ఉప్పొంగెలే.. | Godavari Pushkaralu 2015 | Sakshi
Sakshi News home page

ఉప్పొంగెలే..

Published Sun, Jul 12 2015 12:31 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

ఉప్పొంగెలే.. - Sakshi

ఉప్పొంగెలే..

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ
మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చుమా దేవేరీ
వేదమంటి మా గోదారి
శబరి కలసిన గోదారీ రామచరితకే పూదారి

   
‘‘నీకు గోదావరి గురించి తెలుసా?’’ అడిగాడు శేఖర్ కమ్ముల.
 ‘‘అది... బిగ్ రివర్ కదా’’ అంది కమలినీ ముఖర్జీ.
 ‘ఆనంద్’ షూటింగ్ లంచ్ బ్రేక్‌లో ఇద్దరూ భోంచేస్తూ మాట్లాడుకుంటున్నారు.
 గోదావరి గురించి అడిగిన శేఖర్, తర్వాత కామ్ అయిపోయి, తన మానాన తాను భోంచేస్తున్నాడు.
 

కమలినికేం అర్థం కాలేదు. ‘‘ఏంటి శేఖర్? ఏదో చెప్తావనుకుంటే... ఏం మాట్లాడవ్?’’ అడిగింది.
 ‘‘ఆ... ఏం లేదు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టోరీ అనుకుంటున్నా’’ అన్నాడు శేఖర్ చాలా సింపుల్‌గా.
 ‘‘అవునా! ఆ స్టోరీ ఏంటో చెప్పవా ప్లీజ్’’ అడిగింది కమలిని. చెప్పడానికి కాసేపు తటపటాయించాడు శేఖర్.
 ‘‘నేనేం లీక్ చేయను. ధైర్యంగా చెప్పొచ్చు’’ నవ్వుతూ చెప్పింది కమలిని.
 శేఖర్ చెప్పడం మొదలుపెట్టాడు.
 
‘‘సోషల్ ఎవేర్‌నెస్ ఉన్న అబ్బాయి... ఇండివిడ్యువాలిటీ కోరుకునే అమ్మాయి... ఇద్దరూ కలసి గోదావరి నదిలో లాంచీ ప్రయాణం... రాజమండ్రి నుంచి భద్రాచలం వయా పాపికొండలు... బ్యూటిఫుల్ జర్నీ’’ అంటూ కొన్ని సీన్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు శేఖర్.
 కమలిని విభ్రమంగా శేఖర్ వైపు చూస్తూ వింటోంది. ‘‘బ్యూటిఫుల్ స్టోరీ శేఖర్! హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. నన్ను దృష్టిలో ఉంచుకునే రాశావు కదా. ఆ పాత్ర నేనే చేస్తాను’’ అని గలగలా మాట్లాడేస్తోంది కమలినీ.
 శేఖర్ కంగారుపడ్డాడు.
 
‘‘ఇంకా నేనేం అనుకోలేదు. ముందు ‘ఆనంద్’ రిలీజ్ కావాలి. ఆ తర్వాత చూద్దాం’’ అని చెప్పి తప్పించుకున్నాడు.
 కొన్ని తప్పించుకోవడం చాలా కష్టం. ఆ విషయం శేఖర్ కమ్ములకు ‘ఆనంద్’ రిలీజైన ఏడాదికి అర్థమైంది.
   
‘ఆనంద్’ ట్రెండ్ సెట్టింగ్ హిట్. చాన్నాళ్లకు బాపు లాంటి డెరైక్టరొచ్చా డంటూ కితాబులు. వింటూనే ఉన్నాడు శేఖర్ కమ్ముల. తనపై ఓ ఎక్స్‌పెక్టేషన్ రావడం ఓ పక్క ఆనందం... మరో పక్క భయం. అందుకే ఒళ్లు దగ్గరపెట్టుకుని కథ చేసుకుంటున్నాడు.
 ‘గోదావరి’... తనకు ఇష్టమైన కథ. ఎప్పుడో 33 ఏళ్ల క్రితం బాపు తీసిన ‘అందాల రాముడు’లా గోదావరి జర్నీ నేపథ్యంలో కథ. పోలికలు పెట్టినా ఫర్లేదు. ఈ జర్నీ మిస్ కాకూడదు.

ఎప్పుడో తాను టెన్త్ క్లాసులో టీవీలో చూసిన ‘అందాల రాముడు’ ఇప్పటికీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంది. తన సినిమా కూడా అలానే గుర్తుండిపోవాలి. ‘ఆనంద్’ లాగానే జీవితానికి దగ్గరగా ఉండాలి. నో అతిశయోక్తులు... నో అభూత కల్పనలు... కథ విషయంలో కిందా మీదా పడుతున్నాడు శేఖర్. ఇందులో హీరో పాత్రకు రాజకీయాలంటే ఇష్టం. దాన్నో వృత్తిగా స్వీకరించాలనుకుంటా డతను. ఈ పాత్ర కోసం శేఖర్ కొంత రీసెర్చ్ చేశాడు.

తన టీమ్ మెంబర్స్‌ని చాలా పొలిటికల్ పార్టీ ఆఫీసులకి పంపించాడు. దాదాపుగా కథ ఓ కొలిక్కి వచ్చింది. వాళ్ల బావ రాసిన ఓ షార్ట్ స్టోరీ ఇన్‌స్పిరేషన్‌తో శేఖర్ చిలక జ్యోతిషం సీన్ క్రియేట్ చేశాడు. కుక్క పాత్ర కూడా అంతే. ఓ జర్నలిస్ట్ రాసిన షార్ట్ స్టోరీ దానికి ఇన్‌స్పిరేషన్. శేఖర్ కజిన్ సిస్టర్ తన కుక్కకు కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంది. అది గుర్తొచ్చి, ఇందులో కుక్కకి కొంచెం మాస్‌గా ‘కోటిగాడు’ అని పేరుపెట్టాడు. ఫైనల్‌గా స్క్రిప్ట్ లాక్ చేశాడు శేఖర్ కమ్ముల.
   
చాలామంది ప్రొడ్యూసర్లొచ్చారు - ‘‘ఆనంద్’ లాంటి సినిమా తీసిపెట్టమని’’. ఒక్క జీవీజీ రాజు మాత్రం ‘‘మీకు నచ్చిన సినిమా తీయండి’’ అన్నాడు. ‘తొలిప్రేమ’ తీసిన నిర్మాత. ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాత. శేఖర్‌కు ఓకే.
 స్క్రిప్ట్ తీసుకుని ఫిలిమ్ నగర్ మీద పడ్డాడు.
 పవన్ కల్యాణ్... మహేశ్‌బాబు... గోపీచంద్... ఎవ్వరూ ఖాళీగా లేరు. మరి ఈ ‘గోదావరి’ని ఈదే హీరో ఎవరు? ఇంకెవరు ‘అందాల రాముడి’ మనవడే. గుడ్ ఐడియా. సుమంత్ డేట్స్ ఓకే.
 
ఇప్పుడు హీరోయిన్ కావాలి. మోడ్రన్‌గా కనబడాలి. ట్రెడిషనల్‌గా ఉండాలి. గూగుల్ సెర్చ్ చేసినట్టుగా చాలామందిని వెతికాడు శేఖర్. ‘‘ఎందుకండీ... మీ ‘ఆనంద్’ హీరోయిన్ ఉంది కదా!’’ అందరిదీ ఇదే సలహా. శేఖర్‌కి తప్పలేదు. కమలిని వచ్చింది. కొంటెగా నవ్వింది. ‘‘నేను చెప్పానా! ఆ క్యారెక్టర్ నా కోసమే పుట్టిందని!’’.
   
ఓ పక్క మ్యూజిక్ సిట్టింగ్స్... మరో పక్క లొకేషన్స్ సెర్చింగ్...
‘ఆనంద్’కి మెయిన్ పిల్లర్స్ రైటర్స్ వేటూరి, మ్యూజిక్ డెరైక్టర్ కె.ఎం. రాధాకృష్ణన్. దీనికీ అంతే. పెద్దాయన వేటూరి, శేఖర్ బాగా క్లోజ్ అయి పోయారు... ఫ్రెండ్స్ అయిపోయారు. ‘గోదావరి’ కథంతా చెప్పి, ‘‘ఏ పాట ఎలా రాస్తారో మీ ఇష్టం సార్’’ అన్నాడు శేఖర్.
 వేటూరి ఉప్పొంగిపోయారు. ఈ రోజుల్లో ఇలా అడిగేవాళ్లు ఎక్కడున్నారు?
 
ఎప్పుడు రాశారో ఎలా రాశారో కానీ... ఆరు పాటలూ చిటికలో రెడీ. చాలా రోజులైంది... వేటూరి ఇంత వేగంగా రాసి! చాలా రోజులైంది... వేటూరి ఇంత పొయిట్రీ రాసి!! శేఖర్ కమ్ముల, కెమెరామేన్ విజయ్.సి.కుమార్, ఆర్ట్ డెరైక్టర్ కిశోర్ కలసి రాజమండ్రి వెళ్లారు. అక్కణ్నించీ లాంచీ వేసుకుని పాపి కొండలు, భద్రాచలం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెక్కీ చేశారు. ఎక్కడెక్కడ షూటింగ్ చేయొచ్చు, యూనిట్ ఎక్కడ స్టే చేయాలి... ఇలా పేద్దదే డిస్కషన్.
   
 రెండు లాంచీలు... 12 బోట్లు... 200 మంది యూనిట్ సభ్యులు... గోదావరిలో షూటింగ్ స్టార్ట్. గోదావరి తీరంలో సింగన్నపల్లి దగ్గర బస. తిండి, నిద్ర- అంతా అక్కడే.
 పొద్దున మూడింటికి లేస్తే, రాత్రి పదయ్యేది పడుకునేసరికి. మధ్యమధ్యలో వర్షాలు. అవుట్‌డోర్ యూనిట్‌కైతే ఒళ్ళు పులిసిపోయేది. షూటింగ్ ఎక్విప్‌మెంట్ నీళ్లలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇంకో రిస్కు.
 
అర్ధరాత్రి 2 గంటలకు గోదావరి మధ్యలో షూటింగ్... అలాంటి టైమ్‌లో శేఖర్ మొబైల్ ఫోన్‌కి కాల్ వచ్చింది. కంగారుగా తీసి చూస్తే, కమలినీ మదర్ అండ్ ఫాదర్. ‘‘మా అమ్మాయికి చెత్త రూమ్ ఇచ్చారంట? అసలు ఇంత రాత్రివేళ ఇంతమందితో షూట్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఏది? ప్రొటెక్షన్ ఏది? లైఫ్ జాకెట్స్ ఏవి? ఏమైనా జరిగితే...’’ అంటూ నాన్‌స్టాప్‌గా క్లాస్ పీకేశారిద్దరూ.
 శేఖర్‌కి కాసేపు ఏం అర్థం కాలేదు. తర్వాత పేరెంట్స్‌గా వాళ్ల టెన్షన్‌ని అర్థం చేసుకున్నాడు. ‘‘ఇదేమన్నా టైటానిక్ షిప్పా. అన్ని జాగ్రత్తలూ తీసుకోవడానికి’’ అంటూ కమలినిని ఆటపట్టించాడు శేఖర్.
 
‘‘అందంగా లేనా? అసలేం బాలేనా?’’... పాట సినిమాలో చాలా ఇంపార్టెంట్. కొంచెం గ్లామరస్‌గా తీయాలి. శేఖర్ ఎలా తీస్తాడా అని అందరూ ఫుల్ వెయిటింగ్. పాపం... నిజంగానే శేఖర్ చాలా కష్టపడ్డాడు - ఈ పాట తీయడానికి. ఎక్కడా అతి లేకుండా... మితిమీరకుండా గ్లామరస్‌గానే తీయగలిగాడు.
 
కుక్క కావాలి. అవును. ఈ సినిమాలో కుక్కది ఇంపార్టెంట్ రోల్. కానీ జంతువులతో షూటింగ్ చేయాలంటే బోలెడన్ని రిస్ట్రిక్షన్స్. అందుకే శేఖర్ తెలివిగా యానిమేటెడ్ డాగ్‌ని క్రియేట్ చేయించాడు. అలీతోనో, వేణుమాధవ్ తోనో డబ్బింగ్ చెప్పిస్తే కుక్క పాత్ర హిట్టయిపోతుంది. ఇక్కడ శేఖర్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. మరి కుక్కకు డబ్బింగ్ ఎలా? ఫైనల్‌గా తనే రంగంలోకి దిగాడు. తనే కుక్కకు డబ్బింగ్ చెప్పాడు.
 100 రోజులు షూటింగ్.
 
స్మూత్‌గానే అయిపోయింది.
 కానీ బడ్జెట్ గోదావరిలో తడిసి మోపెడయ్యింది. ఫోర్ క్రోర్స్ అనుకుంటే, సెవెన్ క్రోర్స్ అయ్యింది. శేఖర్ రెమ్యూనరేషన్ తీసుకోకూడదని డిసైడైపోయాడు. సినిమా చూసి ప్రేక్షకులు... సినిమా తీసి నిర్మాత హ్యాపీ ఫీలవ్వాలి. ఇదే శేఖర్ స్ట్రాటజీ.
   
2006 మే 19...
‘ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది’... అంటూ ‘గోదావరి’ సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర సముద్రమంత సందడి చేయకపోయినా, ‘గోదావరి’ గలగలా పారింది.
 ‘అందాల రాముడు’ రాసిన ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా చూసి ఒకటే మాట అన్నారు - ‘ సినిమా హాయిగా ఉంది’. శేఖర్‌కి ఇంతకు మించిన హాయైన మాట ఏముంటుంది!
 - పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement