తెలుగువారి అపురూప గ్రంథం స్వర్ణయుగ సంగీత దర్శకులు
తెలుగువారి అపురూప గ్రంథం స్వర్ణయుగ సంగీత దర్శకులు
Published Tue, Aug 13 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
‘‘‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ పుస్తకం తెలుగు వారి అపురూప గ్రంథం’’ అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో చిమటమ్యూజిక్‌డాట్‌కామ్ ప్రచురణలో నంది అవార్డు గ్రహీత పులగం చిన్నారాయణ రచించిన ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ మలి ప్రచురణ పుస్తకావిష్కరణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ -‘‘తెలుగుభాష గర్వించే విధంగా ఈ పుస్తకాన్ని రాశారు చిన్నారాయణ. ఈ పుస్తకం ఒక పరిశోధనాత్మక గ్రంథంగా తెలుగుజాతికి మిగిలిపోతుంది. తెలుగు సినీ సంగీతానికి చిమట శ్రీనివాస్ విశేష కృషి చేస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘తెలుగు సంస్కృతిని, తెలుగు పాటను నిలబెట్టేందుకు చిమట శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయం’’ అని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు అన్నారు. తెలుగు పాటలను గుండెల నిండా నింపుకున్న వ్యక్తి చిమట శ్రీనివాస్ అని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అన్నారు. తెలుగు సంగీత ప్రపంచానికి ఘంటసాల సూర్యుడైతే, బాలు చంద్రుడులాంటి వాడని, సినీపాటల్లో ఉన్నతమైన పాటలు ఎన్నుకొని చేసిన ప్రయత్నమే ఈ మలి ప్రచురణ అని మాధవపెద్ది సురేష్ చెప్పారు.
సంగీత దర్శకుల గురించి ఓ పుస్తకం తీసుకురావాలనే ఆలోచన రావటమే గొప్ప విషయమని సంగీత దర్శకుడు చక్రి అంటే... చరిత్రకెక్కిన మహానుభావుల గురించి రాసిన ఈ పుస్తకంతో పులగం చిన్నారాయణ, చిమటా శ్రీనివాస్ కూడా చరిత్రకెక్కారని ఆర్పీ పట్నాయక్ అన్నారు. చిమట శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘చిన్నారాయణ ఈ పుస్తకంలో అద్భుతమైన పద ప్రయోగాలు చేశారు.
ఈ పుస్తకం తెచ్చే విషయంలో సూర్య గూడూరు అందించిన సహకారం మరవలేనిది’’ అని చెప్పారు. మాధవపెద్ది సురేష్, చక్రి, ఆర్.పి.పట్నాయక్ కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని సురేష్ కొండేటి, మలి ప్రతిని ఎల్.బాబురావు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పులగం చిన్నారాయణ, సూర్య గూడూరు, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Advertisement