అతడే ఆమె సైన్యం | Story behind Movie - 12 Okkadu film | Sakshi
Sakshi News home page

అతడే ఆమె సైన్యం

Published Sun, Aug 16 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

అతడే ఆమె సైన్యం

అతడే ఆమె సైన్యం

సినిమా వెనుక స్టోరీ - 12
చార్మినార్ దగ్గర కేఫ్‌లో కూర్చుని చాయ్ తాగుతున్నాడు గుణశేఖర్. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు సినిమా పని మీద ఎప్పుడొచ్చినా గుణశేఖర్ చార్మినార్ దగ్గరకొచ్చి... ఆ కట్టడం, వాతావరణం చూస్తూ ఓ చాయ్ తాగాల్సిందే. అప్పుడుగాని ట్రిప్ సక్సెస్ అయినట్టు కాదు. గుణశేఖర్ అప్పుడు చెన్నైలో అసిస్టెంట్ డెరైక్టర్. రేపు డెరైక్టరయ్యాక ఈ చార్మినార్ దగ్గరే సినిమా తియ్యాలి. గుణశేఖర్ అలా అనుకోవడం అది ఫస్ట్ టైమ్ కాదు. వందోసారో, నూట పదహారో సారో అయ్యుంటుంది.
    
‘వెస్ట్ సైడ్ స్టోరీ’... పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమా మీద గుణశేఖర్‌కు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తీస్తే అలాంటి సినిమా తీయాలి. రెండు కుర్ర గ్యాంగ్‌లు... వాటి మధ్య కాంపిటీషన్. ఇక్కడ కూడా గుణశేఖర్ మర్చిపోలేదు... చార్మినార్‌ను. ఆ గ్యాంగ్‌ల మధ్య గొడవను మాత్రం స్ఫూర్తిగా తీసుకొని, తెలుగు నేటివిటీ కథతో చార్మినార్ సాక్షిగా, పాతబస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే? గుణశేఖర్ రాయడం మొదలుపెట్టాడు. రాస్తూనే ఉన్నాడు. ఎంతకీ తరగదే?!
    
కొన్నేళ్ళ తరువాత... హైదరాబాద్... రామానాయుడు స్టూడియో. ‘చూడాలని వుంది’ రీ-రికార్డింగ్ జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ ఫుల్ బిజీ. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వచ్చారు. ‘‘సారీ సర్! ఈ రోజు మీ కొత్త సినిమా ఓపెనింగ్‌కి రాలేకపోయాను. వర్క్ బిజీ’’ అంటూ గుణశేఖర్ ఎక్స్‌ప్లనేషన్.
 ‘‘ఏం పర్లేదు గుణా’’ అన్నారు అశ్వినీదత్. ‘‘కృష్ణగారబ్బాయ్ మహేశ్‌బాబు ఎలా ఉన్నాడు?’’ ఆసక్తిగా అడిగాడు గుణశేఖర్. ‘‘చాలా బావున్నాడు. నిజంగా ‘రాజకుమారుడు’లాగానే ఉన్నాడు’’ అంటూ పొద్దుటి సినిమా ఓపెనింగ్ గురించి హుషారుగా చెప్పారు అశ్వినీదత్.
 
కారులో ఫొటోషూట్ స్టిల్స్ తెప్పించి, గుణశేఖర్‌కి చూపించారాయన. మహేశ్ ఒక్కో ఫొటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్‌లో ఏవేవో ఫ్లాషెస్. చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ, సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు. ఆ కుర్రాడు అచ్చం మహేశ్‌బాబులా ఉన్నాడు. నెక్ట్స్ వీక్ వైజయంతి మూవీస్ ఆఫీసు కొచ్చాడు మహేశ్. గుణశేఖర్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ సరదా చిట్‌చాట్.
 
చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో తాను  అనుకుంటున్న స్టోరీలైన్ గురించి చెప్పాడు గుణశేఖర్. మహేశ్ థ్రిల్లయిపోయాడు. ‘‘డెఫినెట్‌గా మనం చేద్దాం సర్! మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ అంటూ ఉత్సాహపడిపోయాడు.
    
‘మృగరాజు’ ఫ్లాప్. గుణశేఖర్‌కి పెద్ద దెబ్బ. ఆ టైమ్‌లో కూడా గుణశేఖర్ మైండ్‌లో చార్మినారే కనబడుతోంది. ఎస్... ఆ కథకు టైమొచ్చింది. మళ్లీ ఆ కథ మీద కూర్చున్నాడు గుణశేఖర్. ఆ రోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ల నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రస్ట్ లేకపోవడం, గోపీచంద్ ఎన్నో కష్టాలుపడి స్పోర్ట్స్ చాంపియన్‌గా ఎదగడం... ఇదంతా గుణశేఖర్‌కి ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఎస్... నా కథలో హీరో కూడా ఇలాంటి వాడే. తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటాడు. గుణశేఖర్ ఓ నవలలాగా స్క్రిప్టు రాస్తున్నాడు. పేజీలకు పేజీలు...
    
నిర్మాత రామోజీరావు ఆఫీసు... గుణశేఖర్ లైన్ చెబుతుంటే రామోజీ రావు చాలా ఇదైపోయారు. ‘‘చాలా బాగుంది కథ. మనం చేద్దాం. చార్మినార్‌ని ఇక్కడ ఫిలింసిటీలోనే కన్‌స్ట్రక్ట్ చేసేద్దాం. ఎన్ని కోట్లు ఖర్చయినా పర్లేదు’’ అని చెప్పేశాడాయన. గుణశేఖర్ ఏళ్లనాటి కల నిజం కాబోతోంది. కానీ అంతలోనే బ్రేక్. రామోజీరావు ప్లేస్‌లో ఎమ్మెస్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా యమా ఉత్సాహం. మళ్లీ బ్రేక్. ఏవేవో అవాంతరాలు.
    
పద్మాలయా స్టూడియో...
మహేశ్, గుణశేఖర్ ఇద్దరే కూర్చున్నారు.
‘‘నాకు తెలిసి నిర్మాత ఎమ్మెస్ రాజు గారు ఈ ప్రాజెక్ట్‌కి కరెక్ట్’’ మహేశ్‌బాబు ప్రపోజల్.
గుణశేఖర్ డబుల్ ఓకే. ఎమ్మెస్ రాజుకి కాల్ వెళ్లింది. ఆయన ‘పద్మాలయా’కొచ్చారు. మహేశ్ డిటెయిల్స్ అన్నీ చెప్పాడు. ‘‘రాజుగారూ! ఈ ప్రాజెక్టు మీకే చేయాలనుకుంటున్నాం. కానీ వన్ కండిషన్. చార్మినార్ సెట్ వెయ్యాలి. ఎందుకంటే రియల్ ‘చార్మినార్’ దగ్గర అన్నాళ్లు షూటింగ్ చేయలేం. ఈ మధ్యే ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్లనివ్వడం లేదట’’ చెప్పాడు మహేశ్.
 
‘‘నేను సెట్ వేయడానికి రెడీ. కానీ నాకు ముందు కథ నచ్చాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. గుణశేఖర్ కథ చెప్పాడు. ఎమ్మెస్ రాజు ఫుల్ ఖుష్. పేపర్‌లో అనౌన్స్‌మెంట్. మహేశ్‌బాబు - గుణశేఖర్ కాంబినేషన్‌లో ఎమ్మెస్ రాజు సినిమా.
    
‘యువకుడు’ సినిమాలో భూమిక అప్పుడే ఫ్రెష్‌గా విరబూసిన రోజా పువ్వులా ఉంటుంది. ఆ ఫ్రెష్‌నెస్సే గుణశేఖర్‌కి నచ్చేసింది. మహేశ్ పక్కన భూమిక ఖరార్. శేఖర్.వి.జోసెఫ్ కెమెరామన్. మ్యూజిక్ డెరైక్టర్ మణిశర్మ. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్. ఆర్ట్ డెరైక్టర్ అశోక్. టీమ్ అంతా ఓకే. ఇక టైటిలే మిగిలింది. ‘అతడే ఆమె సైన్యం’.
 
గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బతిమాలినా నో చాన్స్. ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే.  ‘కబడ్డీ’ అని పెడదామా అని ఓ దశలో అనుకున్నారు. ఆఖరికి ‘ఒక్కడు’ అనుకున్నారు. ఒక్కళ్లు కూడా ‘నో’ అనలేదు.
    
హైదరాబాద్ శివార్లలో గోపన్నపల్లెలో రామానాయుడుగారికి పదెకరాల ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ చార్మినార్ సెట్ వేయాలి. రియల్‌గా చార్మినార్ హైట్ దాదాపు 176 అడుగులు. అందులో చుట్టూ ఉండే నాలుగు మినార్ల హైట్ సుమారు 78 అడుగులు. ఈ కథకు కావాల్సింది ఆ మినార్లే. అంతవరకూ కనబడితే చాలు. కింద నుంచి పైవరకూ అవసరం లేదు.
 
అందుకే కింద బాగా తగ్గించేసి 120 అడుగుల హైట్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. చార్మినార్, చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్... దీనికి అయిదెకరాల ప్లేస్. త్రీ మంత్స్... 300 మంది వర్కర్స్... ఫినిష్ అయ్యేసరికి కోటి డెబ్భై లక్షల బడ్జెట్ తేలింది.  ఇంత సెట్‌లో రోడ్ల సెటప్ లేదు. రోడ్లు కూడా వేయాలంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ రోడ్ల వరకూ కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చేయాలని డిసైడైపోయారు. ఓ పక్క సెట్ వర్క్ జరుగుతుంటే మరోపక్క ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్.
 
‘మృగరాజు’ లాంటి ఫ్లాప్ తీసిన డెరైక్టర్, ‘దేవీపుత్రుడు’ లాంటి ఫ్లాప్ తీసిన ప్రొడ్యూసరూ కలిసి మహేశ్‌తో ఏం సినిమా తీస్తారు? పాపం... మహేశ్ పని గోవిందా! ఇవన్నీ వీళ్లకు వినబడుతూనే ఉన్నాయి. కోపం రాలేదు. ఇంకా కసి పెరిగింది. బ్లాక్‌బస్టర్ తీయాలి. వాళ్ల నోళ్లు మూయించాలి.
    
షూటింగ్ స్టార్ట్. చార్మినార్ సెట్‌లో షెడ్యూల్. సెట్ నిడివి అర కిలోమీటర్. లైటింగ్ చెయ్యాలంటే 15 జనరేటర్లు కావాలి. మామూలు క్రేన్లు చాలవు. స్ట్రాడా క్రేన్ కావాల్సిందే. కష్టమైనా షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. క్లైమాక్స్‌కి మాత్రం చాలా కష్టపడ్డారు. డిసెంబర్ రాత్రిళ్లు... విపరీతమైన చలి... 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు... 11 రోజుల షూటింగ్...
 
కబడ్డీ కోసమైతే మహేశ్ నిజం ప్లేయర్‌లానే కష్టపడ్డాడు. ఇంతకు ముందు  ఎప్పుడూ కబడ్డీ ఆడింది లేదు. కేవలం ఈ సినిమా కోసం రెండ్రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. మహేశ్‌కి బూట్లు వేసుకోవడం అలవాటాయె. ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి. మోకాళ్లకు దెబ్బలు... విపరీతమైన కాళ్ల నొప్పులు. అయినా భరించాడు.
 
ఎమ్మెస్ రాజుకు ఇలాంటి భారీ వెంచర్లు కొత్త కాదు. కానీ వాటికన్నా భిన్నమైన ప్రాజెక్ట్ ఇది. ఏ మాత్రం తేడా వచ్చినా అవుట్. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఇక్కడ రాజూ ఆయనే. మొండివాడూ ఆయనే. అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు. గుణశేఖర్‌కి ఎంతవరకూ సపోర్ట్‌గా నిలబడాలో అంత వరకూ నిలబడ్డారాయన. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు రూ. 13-14 కోట్లు వెచ్చించారు.
    
ఫస్ట్ కాపీ వచ్చింది. ఎమ్మెస్ రాజు, గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్ తదితరులు రష్ చూశారు. పరుచూరి బ్రదర్స్‌కు ఎక్కడో ఏదో కొడుతోంది. స్క్రీన్‌ప్లే ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో ఉండటం కరెక్ట్ కాదు. స్ట్రెయిట్ నేరేషన్ చేసేయమన్నారు. వాళ్లకు ‘రష్ కింగ్స్’ అని పేరు. రష్ చూసి బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తో కూర్చుని 10 నిమిషాల్లో స్ట్రయిట్ నేరేషన్‌గా మార్చేశాడు గుణశేఖర్. ఇప్పుడందరూ హ్యాపీ.
    
2003 జనవరి 15. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్... సుదర్శన్ 35 ఎం.ఎం. థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు, గుణశేఖర్, ఎమ్మెస్ రాజు. ఇంటర్వెల్‌లోనే రిజల్ట్ తేలిపోయింది. గుణశేఖర్ హ్యాండ్లింగ్ అదుర్స్. ఎమ్మెస్ రాజు మేకింగ్ మార్వలెస్. మహేశ్ కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్.  అప్పుడు ఆంధ్రాలో కరువు సీజన్. ఇంకోపక్క వరల్డ్‌కప్ హంగామా. ఇండియా ఫైనల్స్‌కు కూడా వెళ్ళింది. ఇంత టెన్షన్ మూమెంట్‌లో కూడా ‘ఒక్కడు’ క్రియేటెడ్ రికార్డ్స్.
 
వెరీ ఇంట్రెస్టింగ్...
* తమిళంలో విజయ్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమా చేశారు.
* ఈ సినిమాతో మహేశ్‌ను హిందీలో లాంచ్ చేద్దామని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ముచ్చటపడ్డారు. కానీ మహేశ్ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల కాంబినేషన్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో హిందీలో తీయాలనుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే బోనీకపూర్ తన తనయుడు అర్జున్ కపూర్‌తో ‘తేవర్’గా రీమేక్ చేశారు.
 - పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement