ఏసుదాసు బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. అన్ని పాటల్లోకీ ‘సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే/ ఇన్ని యేల సుక్కల్లో నిన్ను నేనెతికానే’ నాకు బాగా నచ్చిన పాట. ఈ పాట షూటింగ్ బెంగళూరు జైలు అధికారుల అనుమతితో అక్కడ చేశాం. జైలు అధికారులు మాకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అక్కడి ఖైదీలు ఏయే పనులు ఎలా చేస్తారో దగ్గర నుంచి గమనించాక చిత్రం తీశారు బాలు మహేంద్ర.నేరస్థులంతా రాత్రుళ్లు జైలు లోపల ఉంటారు. పగటిపూట పనులు చేస్తుంటారు. కొందరు రాళ్లు కొడతారు, కొందరు చెట్లు నరుకుతారు, కొందరు సిమెంట్ పని చేస్తారు, కొందరేమో పనిచేస్తున్నవారికి గార్డ్స్‌తో పాటు మంచి నీళ్లు, ఆహారం సప్లయి చేస్తుంటారు. అవన్నీ దగ్గరుండి గమనించాం. అక్కడి ఖైదీల కథలు మా మనసులను కదిలించాయి, ఖైదీలంతా వారి స్వవిషయాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు. ఎవరో చేసిన నేరానికి మేం బలయ్యామని వారు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ఏ నేరం చేయకుండా కూడా చాలామంది యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్నారు. భార్య వచ్చి ఏడాదికోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది. వారి గురించి ఎవరు పోరాడతారో అర్థం కాదు. ఈ చిత్రంలో నా పాత్ర కూడా అలాంటిదే కావడం యాదృచ్ఛికం. వాళ్లతో కలిసిపోయినట్లు ఉండటం కోసం నేను, బాలు మహేంద్రగారు జైలులో వారు ఆ రోజు ఏది తింటున్నారో తెలుసుకుని, అదే వంటకం చేయించుకుని తెచ్చుకుని తినేవాళ్లం. వారంతా దీపావళి పండుగ చేసుకున్నట్లే అనుభూతి చెందారు.‘పూసిందే ఆ పూలమాను నీ దీపంలో/ దాగిందే నా పేద గుండె నీ తాపంలో/ఊగానే నీ పాటలో ఉయ్యాలై/ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై/ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్లకు చేరం/తీరందీ నేరం’ అనే మొదటి చరణంలో తన ప్రియురాలిని తలచుకుంటూ కుమిలిపోతాడు కథానాయకుడు. ఆత్రేయ గారు స్వయంగా ఈ పాత్రలో ప్రవేశించి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో నేను దిగంబరంగా నటించడం చూసి కొందరు ఖైదీలు కన్నీరు కార్చారు. ‘అయ్యో! ఇంత పెద్ద ఆర్టిస్టు అయి ఉండి మీరు ఇలా నటించడమేంటి. ఏ తప్పూ చేయకుండా మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారేంటి?’ అని అమాయకంగా ప్రశ్నించారు. వాస్తవానికి దగ్గరగా ఉండటం కోసం చేస్తున్నానని చెబితే, వారు ‘మీలాగ ఏ హీరో కూడా నటించరండి’ అని వారు అనడం నాకు ఇంకా బాగా గుర్తు. ఆ జైలులో తెలుగు వారు, తమిళులు ఎక్కువగా ఉండటం వల్ల వారు నన్ను తేలికగా గుర్తించారు. అదొక చెప్పరాని అనుభూతి. వాళ్ల కష్టాలతో పోలిస్తే మనం చాలా హాయిగా ఉన్నట్లే అనుకున్నాను. జైలులో బయటివారికి రాత్రుళ్లు అనుమతి ఇవ్వరు కనుక, జైలు సీన్లన్నీ పగటిపూటే తీశారు. బాలు మహేంద్రగారి గురించి ఒక పూట కాదు ఒక పుస్తకం కూడా చాలదు చెప్పడానికి. ఆయన మంచి నటుడు కూడా. ఆయనకు ఆయనే సాటి. పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బంగారు పతకం సాధించిన బాలు మహేంద్ర కెమెరాతో మాయమంత్రాలు చేస్తారు. ‘తానాలే చేశాను నేను నీ స్నేహంలో/ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో/ఆనాటి నీ కళ్లలో నా కళ్లే / ఈనాటి నా కళ్లలో కన్నీళ్లే / ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగ వ్యర్థం/ చట్టందే న్యాయం’ అనే చరణంలో కథానాయిక అర్చనను ఒక బ్లాక్ క్రియోపాత్రాలాగ సృష్టించారు బాలూమహేంద్ర. కెమెరాలో నుంచి బయటకు వచ్చేస్తే, మామూలుగా ఉంది అర్చన. కెమెరాలో నుంచి చూస్తే మనం వివరించలేం.ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఊటీలో షూటింగ్ జరుగుతుండగా, మద్రాసు నుంచి ఒక పార్సిల్ వచ్చింది. జేసుదాసు స్వరంలో రికార్డు చేసిన ‘సుక్కల్లే తోచావే’ పాట క్యాసెట్ అది. ఆ పాట జేసుదాసు గొంతులో వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్యాసెట్టుతో పాటు ఒక ఉత్తరం ఉంది. బాలూ మహేంద్రగారిని ఉద్దేశిస్తూ, ‘డియర్ బాలూ, నేను నా జీవితంలో అద్భుతమైన పాటను నా శక్తి వంచన లేకుండా హార్ట్ అండ్ సోల్ పెట్టి పాడాను. మీరు చిత్రంలో అంతే అందంగా చూపించండి. నేను సినిమా చూస్తాను’ అని రాశారు. ఆ మాటలకు బాలు మహేంద్ర ఉక్కిరిబిక్కిరైపోయారు. ఒక్క క్షణం పాటు కదలకుండా నిశ్చలంగా ఉండిపోయారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
రిలేషణం: భానులో మంచి మ్యుజీషియన్ ఉన్నాడు!
భానుచందర్ అంటే ఒక జనరేషన్‌ని ఉర్రూతలూగించిన యాక్షన్ హీరో. ఓ పక్క టై, మెరుపుదాడిలాంటి యాక్షన్ ఫిలిమ్స్ చేసినా కూడా... తరంగిణి, నిరీక్షణ, సూత్రధారులు, మంచి మనసులులాంటి చిత్రాలతో తనలోని వెర్సటాలిటీని ఆవిష్కరించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉన్న భానుచందర్ గురించి ఆయన అన్నయ్య మూర్తి చందర్ చెబుతోన్న విశేషాలివి! ‘‘మా నాన్నగారు మాస్టర్ వేణు ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయనకు మేమిద్దరమే కొడుకులం. భానుకన్నా నేను రెండేళ్లు పెద్ద. వయసు గ్యాప్ పెద్దగా లేకపోవడం వల్లనేమో, ఇద్దరం బ్రదర్స్‌గా కన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. బాగా తిట్టుకుని, కొట్టుకునేవాళ్లం. నాకు పంతమెక్కువ. రెండు, మూడు రోజులు మాట్లాడకపోతే, వాడే వచ్చి బతిమాలుకునేవాడు. ఇద్దరిదీ ఒకటే మంచం. స్కూలు ఫైనల్ వరకూ ఒకే కలర్ డ్రెస్ కూడా. మా ఇద్దర్నీ రామలక్ష్మణులనేవారు. సినిమాలకు, షికార్లకు కలిసి వెళ్లాల్సిందే. ఎక్కువ ఇంగ్లిష్ సినిమాలకు వెళ్తుండేవాళ్లం. క్రికెట్ కూడా ఆడేవాళ్లం. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్. వాడు గిటార్ నేర్చుకుంటే, నేను పియానో ట్రై చేసేవాణ్ణి. నాన్నగారిలాగా వాడూ మ్యూజిక్ డెరైక్టర్ కావాలని అమ్మ ఆకాంక్ష. నన్నేమో డాక్టర్ని చేయాలని కోరిక. రెండూ నెరవేరలేదనుకోండి. సెప్టెంబర్ 8, ఫన్డే రిలేషణంలో... సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సోదరుడు సీతారామారావుగారికి కేవలం ఇద్దరు ఆడపిల్లలు అని పొరపాటుగా ప్రచురితమైనది. వాస్తవంగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు. కుమారుడు శేషగిరిబాబు ఒక కంపెనీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పొరపాటుకు చింతిస్తున్నాం. నౌషాద్‌గారి దగ్గర సంగీత శిక్షణ కోసమని భాను కొన్నాళ్లు ముంబై వెళ్లాడు. ఆ టైమ్‌లో చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కి బానిసయ్యాడు. నేను వాణ్ణి బలవంతంగా మద్రాసు తీసుకొచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. కరాటే నేర్చుకున్నాక వాడి లైఫ్ స్టయిల్ మారిపోయింది. అప్పట్నుంచీ కరెక్ట్ రూట్లోకి వచ్చేశాడు. సినిమా ఆర్టిస్టు అవుతానంటే వద్దని నేను నిరాశపరిచేవాణ్ణి. కానీ భాను మొండివాడు. అనుకున్నది సాధించాడు. తను హీరో కావడం నాకు సర్ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పుడు తనలో హీరో ఫీచర్స్ ఉండేవి కాదు. కష్టపడి, ఇష్టపడి తనను తాను డెవలప్ చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నాలో చిన్నప్పటినుంచీ స్పిర్చువల్ థాట్స్ ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. నా గురించి భాను కూడా కొన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. చివరకు అమ్మ ఒత్తిడి మేరకు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్లని చూస్తుంటే అచ్చంగా మా బాల్యం గుర్తొస్తుంది. ఒకడేమో హీరో అయ్యాడు. ఇంకొకడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అమ్మ కోరిక అలా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ పోలికలున్నా, మనస్తత్వాలు పూర్తి విరుద్ధం. నేను ఇంట్రావర్ట్‌ని. వాడు ఎక్కడికైనా దూసుకుపోగలడు. నాకు మెడికల్ సీటు రాక బి.ఏ.లో చేరాను. ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయాను. నేను కొన్నాళ్లు మ్యూజిక్ టీచర్‌గా ఓ స్కూల్లో పనిచేశాను. అలాగే సంగీత దర్శకుడు రాజ్ దగ్గర పదేళ్లు ఉన్నాను. నాకన్నా భానులోనే ఎక్కువ మ్యూజిక్ టాలెంట్ ఉంది. తను ఇప్పుడు తలుచుకున్నా మంచి మ్యూజిక్ డెరైక్టర్ కాగలడు. తన సినిమాల్లో నాకు ‘నిరీక్షణ’ అంటే చాలా ఇష్టం. తనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. దాన్నెవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భాను కేరెక్టర్ యాక్టర్‌గా చేయడం నాకిష్టం లేదు. చేస్తే హీరోగానే చేయాలి. తనకిలాంటి చిన్నా చితకా పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్లు వచ్చినా కూడా శక్తిమంతమైన పాత్రలు చేస్తున్నాడు. ఈ విషయమే ఎన్నిసార్లు చెప్పినా భాను పట్టించుకోడు. ఖాళీగా కూర్చోలేను కదా అంటుంటాడు. - పులగం చిన్నారాయణ -
ప్రముఖ కవి చాయరాజ్ మృతి
ప్రముఖ కవి, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు ఛాయరాజ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. ఛాయరాజ్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహితీ రంగానికి ఆయన సేవ చేశారు. శ్రీకాకుళం, నిరీక్షణ, ఉక్కేరు, దర్శిని రచనలు ఛాయరాజ్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.