బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం యాక్షన్-థ్రిల్లర్ వేదా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ డైరెక్షన్‌లో.. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్న హీరోలపై విమర్శలు చేశారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అభిమానులకు తాను రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకుంటానని తెలిపారు.
జాన్ అబ్రహం మాట్లాడుతూ.. 'నేను నిజాయితీగా జీవిస్తేనే రోల్ మోడల్‌గా ఉంటా. ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేస్తే తొందరగా దాన్ని గుర్తిస్తారు. ఇక్కడ కొందరు ఫిట్‌నెస్ గురించి మాట్లాడతారు. కానీ అదే వ్యక్తులు పాన్ మసాలా గురించి ప్రచారం చేస్తారు. నేను నా సహ నటులందరినీ గౌరవిస్తా. ఇక్కడ కేవలం నా గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మరణాన్ని అమ్మాలనుకోవడం లేదు. మనదేశంలో పాన్ మసాలా వార్షిక టర్నోవర్ రూ.45 వేల కోట్లు అని మీకు తెలుసా? అంటే ప్రభుత్వం కూడా దీనికి మద్దతిస్తోంది. అందుకే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. వీటి గురించి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇన్‌డైరెక్ట్‌గా చావును ప్రజలకు అమ్మినట్లే. అలా వచ్చిన డబ్బులతో మీరెలా బతుకుతున్నారు' అని విమర్శించారు.
కాగా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటనలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇలాంటి యాడ్స్‌లో పాల్గొనబోనని అక్షయ్ ప్రకటించాడు. కాగా.. జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహం.. ఆ తర్వాత ధూమ్, గరం మసాలా, టాక్సీ నెం 9211, దోస్తానా, ఫోర్స్, దేశీ బాయ్జ్, రేస్ 2, పఠాన్ వంటి చిత్రాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment