వివరం: రామానాయుడు... ఓ ఫిలిం యూనివర్సిటీ! | Great of Lesson Daggubati Ramanaidu career in Film industry | Sakshi
Sakshi News home page

వివరం: రామానాయుడు... ఓ ఫిలిం యూనివర్సిటీ!

Published Sun, Nov 10 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

Great of Lesson Daggubati Ramanaidu career in Film industry

టాటా బిర్లాలు... ఏ బిజినెస్ చేసినా నెంబర్‌వన్నే!
చెత్తలో కూడా చరిత్ర లిఖించగల సమర్థులు వాళ్లు.
కానీ వాళ్లు చేయలేని పని... సినిమా తీయడం!
బోలెడంత కరెన్సీ... ఎంతో పలుకుబడి... మహా తెలివితేటలు...
ఇవన్నీ ఉన్నా కూడా ఓ సక్సెస్‌ఫుల్ సినిమా తీయడం చాలా చాలా కష్టం.
మహామహులే వరుసగా సినిమాలు తీయలేక చేతులెత్తేశారు.
కానీ రామానాయుడు 50 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాలు తీస్తూనే ఉన్నారు.
ఇంకా తీస్తానంటున్నారు కూడా. ఏముంది రామానాయుడిలో మ్యాజిక్?
ఈ లాంగ్ ఇన్నింగ్స్ ఆయనకే ఎలా సాధ్యపడింది?
ఇంటర్ ఫెయిలైన రామానాయుడు ఫిలిం మేకింగ్ యూనివర్సిటీగా ఎలా మారగలిగారు?


 అవును. ప్రేక్షకులకే కాదు, గొప్ప గొప్ప బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూళ్లకు కూడా రామానాయుడి కెరీర్ ఓ గొప్ప పాఠ్యాంశం. కొండల్ని చెక్కి స్టూడియోలు కట్టినట్టుగానే, తనను తాను శిల్పంలా మలుచుకుంటూ మూవీ మొఘల్ అనిపించుకున్నారు.  50 ఏళ్ల క్రితం వ్యక్తిగా మొదలై, వ్యవస్థగా ఎదిగిన రామానాయుడి సినీజీవితంలో  కొన్ని కీలకమైన రీళ్లు...
 
 బయోగ్రఫీ
 పుట్టింది: 1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులో
 తల్లిదండ్రులు: దగ్గుబాటి లక్ష్మీదేవమ్మ, వెంకటేశ్వర్లు
 కుటుంబం: భార్య రాజేశ్వరి, కొడుకులు సురేష్, వెంకటేష్, కూతురు లక్ష్మి
 ఇప్పటిదాకా తీసిన సినిమాలు: 137
 (తెలుగు 78, బెంగాలీ 2, తమిళం 10, మలయాళం 1, కన్నడం 2, ఒరియా 1, అస్సామీ 1, ఆంగ్లం 1, పంజాబీ 1,  హిందీ 17. ఇవికాక, కొన్ని అనువాదాలు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం.)
కె.బాపయ్య, కె.మురళీమోహనరావు, బి.గోపాల్, బోయిన సుబ్బారావు, తిరుపతి స్వామి, జయంత్ సి పరాన్జీ వంటి 22 మంది దర్శకులు; ఖుష్బూ, టాబూ, కరిష్మాకపూర్, దివ్యభారతి, ప్రేమ వంటి 11 మంది హీరోయిన్లు; వెంకటేష్, హరీష్ లాంటి ఆరుగురు హీరోలు, జె.వి.రాఘవులు, మణిశర్మ లాంటి నలుగురు సంగీత దర్శకులు, 1 పాటల రచయిత(చంద్రబోస్) ను పరిచయం చేశారు.
 పురస్కారాలు: పద్మభూషణ్ (2013), దాదాసాహెబ్ ఫాల్కే (2010), రఘుపతి వెంకయ్య అవార్డు (2006), గౌరవ డాక్టరేట్, ఇంకా ఎన్నో!
 
 1
 వరుసగా 9 ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు... ముగ్గురు హీరోలు, చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేస్తే మూలనపడి దుమ్ము పేరుకుపోయిన కథ... ఇలా స్టార్ట్ అయ్యింది రామానాయుడి ప్రయాణం. అన్నీ అపశకునాలే. చుట్టూ అనుమానపు చూపులే. అయినా రామానాయుడు డోంట్ కేర్.  కథను నమ్మి ఎన్టీఆర్ డేట్లిచ్చాడు. ఆ కథనే నమ్మి రామానాయుడు మొండిగా సినిమా తీశాడు. అదే ‘రాముడు - భీముడు’. సూపర్ హిట్. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ. అదీ దమ్మంటే!
 2
 ‘ద్రోహి’ పెద్ద ఫ్లాప్. ఐదు లక్షలు లాస్. టోటల్‌గా ఆరేళ్లలో 12 లక్షలు గోవిందా. ఇంకొకరైతే మూటాముల్లే సర్దుకుని బ్యాక్ టూ పెవిలియన్. లేకుంటే బాటిల్ ఓపెన్ చేసి, మత్తులో మునిగేవాడు. రామానాయుడు జగమొండి. పోయిన చోటే వెతుక్కోవాలనుకునే మనిషి.
 లాస్ట్ అండ్ ఫైనల్ ఎటెంప్ట్. ఏమాత్రం అటూ ఇటూ అయినా మనిషి మిగలడు. నుజ్జు నుజ్జయి పోవాల్సిందే. 15 లక్షలతో ‘ప్రేమనగర్’ మొదలెట్టాడు. వామ్మో! ఎంత గుండె ధైర్యం. రిలీజు రోజు గలీజు వర్షం. నీడన ఉన్నవాడు కూడా తడిసిపోయేంత వర్షం. మన తెలుగోడికి సినిమా బాగుంటే ఎండా లేదు, వానా లేదు. అదే జరిగింది.  ‘ప్రేమనగర్’పై డబ్బుల వర్షం. రామానాయుడిపై పూల వర్షం.
 ఇంకేం... రామానాయుడు పాతుకుపోయాడు. ఈసారి ఏ గాలీ వానా అతన్నేం చేయలేదు.
 3
 ‘సెక్రటరీ’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్. అందరూ మంచి జోష్‌మీదున్నారు. ‘‘ఈ సంస్థలో ఎవరు హీరోగా చేసినా హిట్టే. చివరకు నేను కూడా’’అన్నాడు కైకాల సత్యనారాయణ. ఆ ఆనందంలో మాట ఇచ్చేశాడు రామానాయుడు. కమెడియన్ నగేశ్‌కీ అంతే. డెరైక్షన్ ఛాన్సిస్తానని చిన్న మాట. అయినా మాటంటే మాటే!  కైకాల హీరోగా, నగేశ్ డెరైక్షన్‌లో ‘మొరటోడు’ సినిమా. ఈ సంస్థలో అంత ఫ్లాప్ మళ్లీ రాలేదు. డబ్బు పోయినా మాట తప్పలేదనే సంతృప్తి రామానాయుడిది!
 4
 ఒక చల్లని రాత్రి... అట్టర్ ఫ్లాప్. కక్ష... 8 లక్షలు లాస్. అగ్ని పూలు... 8 లక్షలు పోయింది. ప్రేమ మందిరం... మళ్లీ నష్టం. వరుసగా నాలుగు దెబ్బలు. మనిషి కుదేలైపోయాడు. బండి అదుపు తప్పింది. అర్జెంట్‌గా హిట్ పడాలి. మళ్లీ రిస్క్ చేయాలి.
 అప్పట్లో కె.రాఘవేంద్రరావంటే హాట్ కేక్. అడవి రాముడు, వేటగాడు, ఊరికి మొనగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి... వరుసపెట్టి మాస్ హిట్స్. అలాంటి టైమ్‌లో రామానాయుడు తీసిన సినిమా ఏంటో తెలుసా? ‘దేవత’. పక్కా సెంటిమెంట్. నిజం చెప్పాలంటే ఏడుపుగొట్టు సినిమా. అయినా బోలెడంత క్రేజ్. బయ్యర్లు ఎగబడ్డారు. అమ్మేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. ‘‘అమ్మేద్దాం నాన్నా’’ అంటాడు సురేష్‌బాబు. ‘‘లేదు. మనమే ఓన్‌గా రిలీజ్ చేద్దాం’’ అన్నాడు రామానాయుడు. మళ్లీ మళ్లీ రిస్కు. 15 లక్షలతో తీసిన సినిమా 75 లక్షలు వసూలు చేసింది. 60 లక్షల లాభం. అంత డబ్బే! సాహసవంతుడికే కదా లక్ష్మీ కటాక్షం.
 5
 కె.రాఘవేంద్రరావు దర్శకుడు. సూపర్‌స్టార్ కృష్ణతో సినిమా తీయాలి. ఇక్కడో సడన్ ట్విస్ట్. పార్ట్‌నర్‌గా ఇంకో నిర్మాతను పెట్టుకోమంటారు కృష్ణ. రామానాయుడు కుదరదనేశాడు. కృష్ణ కాల్షీట్లు క్యాన్సిల్. ఇప్పుడేం చేయాలి? ఇప్పటికిప్పుడు హీరో కావాలి. అమెరికాకు ఫోన్ కొడితే, చిన్న కొడుకు దిగొచ్చాడు. అతనే హీరోగా ‘కలియుగ పాండవులు’ సినిమా. గొప్ప టర్నింగ్. ఇండస్ట్రీకి నిర్మాతల హీరో దొరికాడు. ‘విక్టరీ’ వెంకటేశ్.
 6
 రెండు పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు. ఆ కొండల్ని పగలగొట్టి స్టూడియో కట్టాలి. స్టూడియో కట్టడానికన్నా, ఆ కొండల్ని పగలగొట్టడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అది కూడా హైదరాబాద్‌కి ఆమడ దూరం.  అయినా లెక్కచేయలేదు. అప్పటివరకూ సంపాదించిందంతా ఆ కొండల్లో పోశాడు. కట్‌చేస్తే - రామానాయుడు స్టూడియో వెలిసింది. బౌండ్ స్క్రిప్ట్‌తో ఎంటరైతే, ఫస్ట్ కాపీతో ఎగ్జిట్ అయ్యేంత ఎక్విప్‌మెంట్.
 7
 వైజాగ్‌కి దూరంగా భీమ్లీ రోడ్‌లో కొండల మీద స్టూడియో. అక్కడ స్టూడియో ఏంటి? ఈలోగా స్టూడియో కూడా రెడీ. క్వశ్చన్ మార్కు ఫేసుల్లో ఆశ్చర్యార్థకం! ఎదురుగా సముద్రం. చుట్టూ పచ్చటి కొండలు. వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నారు. ఇలాంటి చోట షూటింగ్ చేస్తే, ఆ కిక్కే వేరబ్బా. రామానాయుడా మజాకానా!
 8
 రామానాయుడంటే 137 సినిమాలూ సురేష్ ప్రొడక్షన్ బేనరూ ఓ పెద్ద స్టూడియో బోలెడంత మంది వర్కర్లూ... ఇంతేనా! ఇవన్నీ తెరపై కనిపించేవి. తెర వెనుక ఆయనలో లెక్కలేనన్ని పార్శ్వాలున్నాయి.  ఈ 50 ఏళ్లలో చాలామంది నిర్మాతలు వచ్చారు, వెళ్లారు. చాలా తక్కువ మందే నిలకడగా ఉండగలిగారు. కానీ రామానాయుడిలాగా ఇంత అలుపూ సొలుపూ లేని సుదీర్ఘ ప్రయాణం ఇంకెవ్వరూ చేయలేకపోయారు. ఇది ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డ్ కూడా! ఇంతమంది ఉండగా రామానాయుడే ఎందుకు సక్సెసయ్యారు? ఎలా సక్సెసయ్యారు? ఆయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం ఏమీ లేదు. కల్పవృక్షాలూ అక్షయ పాత్రలూ అస్సల్లేవు. అమృతం కావాలనుకున్నప్పుడు క్షీర సాగరాన్ని మధించి తీరాల్సిందే. హాలాహలమొచ్చినా తట్టుకుని నిలబడాల్సిందే. ఫైనల్‌గా రామానాయుడికి అమృతం దక్కింది.
 9
 రెండు మూడు సినిమాలు అసిస్టెంట్‌గా చేస్తే, డెరైక్షన్ చేయొచ్చు. ఫొటోగ్రఫీ చేయొచ్చు. ఎడిటింగ్ చేసేయొచ్చు. ఇంకా ఏమైనా చేసేయొచ్చు. మరి నిర్మాత కావాలంటే? అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అనే కేటగిరీ లేదిక్కడ. అందుకే రామానాయుడి అనుభవాలను ఏ నిర్మాతల మండలివారో పూనుకుని వీడియో తీయిస్తే, భావితరాలకు ఓ ‘పెదబాల శిక్ష’ను ప్రసాదించినట్టే.
 10
 కథను నమ్ముకున్నవాడు - కృషిని నమ్ముకున్నవాడు - చెడిపోయిన దాఖలా సినిమా చరిత్రలోనే లేదు. ఇది నిజం!
 అందుకు రామానాయుడి జీవితమే 24 కళల... 24 ఫ్రేముల... నిదర్శనం.
 
 సరిగ్గా 50 ఏళ్ల క్రితం...

 1963 నవంబర్ 16... శనివారం ఉదయం 7 గంటలు... మద్రాసులోని ఓ స్టూడియో. ఎన్టీఆర్ మీద ముహూర్తం షాట్. ‘విజయా’ నాగిరెడ్డి క్లాప్. డి.సురేష్‌బాబు కెమెరా స్విచాన్. ‘రాముడు - భీముడు’ షూటింగ్ ఆరంభమైంది. ఇది రామానాయుడి తొలి ప్రయత్నం. దీనికన్నా ముందు ‘అనురాగం’ సినిమాలో భాగస్వామి. నిర్మాతగా పేరు వేయలేదు కానీ, ప్రొడక్షన్ అంతా ఆయనే చూసుకున్నాడు. తన వాటా పెట్టుబడి 20 వేలు అన్నారు. తీరా అది 50 వేలయ్యింది. సినిమా ఫ్లాప్. రామానాయుడికి ఒక్క రూపాయి రాలేదు. ఆ నష్టం కన్నా, ఆ పరాజయం కన్నా, బంధువుల, స్నేహితుల సూటి పోటి మాటలు గాయపరిచాయి. పోయిన చోటే వెతుక్కోవాలి. తలవంచిన చోటే తలెత్తుకు తిరగాలి. ఒంటరి ప్రయాణం... ఒంటరి పోరాటం... ఎవ్వరూ తోడు రానన్నారు. రీల్ ఎస్టేట్ కన్నా రియల్ ఎస్టేట్ బెస్ట్ అన్నారు దగ్గరి బంధువులు. లేదు. నేను సినిమా ఫీల్డ్‌లో సక్సెస్ సాధించి చూపిస్తా అని ప్రతిన పూనాడు రామానాయుడు.
 
 పెద్ద కొడుకు పేరు మీద ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థకు శ్రీకారం. భాగస్వాములుగా ఒక్కరూ రారాయె. సొంత అక్క కూడా వాటా వద్దంది. పిల్లనిచ్చిన మావగారు, చెల్లెలు, మరో నలుగురు బంధువులు తలో పదిపైసల వాటా తీసుకున్నారు. వాళ్లందరివీ కలిపి 6 అణాలు. రామానాయుడు ఒక్కడిదీ 10 అణాలు. అలా సంస్థకు విత్తు పడింది. దూరపు బంధువైన ప్రముఖ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి ద్వారా దర్శకుడు తాపీ చాణక్య, రచయిత డీవీ నరసరాజు పరిచయమయ్యారు. ‘రాముడు - భీముడు’ కథ చెప్పి ఎన్టీఆర్ కాల్షీట్లు తీసుకున్నాడు. జమున, ఎల్.విజయలక్ష్మి, ఎస్వీ రంగారావు, రాజనాల, పద్మనాభం లాంటి హేమాహేమీలు ముఖ్య తారలు. సినిమా చకచకా తయారైపోయింది. ఎన్టీఆర్‌కి వేరే ఏదైనా సినిమా షెడ్యూల్ క్యాన్సిలైతే, రామానాయుడికి ఫోన్ చేసేవారు, ఈయన షూటింగ్ పెట్టేసుకునేవారు. దాంతో చాలా ఎర్లీగా సినిమా పూర్తయిపోయింది. 1963 మే 21న ‘రాముడు - భీముడు’ రిలీజై, సంచలన విజయం సాధించింది. సినిమా పూర్తవడానికి 6 లక్షల 30 వేల రూపాయలు ఖర్చయ్యింది. మొదటి వారంలోనే ఈ డబ్బంతా వచ్చేసింది. రెండో వారం నుంచే ఓవర్‌ఫ్లోస్! ఇక అక్కణ్నుంచి రామానాయుడు సాధించిందంతా చరిత్రే!
 
 కొన్ని సూపర్  హిట్లు
 రాముడు భీముడు
 ప్రేమనగర్
 జీవన తరంగాలు
 సావాసగాళ్లు
 సోగ్గాడు
 కథానాయకుడు
 ముందడుగు
 సంఘర్షణ
 కలియుగ పాండవులు
 ప్రతిధ్వని
 అహ నా పెళ్లంట
 ప్రేమ ఖైదీ
 ప్రేయసి రావే
 సర్పయాగం
 తాజ్‌మహల్
 సూరిగాడు
 బొబ్బిలి రాజా
 ప్రేమించుకుందాం రా
 కలిసుందాం రా
 శివయ్య
 తోడికోడళ్లు
 ప్రేమించు
 ధర్మచక్రం
 నాయుడుగారి కుటుంబం
 గణేష్
 కలిసుందాం రా
 జయం మనదేరా
 వసంతమాళిగై
 (తమిళం)
 ప్రేమ్‌నగర్
 (హిందీ)
 ప్రేమ్‌ఖైదీ  (హిందీ)
 అనారి  (హిందీ)
 
 విజయ రహస్యాలు
     కథను పసిగట్టే ప్రజ్ఞ
     పద్ధతి ప్రకారం పని చేయడం
     పాత్రలకు తగ్గ తారల ఎంపిక
     పర్‌ఫెక్ట్ పేమెంట్.
     కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం
     ట్రేండ్లు, కాంబినేషన్ల మీద ఆధారపడకపోవడం
 
 - పులగం చిన్నారాయణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement