కథానాయకుడు | KV Vijayendra Prasad to direct multilingual project | Sakshi
Sakshi News home page

కథానాయకుడు

Published Tue, Dec 8 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

కథానాయకుడు

కథానాయకుడు

కథకు మూలం ఉంటుంది.... మర్రిచెట్టంత మహావృక్షానికి విత్తనం లాంటి మూలం! మూలం వెతికి, దాన్ని తిరగేయగలిగితే... మూల్యం ఉంటుంది. మర్రిచెట్టంత మూల్యం ఉంటుంది! సృష్టికర్త ఒక్కడే - బ్రహ్మ! మిగతావాళ్ళంతా - స్ఫూర్తికర్తలే! విజయేంద్రప్రసాద్ కథల్లో దమ్ముంటుంది.  కథల్లో దమ్మే కాదు... కథెలా పుట్టిందో చెప్పే దమ్మూ ఆయనకుంది. మూలాన్ని తిరగేసి, మూల్యాన్ని మూటగట్టుకున్న ఈ ‘కథా’నాయకుడు ...ఎంతమందికి స్ఫూర్తికర్త అవుతాడో!!
 
ప్రతి సినిమాకూ కథ ఉంటుంది. ప్రతి సినిమాకథకూ వెనక ఇంకొక కథ ఉంటుంది. అది ఆ కథ తాలూకు ఇన్‌స్పిరేషన్ కథ. మిగతా వాళ్ల సంగతేమో కానీ, నేనైతే ఎక్కడ నుంచి ఎలా ఇన్‌స్పైరై కథ చేశానో చెప్పేస్తాను. పిల్లాడు ఎలా పుడతాడో అందరికీ తెలుసు. కానీ చెప్పరంతే! అది సీక్రెట్ అనుకుంటే ఎలా? చిన్నప్పట్నుంచీ చూసిన సంఘటనలు, చదివిన పుస్తకాలు... ఒకప్పుడు గుర్తుకొస్తాయి. అవన్నీ కథలకు ఉపయోగపడతాయి.
 
నా కెరీర్‌లోని సూపర్ హిట్ కథల గురించి చెప్పుకోవాలంటే...
జానకి రాముడు (1988): నా ఫస్ట్ కథ ‘జానకి రాముడు’. అంతకుముందు ఏవేవో కథలు రాశా కానీ ఏవీ పెర్‌ఫెక్ట్‌గా కాదు. నిర్మాత ‘యువచిత్ర’ కాట్రగడ్డ మురారి అప్పట్లో నాగార్జునతో సినిమా తీస్తున్నారు. ‘‘ఏయన్నార్ నటించిన ‘మూగమనసులు’ కథ కావాలి, కానీ ‘మూగమనసులు’లా ఉండకూడద’’ని దర్శకుడు రాఘవేంద్రరావు అడిగారు. అలా ‘జానకి రాముడు’ కథ చేశా.
 
బంగారు కుటుంబం(1994): ఏయన్నార్ గారిది ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా ఉంది. అందులో మూడు కుటుంబాలు విడిపోతాయి. ఆ సినిమా రిలీజయ్యే నాటికి అది టూ ఎర్లీ. కానీ, ఇవాళ్టి రోజులకు అది బావుంటుందని నిర్మాత కైకాల నాగేశ్వరరావు అడిగారు. అప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని గారు నటించిన ‘బంగారు కుటుంబం’ స్క్రిప్టు రెడీ చేశా.
 
బొబ్బిలి సింహం (1994): బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కి దాసరి నారాయణరావుగారి ‘ప్రేమాభిషేకం’ గుర్తుంది కదా... అదీ ఇన్‌స్పిరేషన్. ‘ప్రేమాభిషేకం’ కథలోని మగ, ఆడ రివర్స్ చేసి ‘బొబ్బిలి సింహం’ కథ చేశా. ఏయన్నార్, శ్రీదేవిని - ఈ కథలో రోజా, బాలకృష్ణ చేశా. అయితే, ఇలా ఏ కథనైనా మార్చగలనా అంటే చెప్పలేను. ఏదైనా అవసరాన్ని బట్టే వస్తుంది!
 
సమరసింహారెడ్డి (1999): రాయలసీమ ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. కానీ, అందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఒకటి చెప్పాలి. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘సింధూర పువ్వు’ ఇన్‌స్పిరేషన్‌తో ‘సమరసింహారెడ్డి’ కథ చేశా. అందులో ఒకావిడ పెంపుడు కూతుర్ని సరిగ్గా చూడదు. సొంత కూతుర్ని మాత్రం సుకుమారంగా పెంచుతుంది.

ఇది నచ్చక విజయ్‌కాంత్ దగ్గర అతను కారు డ్రైవర్‌గా చేరతాడు. విజయకాంత్‌ని శత్రువులు ఎటాక్ చేయబోతే, ఇతను వెళ్లి అడ్డుకుని చనిపోతాడు. అప్పుడు విజయ్‌కాంత్‌కి తెలుస్తుంది. ఇతనికో ఫ్యామిలీ ఉందని! ఆ కుటుంబ కష్టం తీర్చడానికి ఇక్కడికొస్తాడు. ఇదీ ‘సింధూర పువ్వు’ కథ. ఆ బేస్ నాకు నచ్చింది. అప్పుడు రత్నం నా దగ్గర అసిస్టెంట్.

నేను బొంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్‌లో బాలకృష్ణ డాన్‌గా అనుకున్నా. కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజమ్ పెడదామని రత్నం సలహా ఇచ్చాడు. అతనో రియల్ ఇన్సిడెంట్ చెప్పాడు. రియల్‌గా చూశాడట. విజయవాడ రైల్వే స్టేషన్‌కి స్థానికంగా బలం ఉన్న వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఫ్యామిలీలు రెండూ ఒకేసారి రావడం, పోలీసుల టెన్షన్... చెబితే భలే బాగుందనిపించింది. ఆ సీన్ ‘సమరసింహారెడ్డి’లో అల్లాను.
 
సింహాద్రి (2003): 2000 ముందు వరకూ మద్రాసులో ఉండేవాణ్ణి. ‘వసంత కోకిల’ సినిమా చూసి నా అసిస్టెంట్ ‘అమ్మ’ గణేశ్‌తో ‘‘క్లైమాక్స్‌లో ఆ అమ్మాయి హీరోను వదిలివెళ్ళిపోతుంటే, గుండెల్లో గునపంతో పొడిచేసి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది కదూ’’ అన్నాను. వెంటనే, ‘‘హీరోయిన్, తనను ప్రేమించిన హీరో గుండెల్లో గునపంతో పొడిచేసినట్లు కథ చేద్దాం’’ అన్నాడు గణేశ్.

హీరో చెడ్డవాడనుకుని హీరోయిన్ అపార్థం చేసుకుని గునపంతో పొడవాలి. ఆ అపార్థం ఏ పరిస్థితుల్లో జరిగింది? అలా... అలా ఆలోచించుకుంటూ, లాజిక్ సెట్ చేస్తూ రెండు రోజుల్లోనే కథ రెడీ చేశాం. అయితే, తెలుగు నేల కాకుండా వేరే ఏదైనా బ్యాక్‌డ్రాప్ ఉంటే బాగుంటుందనుకుంటే, కేరళ గుర్తొచ్చింది. అక్కడ ప్రకృతి వైద్యం ఫేమస్. హీరోయిన్‌తో పరిచయం పెంచుకోవడానికి జబ్బు నటించి, హీరో అక్కడకు వెళ్లాలి. ఇదీ కథ. మొదట ఈ కథను బాలకృష్ణ-బి. గోపాల్‌కి చెబితే ఓకే అన్నారు. కానీ, చివరలో వేరే కథ ఎంచుకున్నారు. ఈ విషయం తెలిసి నిర్మాత దొరస్వామిరాజు నన్ను పిలిపించారు. అప్పుడు చిన్న ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సెట్స్ పైకొచ్చింది.
 
సై (2004): ‘సింహాద్రి’ రిలీజ్ తర్వాత జైత్రయాత్రకు వైజాగ్ వెళ్లాం. హోటల్‌లో ఉండగా ‘‘నాన్నగారూ! ఈసారి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేద్దాం. అలాగని లవ్‌స్టోరీ వద్దు. స్పోర్ట్స్ కావాలి’’ అన్నాడు రాజమౌళి. అప్పటికప్పుడు ఓ లైన్ చెప్పా. ఓ పాత కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ గ్రూప్‌లకు మొదట నుంచీ పడదు. వాళ్లకు ఏదైనా గొడవొస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటారు. ఓ అమ్మాయి కోసం రెండు గ్యాంగ్‌లూ కొట్టుకుంటాయి. ఓ రౌడీగాడు ఈ కాలేజ్‌ని కబ్జా చేయాలనుకుంటాడు.

అప్పుడు ఈ రెండు గ్యాంగులూ కలిసి ఆ రౌడీని ఫుట్‌బాల్‌లో ఓడిస్తారు. కథ చెప్పిన పది రోజులు పోయాక - ‘‘ఫుట్ బాల్ అయితే కిక్ ఉండదు. రగ్బీ గేమ్‌గా మారుద్దాం’’ అన్నాడు రాజమౌళి. అందుకోసం తను చాలా రీసెర్చ్ చేశాడు. న్యూజిలాండ్ ఎక్కడ్నుంచో రగ్బీ కోచ్‌ను కూడా రప్పించారు.
 
విక్రమార్కుడు (2006): రవితేజ డ్యుయల్ రోల్‌తో సినిమా చేద్దామనుకున్నాం. అత్తిలి సత్తిబాబు పాత్ర ముందే పుట్టేసింది. హిలేరియస్‌గా వచ్చింది. రెండో పాత్ర గురించి రాజమౌళి అడిగితే, ‘పోలీసాఫీసర్’ అని చెప్పా. ‘రొటీన్‌గా ఉంటుందేమో’ అన్నాడు. నాకు టెన్షన్ వచ్చింది. రాత్రంతా ఆలోచించా. హిందీలో ‘శూల్’, ఇంగ్లీషులో ‘ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్’ చూశా. దర్శకుడు ఇ. నివాస్ తీసిన ‘శూల్’లో పోలీసాఫీసర్ రైల్వేస్టేషన్‌లో దిగితే జట్కా బండివాడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, ఆ వాతావరణం నచ్చింది. దాన్ని వాడుకున్నా.

జట్కాబండి బదులు ట్యాక్సీ పెట్టాం. ‘ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్’లో విలన్, ఒకావిణ్ణి ఉంచుకుంటాడు. కొడుకు అమ్మను చూడడం కోసం దొంగతనంగా ఆ ఇంట్లోకి వెళ్లడం హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అందులోంచి రాజీవ్ కనకాల పాత్ర పుట్టింది. అలా తయారైంది ‘విక్రమార్కుడు’ స్క్రిప్ట్.
 
యమదొంగ (2007): ఒకసారి రాజమౌళి ‘‘తారక్‌తో యమధర్మరాజు వేషమేయిస్తే ఎలా ఉంటుంది నాన్నా?’’ అని అడిగాడు. బాగుంటుందన్నా. ‘యమగోల’, ‘యమలీల’ తరహాలో కథ చేయమన్నాడు. గ్రాఫిక్స్‌కి కథలో ఇంపార్టెన్స్ ఇవ్వమన్నాడు. అలా పుట్టిందే ‘యమదొంగ’.
 
మగధీర (2009): ‘మగధీర’ అనగానే అందరూ ‘ఒక్కణ్ణి కాదు షేర్‌ఖాన్... వంద మందిని పంపించు’ ఎపిసోడ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు కొవ్వూరులోని స్కూల్‌లో ఆగస్టు 15కి శివాజీ తాలూకు ఓ మరాఠీ సినిమా వేశారు. ఆ సినిమాతో పాటు, తానాజీ వీరపోరాటం, అతను చనిపోవడంతో ‘‘సింహగఢ్ దక్కింది కానీ, సింహం దక్కలేదు’’ అని శివాజీ ఏడ్చినట్లు ‘శివాజీ చరిత్ర’లో చదివిన ఘట్టం మనసులో ఉండిపోయాయి.

ఆ తర్వాత ఎప్పుడో దర్శకుడు సాగర్, సూపర్‌స్టార్ కృష్ణతో ‘జగదేకవీరుడు’ టైటిల్ చెప్పి, కథ కావాలని అడిగితే ఈ ఎపిసోడ్ చెప్పా. సాగర్‌కి కథ నచ్చింది కానీ, బడ్జెట్ ఎక్కువ అవుతుందని భయపడ్డారు. ‘సింహాద్రి’ తర్వాత చిరంజీవిగారు రాజమౌళితో సినిమా చేద్దామని పిలిచారు. అప్పుడే ఈ కథ చెప్పాం. ఎందుకనో ముందుకు వెళ్లలేదు. తర్వాత రామ్‌చరణ్‌తో అనుకున్నప్పుడు గుర్తు చేశాం. అలా ‘మగధీర’ పుట్టింది.
 
రాజన్న (2011): నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తుంటే, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ రైలులో కలిశారు. తెలంగాణ పోరాటం గురించి వాళ్ల నాన్నగారు సుద్దాల హన్మంతు గురించి చెప్పారు. రజాకార్లు ఆ ఊరి మీద పడి దౌర్జన్యం చేస్తుంటే, అందరూ పారిపోతున్నారట. అక్కడున్న ముసలావిడ ‘‘అలా సూత్తావేంట్రా... వెయ్... దెబ్బకి దెబ్బ వెయ్’’ అని అరిచిందట. దాంతో హన్మంతు పాట అందుకున్నాడట. జనానికి ఊపు వచ్చి అందరూ కలసి రజాకార్లను తరిమి తరిమి కొట్టారట. ఒక పాట ఎలా స్ఫూర్తి నింపుతుందో తెలుసుకుని నేను ఇన్‌స్పైర్ అయిపోయా. ఆ తర్వాత తెలంగాణ పల్లెలకు వెళ్లా. చరిత్ర చదివా. ఆలోచనలన్నీ కలిపి ‘రాజన్న’ స్క్రిప్టు చేశా.
 
బజ్‌రంగీ భాయీజాన్ (2015)
ఏడెనిమిదేళ్ల క్రితం నేను, కీరవాణి సోదరుడు కాంచీ, కోడెరైక్టర్ మహదేవ్ కలసి చిరంజీవి గారి ‘పసివాడి ప్రాణం’ చూస్తున్నాం. దాన్ని సోల్ తీసుకొని, కథ చేద్దామని ఓ ఐడియా వచ్చింది. హీరోకి ఓ పిల్లాడు దొరికాడు. వాడెవడో తెలీదు. ఆ పిల్లాడు డేంజర్‌లో ఉంటాడు. దాన్నుంచీ హీరో తప్పిస్తాడు. ఇదీ ఐడియా. ఆ తర్వాత పేపర్‌లో ఓ వార్త చదివా. పాకిస్తాన్ జంట తమ చిన్నపాపకు హార్ట్‌లో హోల్ ఉందని, ఆపరేషన్‌కి చెన్నై వచ్చారు.

డబ్బుల్లేవు. హాస్పటల్ వాళ్లు ఫ్రీగా ఆపరేషన్ చేశారు. ఆ తల్లి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడింది. అది నన్ను కదిలించింది. ఇవన్నీ కలిపి ‘బజ్‌రంగీ...’ స్క్రిప్టు చేశా. ఈ కథ మొదట హీరో సూర్యకు చెప్పా. అతనికి ఎక్కలేదు. రజనీకాంత్, వెంకటేశ్‌లకు కూడా ఈ కథ చెప్పా. ఆమిర్‌ఖాన్‌కి చెప్పా. అతను కొన్నాళ్ల తర్వాత ‘‘కథ బాగుంది కానీ, నేను కనెక్ట్ కాలేకపోతున్నా’’ అన్నాడు.

తర్వాత దర్శకుడు కబీర్‌ఖాన్‌కి నచ్చి హీరో సల్మాన్‌ఖాన్  దగ్గరకు తీసుకువెళ్లాడు. సినిమా రిలీజయ్యాక సల్మాన్ తండ్రి - రచయిత సలీమ్ గారు ఫోన్ చేసి ‘‘ఇంత గొప్ప కథ నేనెప్పుడూ రాయలేదు’’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. రచయితల జంట సలీమ్-జావేద్‌లకు నేను వీరాభిమానిని. అలాంటి సలీమ్ గారు నన్ను మెచ్చుకోవడాన్ని మించి ఇంకేం కావాలి! ప్రస్తుతం నా దగ్గర 40-50 కథలున్నాయి. ఇక, నా డ్రీమ్ సబ్జెక్ట్ అంటారా? ఇంకా కలలోకి రాలేదు. వస్తే చెబుతాను!
సంభాషణ: పులగం చిన్నారాయణ
 
బాహుబలి (2015)
‘బాహుబలి’కి వేరే ఇన్‌స్పిరేషన్ లేదు. డబ్బే ఇన్‌స్పిరేషన్. అప్పటికప్పుడు అనుకుని రాసేసిందే! ‘‘ప్రభాస్‌తో ఫుల్ కాస్ట్యూమ్ డ్రామా కావాలి. అన్నీ గ్రే కేరెక్టర్స్ కావాలి’’ అని రాజమౌళి అడిగాడు. మర్నాడు పొద్దున్నే బాహుబలిని కట్టప్ప పొడిచే సీన్ చెప్పా. తర్వాత రోజు తల్లి నీళ్లలో బిడ్డను పెకైత్తే సీన్ చెప్పా. ఇలా అన్నీ సీన్లుగా చెప్పా. వాటి చుట్టూ కథ అల్లేశా. ‘బాహుబలి-2’ కథ కూడా రెడీ. అప్పుడే రఫ్‌గా చేసేశాం. మొన్నీ మధ్యనే నెలరోజులు కూర్చుని స్క్రిప్ట్ ఫైనల్ చేసేశాం. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసి మార్పులేమీ చేయలేదు. పాలిష్ చేశామంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement