ఐ లవ్యూ జెస్సీ! | YE MAYA CHESAVE Movie | Sakshi
Sakshi News home page

ఐ లవ్యూ జెస్సీ!

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

ఐ లవ్యూ జెస్సీ!

ఐ లవ్యూ జెస్సీ!

సినిమా వెనుక స్టోరీ - 19
మనం ఎవర్ని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? పోనీ, ప్రేమను వెతుక్కుంటూ వెళ్లగలమా? ప్రేమ... దానికదే జరగాలి. ఏదో మాయ చేసినట్టు ఉండాలి. తలకిందులు చేసెయ్యాలి. ఎప్పుడూ మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ.
    
ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా... నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను? జెస్సీ... చాలా అందంగా ఉంటుంది. క్లాసీ... బాగా చదువుకుంది... తనకొక స్టయిల్ ఉంది అండ్ సెక్సీ టూ. కార్తీక్ మనసు నిండా నిండిపోయింది జెస్సీ. కార్తీక్ తెలుగబ్బాయి. జెస్సీ మలయాళీ అమ్మాయి.
 ఈ ‘క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీ’ని నేరేట్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. మహేశ్‌బాబు చాలా శ్రద్ధగా వింటున్నాడు.

ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లిపోయినట్టుగా సీన్స్, షాట్స్, ఆర్‌ఆర్ బిట్స్... అన్నీ చెప్పేసుకుంటూ పోతున్నాడు గౌతమ్. కథ ఇంత బాగా చెబుతున్నాడంటే, రేపు స్క్రీన్‌పై ఇంకెంత బాగా చూపిస్తాడో మహేశ్‌కి అర్థమవుతోంది. అక్క మంజుల తీసుకొచ్చిందీ ప్రపోజల్. కథ నచ్చింది. కానీ చేయలేడు. చేయకూడదు కూడా. మహేశ్‌కున్న ఇమేజ్‌కి ఇలాంటి సాఫ్ట్ లవ్‌స్టోరీ ఎలా సెట్ అవుతుంది?
‘‘గౌతమ్‌జీ... మనమో మంచి యాక్షన్ సినిమా చేద్దాం. మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ చెప్పాడు మహేశ్ నవ్వుతూ. దట్స్ ఇట్. అక్కడితో ఆ కథ ఎండ్.
    
గౌతమ్ మీనన్ ఇలా అనుకున్నాడంటే... అలా సినిమా మొదలెట్టేస్తాడు. మహేశ్ వద్దనుకున్న కథతో తమిళంలో శింబు, త్రిషతో ‘విన్నై తాండి వరువాయా’ మొదలెట్టేశాడు. ఇక్కడేమో మంజులను ఆ కథ హాంట్ చేస్తూ ఉంది. తెలుగులో ఇలాంటి ప్యూర్ అండ్ పొయిటిక్ లవ్‌స్టోరీలొచ్చి చాలా ఏళ్లయిపోయింది. ఇప్పుడు చేస్తే ఆడియన్స్ కచ్చితంగా కనెక్టవుతారు. మంజుల మళ్లీ కలిసింది గౌతమ్‌ని.
 
‘‘దీన్ని సైమల్‌టేనియస్‌గా తెలుగులో కూడా చేద్దాం’’ మంజుల ప్రపోజల్.
 ‘‘నాకేం ఇబ్బంది లేదు. మరి హీరో?’’ అడిగాడు గౌతమ్.
 మంజులకు నాగచైతన్య గుర్తొచ్చాడు. అప్పుడే ‘జోష్’తో లాంచ్ అయ్యాడు. క్యూట్ బాయ్. గౌతమ్‌ని తీసుకుని నాగార్జునను, నాగచైతన్యను కలిసింది. కథ వినగానే నాగ్, చైతన్య ఇమీడియట్‌గా రెస్పాండ్ అయ్యారు. ప్రాజెక్ట్ సెట్.
 
ఇక మిగిలింది జెస్సీ కేరెక్టర్. తమిళంలో చేస్తున్న త్రిషను ఇక్కడ కంటిన్యూ చేయలేరు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్‌ని పెడదామా? రకరకాల ట్రయల్స్. నాగచైతన్య కొత్తవాడు కాబట్టి కొత్తమ్మాయి అయితేనే బాగుంటుందని ఫైనల్ డెసిషన్. ఎక్కడున్నావమ్మా జెస్సీ?
   
చెన్నై - స్టెల్లా మేరీస్ కాలేజ్‌లోకి ఓసారి కెమెరాను జూమ్ చేయండి. అదిగో వస్తోంది. క్లోజప్ వేయండి. ఎస్... తను సమంత... సమంత రూత్ ప్రభు.
ఆమెతో పాటు కూర్చొని షుగర్‌లెస్ కాఫీ తాగినా తియ్యగానే ఉంటుంది. చుక్కల్లో జాబిలిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపే ఆమెను మోడల్‌ని చేసింది. సమంతది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బీకామ్ ఫినిష్ చేసి ఎంబీయే కోసం ఆస్ట్రేలియా వెళ్లే ప్రయత్నంలో ఉంది.

ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బర్త్‌డే పార్టీకెళ్లింది. అక్కడికొచ్చిన ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఆమె ఫొటోలు తీసి పేపర్‌లో పబ్లిష్ చేశాడు. కట్ చేస్తే - ‘నాయుడు హాల్’ అనే ఫేమస్ క్లాత్‌స్టోర్ట్స్‌కి మోడలింగ్ చాన్స్. రూ.1500 రెమ్యునరేషన్. ఫస్ట్ మోడలింగ్ సూపర్‌హిట్. సమంతకు ఫుల్ క్రేజ్. చిక్ షాంపూ... ఇవా పౌడర్... ఇలా 100 వరకూ యాడ్ ఆఫర్స్. ఇదో సరదాలా ఉందామెకు. ఆ ఫ్రాగ్రెన్స్ అక్కడితో ఆగిపోదు కదా. రవివర్మన్ అనే కెమెరామ్యాన్‌కి సమంత ‘లైక్ ఎట్ ఫస్ట్ సైట్’.
 
ఇక్కడ మళ్లీ కట్ చేయాలి. ఎందుకంటే - సమంత ఇప్పుడు సినిమా హీరోయిన్. ‘మాస్కోవిన్ కావేరీ’ అనే మూవీ. 2007 ఆగస్టులో షూటింగ్ స్టార్ట్. సమంతకు టైం బాలేదో, ప్రొడ్యూసర్‌కి పర్సు బాలేదో... సినిమా షూటింగ్ నత్తనడక నడుస్తోంది.
 కానీ సమంత ఫ్రాగ్రెన్స్ మళ్లీ పనిచేసింది. ఇంకో ఆఫర్. అధర్వ హీరోగా ‘బాణా కాత్తాడి’. ఈసారి కూడా సమంతకు టైమ్ బ్యాడేనా? ఇదీ నత్తనడకే.
మళ్లీ కట్ చేస్తే...
    
గౌతమ్ మీనన్ తెలుగు సినిమా కోసం హీరోయిన్‌ను వెతుకుతున్నాడని సమంతకు తెలిసి, ఫొటోలు పంపించింది. ఈ వంకతోనైనా తన ఫేవరేట్ డెరైక్టర్‌ను ఒక్కసారి కలిసేయొచ్చు.
 ఆడిషన్స్‌కి రమ్మని కాల్. భయపడింది. వెళ్లలేదు. సెకెండ్ టైమ్ కాల్. సిగ్గుపడింది. వెళ్లలేదు. థర్డ్ టైమ్ కాల్. ఇబ్బంది పడింది. వెళ్లక తప్పలేదు.
 
ఎదురుగా గౌతమ్. మాట్లాడకుండా కూర్చుంది. ‘‘ఒక సీన్ చెబుతాను. యాక్ట్ చేసి చూపించు. కాఫీ షాపులో కార్తీక్ ఎదురుగా కూర్చుని నువ్వు మాట్లాడాలి’’ అంటూ తెలుగులో ఏవో డైలాగ్స్ చెప్పారు గౌతమ్. సమంతలో కంగారు. నాన్న తెలుగువాడే కానీ, పుట్టి పెరిగింది అంతా చెన్నైలో కావడంతో తమిళం, ఇంగ్లిషు తప్ప ఇంకేమీ రావు. బెరుకు బెరుగ్గానే సీన్ చేసి చూపించింది.
 గౌతమ్ ఫేస్‌లో ఎలాంటి రెస్పాన్సూ లేదు. తన పని అవుట్. అయినా హోప్ పెట్టుకుని రాలేదుగా. గౌతమ్‌ను చూడాలనుకుంది. చూసేసింది. ఇంటికి వెళ్తూ సమంత మైండ్ నిండా ఇవే ఆలోచనలు. అక్కడితో ఆ ఎపిసోడ్ మర్చిపోయింది.
 
కానీ గౌతమ్ మర్చిపోలేదు. సమంతలో ఆయనకు జెస్సీనే కనిపిస్తోంది. ఆ బెరుకుతనం... ఆ ముగ్ధమోహనత్వం... ఆ మలయాళీ ఫేస్ కట్. మూడ్రోజుల తర్వాత సమంతకు ఫోన్. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని. అప్పుడు చూడాలి సమంతను. చెన్నై సముద్రం కూడా ఆమె సంతోషం ముందు చిన్నబోయినట్టే అనిపించింది.
    
కార్తీక్‌కి డెరైక్టర్ కావాలనేది డ్రీమ్. ఎవరైనా డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ కావాలి. తమిళంలో ఆ డెరైక్టర్ క్యారెక్టర్ కేయస్ రవికుమార్ చేస్తున్నాడు. తెలుగులో కూడా ఎవరైనా పాపులర్ డెరైక్టర్ కావాలి. పూరీ జగన్నాథ్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదనిపించింది మంజులకు.
 నిజానికి పూరి స్క్రీన్ మీద కనబడ్డానికి పెద్ద ఇంట్రస్ట్ చూపడు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేస్తున్నప్పుడు హిందీ ‘శివ’లో స్టూడెంట్ గ్యాంగ్‌లో చేశాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ఓ సీన్‌లో కనిపించాడు. అంతకు మించి ఏ సినిమాలో కనబడలేదు. కానీ గౌతమ్ స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్.
    
షూటింగంటే... బోలెడంత హడావిడీ, హంగామా. అరుపులూ కేకలు. కానీ గౌతమ్ మాత్రం చాలా సెలైంట్‌గా షూట్ చేసేస్తున్నాడు. అన్నీ తక్కువ తక్కువ డైలాగులు.
 సమంతను చీరలు కట్టుకోమన్నారు. ఆమెకేమో చీర అలవాటు లేదు. ఇబ్బంది పడిపోయింది.
 నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్. సమంత కంగారుపడిపోయింది. కానీ గౌతమ్ ఆ షాట్‌ని చాలా ఈస్తటిక్‌గా తీశాడు.
అలెప్పీ, చెన్నై, మాల్టా, కేరళ, తిరుచ్చి, తంజావూర్, న్యూయార్క్, రోమ్... ఇలాంటి చోట్ల బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని కెమెరాలో క్యాప్చర్ చేశారు.
   
గౌతమ్‌కో అలవాటు ఉంది. క్లైమాక్స్ ముందు రాసుకోడు. ఎయిటీ పర్సంట్ వరకూ స్క్రిప్టు రెడీ చేసుకుని షూటింగ్‌కి వెళ్లిపోతాడు. షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ రాసుకుంటాడు. దీనికేమో శాడ్ ఎండింగ్ అనుకున్నాడు.  మంజుల మాత్రం హ్యాపీ ఎండింగ్ కావాలని పట్టుబట్టింది. ఓకే. తమిళ్‌కి శాడ్. తెలుగుకి హ్యాపీ.
    
కార్తీక్ సినిమా డెరైక్ట్ చేస్తాడు. ఆ సినిమాకి హీరో హీరోయిన్లు కావాలి కదా. గౌతమ్ ఇక్కడో చిన్న తమాషా చేశాడు. తమిళ వెర్షన్‌లో నాగచైతన్య, సమంతలతో ఆ గెస్ట్ రోల్స్ చేయించాడు. తెలుగులో శింబు, త్రిషతో యాక్ట్ చేయించాడు.
 
తెలుగులో ‘జెస్సీ’ అని టైటిల్ పెడితే బాగుంటుంది కానీ, లవ్‌స్టోరీ అనే ఫీల్ రాదు. ఏదైనా పొయిటిక్ టైటిల్ పెట్టాలి. ఏదైనా మంచి పాటలోని పల్లవి పెడితే? ‘ఒక్కడు’లో ‘నువ్వేం మాయ చేసావో కానీ..’ అంటూ ఓ పాట ఉంది. ‘ఏ మాయ చేసావె’ టైటిల్ డన్.
 టోటల్ బడ్జెట్... పన్నెండున్నర కోట్లు. గౌతమ్‌కి 3 కోట్లు... రెహమాన్‌కి 2 కోట్లు... రీ-రికార్డింగ్‌కి 50 లక్షలు. నాగచైతన్యకు శాటిలైట్ రైట్స్... ఇవీ రెమ్యునరేషన్స్.
    
2010 వేలెంటైన్స్ డే వెళ్లిపోయిన 12 రోజుల తర్వాత ‘ఏ మాయ చేసావె’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ రొమాంటిక్ పొయిట్రీ చదువుతున్న ఫీలింగ్. రీ-రికార్డింగ్, విజువల్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ. నాగచైతన్య - సమంత పెయిర్‌కి డిస్టింక్షన్ మార్‌‌క్స.
 ఏఎన్నార్, నాగార్జునలాగా నాగచైతన్య రొమాంటిసిజమ్‌లో ట్రేడ్‌మార్క్ చూపించాడు. సమంత అయితే అప్పుడే వికసించిన రోజాపువ్వులా ఫ్రెష్‌గా అనిపించింది. ముఖ్యంగా ఆమె వాయిస్. డబ్బింగ్ చెప్పిన చిన్మయిదే ఆ క్రెడిట్. ఒక్క హిట్‌తో సమంత కెరీర్ రూపురేఖలే మారిపోయాయి.
   
గౌతమ్ ఈ సినిమాతో ఒక స్టెప్ ఎదిగాడు. పెద్దపెద్దవాళ్లు కూడా అప్రిషియేట్ చేశారు. సత్యన్ అందిక్కాడ్ లాంటి టాప్ మలయాళీ డెరైక్టర్, ఇప్పటివరకూ కేరళను ఇంతందంగా ఎవరూ చూపించలేదని మెచ్చుకున్నాడు. ఈ విషయంలో కెమెరామన్ మనోజ్ పరమహంసదే క్రెడిట్. అతనికిదే ఫస్ట్ సినిమా.

ఇంతకీ ఈ మనోజ్ పరమహంస ఎవరో తెలుసా? ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా ‘పగడాల పడవ’ అనే సినిమా డెరైక్ట్ చేసిన యు.వి.బాబు కొడుకు.
గౌతమ్ మీనన్ జీవితానుభవాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఓ రకంగా ఇది ఆయన సెమీ-బయోగ్రాఫికల్ ఫిల్మ్. అందుకే దీనికి సీక్వెల్ చేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నాడు.
 మరి ఈసారి ఏ మాయ చేస్తాడో చూద్దాం!!
 
వెరీ ఇంట్రస్టింగ్...
* ఇందులో సమంత అన్నయ్యగా సుధీర్‌బాబు నటించారు. ఆ తర్వాత ఆయన ‘ఎస్‌ఎంఎస్’తో హీరోగా పరిచయమయ్యారు.
* నాగచైతన్య తండ్రిగా కనబడింది ఈ చిత్ర నిర్మాత సంజయ్ స్వరూప్. మంజుల హజ్బెండ్.
- పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement