ఫ్యాన్, బజరంగీ కన్నా బాహుబలే మిన్న!
షారుక్‌ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్'.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చింది. సమీక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకులూ నచ్చిందన్నారు. కానీ కలెక్షన్లలో చూస్తే మాత్రం ఆ ఊపు కనిపించలేదు. తొలిరోజు కలెక్షన్లపై అటు బాలీవుడ్ అయినా ఇటు టాలీవుడ్ అయినా భారీ ఆశలే పెట్టుకుంటున్నది. భారీ ఎత్తున థియేటర్లలోకి దిగుమతి అయిన ఈ సినిమా తొలి రోజు వసూలు చేసింది రూ. 19.20 కోట్లే. మొత్తంగా మొదటి వీకెండ్‌లో ఈ సినిమా రాబట్టింది రూ. 54 కోట్లు మాత్రమే. ఈ ఏడాది కలెక్షన్ల పరంగా చూసుకుంటే తొలి వీకెండ్‌లో ఇదే రికార్డు వసూలు కావొచ్చు కూడా.
కానీ, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల జాబితాపరంగా చూస్తే 'ఫ్యాన్' కలెక్షన్లు ఒకింత నిరాశపరిచాయనే చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాది వచ్చి కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్', 'ప్రేమరతన్ ధన్‌పాయో', 'దిల్‌వాలే'తో పోల్చుకుంటే 'ఫ్యాన్' వసూలు చాలా వెనుకబడిపోయింది.
తొలి నాలుగు రోజుల్లో రూ. 217 కోట్లు వసూలు చేసి.. రాజమౌళి వండర్ 'బాహుబలి' రికార్డు సృష్టించింది. ఈ ఐదు చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర లిఖించింది. ఆ తర్వాతి స్థానంలో రూ. 129.77 కోట్లతో ప్రేమరతన్ ధన్‌పాయో (పీఆర్‌డీపీ), రూ. 129.65 కోట్లతో భజరంగీ భాయ్‌జాన్, రూ. 75.18 కోట్లతో దిల్‌వాలే సినిమాలు నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన షారుఖ్ తాజా వండర్ 'ఫ్యాన్' మాత్రం తొలి నాలుగు రోజుల్లో రూ. 50.40 కోట్లు వసూలు చేసింది.