పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం | Athadu Movie Story behind Film -13 | Sakshi
Sakshi News home page

పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం

Published Sun, Aug 23 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం

పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం

సినిమా వెనుక స్టోరీ - 13
పవన్ కల్యాణ్ స్టూలు మీద కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో త్రివిక్రమ్.
‘ఇక మొదలుపెట్టు’ అన్నట్టుగా పవన్ చిన్నగా తల కదిల్చాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు.
5...10...15...20 నిమిషాలు... పవన్ అలా చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు.
త్రివిక్రమ్ కథ ఆపేశాడు. పవన్‌కి మెలకువ వచ్చింది. త్రివిక్రమ్ నిశ్శబ్దంగా బయటికొచ్చేశాడు.
   
పద్మాలయా స్టూడియో ఆఫీసు రూమ్. మహేశ్‌బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తికాగానే మహేశ్ సీరియస్‌గా లేచి వెళ్లిపోయాడు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్. రాసిన సినిమాలన్నీ సూపర్‌హిట్. తన రైటింగ్స్ కోసం హీరోలంతా వెయిటింగ్. అలాంటివాడికి ఈ ట్విస్టు అర్థం కాలేదు.  కథ నచ్చలేదా? లేక సరిగ్గా చెప్పలేకపోతున్నానా? ఒకాయనేమో నిద్రపోయాడు. ఇంకొకాయన వెళ్లిపోయాడు. ఏంటిది?!
 
ఇలాంటి ఆలోచనల్లో, ఏం చేయాలో పాలుపోక ఉన్న పరిస్థితుల్లో... కాసేపటికి లోపలికొచ్చాడు మహేశ్. ‘‘ఏంటి సార్... ఈ కథ! మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్పాను. ఈ సినిమా మనం చేస్తున్నాం. పద్మాలయా బ్యానర్‌లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు’’ అని ఉద్వేగంగా చెప్పేశాడు మహేశ్.
 
ఆ చివరి మాటలకు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ‘నువ్వే నువ్వే’ కన్నా ముందే నన్ను డెరైక్షన్ చేయమని ‘జయభేరి’ సంస్థ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చారు. తొలి సినిమా ‘స్రవంతి’ రవికిశోర్ వాళ్ళకు చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి, ‘నువ్వే - నువ్వే’ వాళ్లకు చేస్తున్నాను. ఇప్పుడీ రెండో సినిమా ‘జయభేరి’కే చేద్దామండీ’’ చెప్పాడు త్రివిక్రమ్. ‘‘ఓకే సర్... ప్లాన్ చేద్దాం. నేనే మీకు కబురు చేస్తా’’ అన్నాడు మహేశ్. అప్పుడాయన ‘టక్కరిదొంగ’ చేస్తున్నాడు.
   
‘టక్కరిదొంగ’ రిలీజైపోయింది. ‘బాబి’ రిలీజైపోయింది. ‘ఒక్కడు’ రిలీజైపోయింది. ‘నిజం’ రిలీజైపోయింది. ‘నాని’ జరుగుతోంది. ‘అర్జున్’ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ ఫినిష్ చేసి ఇక్కడ వెయిటింగ్. నియర్లీ టూ ఇయర్స్. అప్పుడు మహేశ్ నుంచి కాల్ వచ్చింది. త్రివిక్రమ్ కారెక్కాడు. నటుడు - నిర్మాత ‘జయభేరి’ మురళీమోహన్ ఆఫీసులో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.
   
ఈ కథ ఎయిటీ పర్సెంట్ పాశర్లపూడి అనే పల్లెటూళ్లో జరుగుతుంది. లంకంత కొంప కావాలి. మహేశ్‌తో సహా ఇంతమంది కాస్టింగ్‌తో ఎక్కడో పల్లెటూరుకు వెళ్లి షూటింగ్ చేయడం కష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి ఇల్లు దొరికినా అన్నేసి రోజులు షూటింగ్‌కివ్వలేరు. సెట్ వేసి తీరాల్సిందే. సీనియర్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణికి త్రివిక్రమ్ కథ చెప్పసాగారు. కథ చెప్పడం పూర్తయ్యే లోపే, పేపర్ మీద సెట్ డ్రా చేసి ఇచ్చేశారాయన. హైదరాబాద్ శివార్లలో నానక్‌రామ్‌గూడ అవతల ‘జయభేరి’ వాళ్లకు పెద్ద స్థలం ఉంది. అక్కడ కన్‌స్ట్రక్ట్ చేశారా బంగళాని!  

‘వర్షం’ హిటై్ట త్రిష స్వింగ్‌లో ఉంది. మహేశ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. ట్వంటీ డేస్ కాల్షీట్స్ ఓకే. సినిమాలో కీలకమైన సిక్స్‌టీ ప్లస్ ఏజ్డ్ కేరెక్టర్ ఒకటుంది. ప్రొడక్షన్‌వాళ్లు ఏజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్టు తెచ్చిపెట్టారు. త్రివిక్రమ్ దాని మొహం కూడా చూడలేదు. ఆయన మైండ్‌లో నాజర్ ఫిక్స్. 40 ఏళ్ల నాజర్‌తో 60 ఏళ్ల ముసలి వేషమా? కో డెరైక్టర్ రవికిరణ్‌తో పాటు మిగతా డెరైక్షన్ డిపార్ట్‌మెంట్ ఈ సెలక్షన్‌ని క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్.. మల్లి. మహేశ్‌తో కలసి దంధా నడిపే వ్యక్తి. మహేశ్‌లాగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. వెతుకుతున్నారు. ఎవ్వరూ ఆనడం లేదు. మణిరత్నం హిందీలో తీసిన ‘యువ’లో ఒకతను నచ్చేశాడు. అతనే సోనూసూద్.
 
‘నాని’కి గుహన్ కెమెరామన్. మన కథకు ఇలాంటివాడైతే కరెక్ట్ అని ‘నాని’ టైమ్‌లోనే అన్నాడు మహేశ్. త్రివిక్రమ్‌కి ఓకే. అప్పట్లో మహేశ్ సినిమాలన్నిటికీ మణిశర్మ పర్మినెంట్ మ్యూజిక్ డెరైక్టర్. త్రివిక్రమ్‌కి కూడా ఆయనంటే ఇష్టం. ఆయన ఫిక్స్. ఎన్నో నేషనల్ అవార్డులు గెలిచిన శ్రీకర్‌ప్రసాద్ ఎడిటింగ్ అంటే త్రివిక్రమ్‌కి ఓ అడ్మిరేషన్. ఆయన ఎంత బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఆయనే కావాలనుకున్నాడు. ‘అతడు’ స్టార్ట్ అయ్యింది.
   
డెరైక్టర్‌గా త్రివిక్రమ్‌కిది రెండో సినిమా. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్. ఫుల్ క్లారిటీ. ఈ షూటింగ్ టైమ్‌కే మహేశ్ కొంచెం డిస్టర్బ్‌డ్‌గా ఉన్నాడు. ‘అర్జున్’ రిలీజై పైరసీ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు. తీరా లొకేషన్‌కొచ్చాక త్రివిక్రమ్ వర్కింగ్ స్టయిల్‌కి మహేశ్ ఫిదా అయిపోయాడు. ఇంతకుముందు సినిమాల్లోలాగా భారీ డైలాగుల్లేవు. అన్నీ ‘కట్టె... కొట్టె... తెచ్చె’ టైపు డైలాగులే. ముందుగా రాసుకున్న డైలాగుల్ని కూడా లొకేషన్‌కొచ్చాక తగ్గించేశాడు త్రివిక్రమ్.
 
టాకీ పార్ట్ చకచకా అయిపోయింది. కానీ, ముందుంది ముసళ్ల పండగ. యాక్షన్ ఎపిసోడ్స్. ముఖ్యంగా క్లైమాక్స్. పద్మాలయాలో పాత చర్చి సెట్ వేశారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్‌తో హాలీవుడ్ లెవెల్‌లో క్లైమాక్స్ డిజైన్ చేశాడు త్రివిక్రమ్. కొన్ని మోషన్ కంట్రోల్ షాట్స్ తీయాలి. మోషన్ కంట్రోల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాని డేస్ అవి. మహేశ్ పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లడం, ఆ బుల్లెట్‌తో సమానంగా మహేశ్ పరిగెత్తడం, గ్లాస్ బ్రేక్ అవడం... ఇవన్నీ ఒకే షాట్‌లో కనబడాలి.

ఎగ్జిక్యూషన్‌కి టైమ్ పట్టేసింది. దీనికి మొగుడి లాంటి షాట్ ఇంకోటుంది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, అంత కష్టపడ్డారు ఈ ఒక్క షాట్‌కి. మహేశ్, సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు. ఈ బిగ్‌ఫ్రీజ్ షాట్ తీయడానికి వచ్చిన ఫారిన్ కంపెనీవాళ్లు... వాళ్లల్లో వాళ్లకు ఏదో గొడవొచ్చి సడన్‌గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైమ్‌లో ఇలా జరిగింది.
 
పీటర్ హెయిన్ పాపం కిందా మీదా పడి ఓ రిగ్ తయారు చేయించి, దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశాడు. దాంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి. 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌లో స్లో-మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లు, క్యాన్లు నెగిటివ్ కావాల్సిందే. మామూలు 70 ఎం.ఎం. క్యాన్ అయితే 400 ఫీట్లే ఉంటుంది. అదే 16 ఎం.ఎం. క్యాన్‌లో వెయ్యి ఫీట్ల నెగిటివ్ ఉంటుంది. కానీ 16 ఎం.ఎం. నెగిటివ్‌తో షాట్స్ తీసినా మానిటర్‌లో చూడలేరు. ఏదో తంటాలుపడి స్టడీకామ్ కెమెరాకు వాడే చిన్న మానిటర్‌ను తెచ్చి, దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది కానీ, మొత్తానికి షాట్ సూపర్‌గా వచ్చింది.
 
మొత్తం క్లైమాక్స్ తీయడానికి 27 రోజులు పట్టింది. డిసెంబర్ 31 రాత్రి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే, వీళ్లు మాత్రం ఉదయం మొదలుపెట్టినవాళ్ళు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకూ షాట్స్ తీస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్‌లో ఇంకో షాట్ ఉంది. బహిరంగ సభ వేదికపై ఉన్న శాయాజీ షిండేను దూరంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి మహేశ్ గన్‌తో షూట్ చేసే షాట్. అంత దూరంలో బిల్డింగ్ పైన ఉన్న మహేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి శాయాజీ షిండేను చూసే షాట్ అంటే... అంత దూరాన్ని కవర్ చేసే జూమ్ లేదు. దాంతో ఆలోచించి, ‘స్టిచ్ జూమ్’ ఎఫెక్ట్‌లో తీశారు. ఒక్కొక్క షాట్‌ను తీసుకుంటూ టోటల్‌గా దాన్ని ఒక్క షాట్‌లాగా స్టిచ్ చేశారు. వెరీ డిఫికల్ట్ షాట్.
       
నెక్ట్స్‌డే బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ పంచ్ కొట్టే కామెడీ ఎపిసోడ్ తీయాలి. సడన్‌గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయ్యి, హాస్పిటల్‌లో చేర్చారు. తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. నిద్ర లేదు. అయినా ఇంటికెళ్లి స్నానం చేసి డెరైక్ట్‌గా లొకేషన్‌కెళ్లి, ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు. బాధంతా గుండెల్లో దాచుకుని, ఫుల్ ఫన్‌తో ఆ సీన్స్ తీసేశాడు త్రివిక్రమ్.
   
సీబీఐ డెరైక్టర్ వేషం. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే ఆఫీసర్‌కు ఒక చిన్న హ్యూమన్ యాంగిల్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర. హాఫ్ డే కాల్‌షీట్ చాలు. కె.విశ్వనాథ్ లాంటి పెద్దాయన చేస్తే గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ అడగ్గానే ఓకే అన్నారాయన. ఎమ్మెస్ నారాయణది అయితే చాలా చిన్న వేషం. అయినా ఆయన కూడా చాలా ఇష్టపడి చేశారు.
   
క్లైమాక్స్‌కి ముందు మహేశ్ - త్రిష మధ్య కాన్వర్జేషన్. ఏవేవో డైలాగ్స్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఆ ముందు సీన్‌లోనే మహేశ్‌ను ఉద్దేశిస్తూ, నాజర్ చాలా మాట్లాడతాడు. దానికి కొనసాగింపుగా వచ్చే ఇక్కడ కూడా డైలాగులు ఎక్కువైతే బోర్. ఒకటి, రెండు డైలాగ్స్‌తోనే మొత్తం ఎఫెక్ట్ కనబడాలి. త్రివిక్రమ్ బుర్ర షార్ప్‌గా పనిచేసింది. డైలాగ్సన్నీ కొట్టేసి రెండే రెండు డైలాగ్స్ పెట్టారు. మహేశ్‌కి నాజర్ గన్ ఇచ్చి పంపుతుంటే, ‘‘నేనూ వస్తాను’’ అంటుంది త్రిష. దానికి మహేశ్ ఆన్సర్ ‘‘నేనే వస్తాను’’! అంటే, విలన్‌ని తుద ముట్టించి మళ్లీ నీ దగ్గరకు వస్తానని హీరోయిన్‌కి హీరో చెప్పాడన్నమాట!
   
సినిమా మొత్తం కలిపి మహేశ్‌కు నాలుగైదు పేజీల డైలాగులే ఉంటాయి. రెండు గంటల్లో డబ్బింగ్ చెప్పేశాడు. నాజర్ పాత్రకు ఎస్పీ బాలుతో డబ్బింగ్ చెప్పించాలి. ఆయనైతేనే కరెక్ట్. బాలూ చాలా బిజీ. త్రివిక్రమ్ చెన్నై వెళ్లి కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో దగ్గరుండి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. 174 రోజులు తీశారు సినిమా. ఫైనల్‌గా మణిశర్మ చేతిలోకి వెళ్లింది. మణికి సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తన రీరికార్డింగ్‌తో ఒక్కో రీలులో మేజిక్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఆయన ఆర్.ఆర్.నూ ఓ అద్భుతంలా చూస్తూ కూర్చున్నాడు.
   
మహేశ్ పుట్టినరోజు... ఆగస్టు 9. ఆ తర్వాత రోజే ‘అతడు’ రిలీజ్. (2005 ఆగస్టు 10). సినిమా కొత్తగా అనిపించింది. మహేశ్ కొత్తగా అనిపించాడు. మేకింగ్ కొత్తగా అనిపించింది. డైలాగులూ కొత్తగా అనిపించాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్. క్రైమ్ థ్రిల్లర్‌లా కనిపించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపించే ఎమోషనల్ స్టోరీ ఇది. ఫ్యామిలీ వాల్యూస్ కనిపించీ కనిపించకుండా... లవ్‌ను చూపించీ చూపించకుండా... త్రివిక్రమ్ చేసిన మేజికల్ యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది.

పరిశ్రమ ప్రచారానికి అతీతంగా ప్రేక్షకులు తమ మనసుల్లో పట్టం కట్టారు. ‘ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు, లేదా ప్రేమతో తీస్తాడు. వీడేంట్రా... ఇంత శ్రద్ధగా తీశాడు... ఏదో గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు... చాలా జాగ్రత్తగా... పద్ధతిగా తీశాడు’ అన్నారు. టీవీలో కొన్ని వందల సార్లు ప్రసారమైనా, ఇప్పటికీ ఆ సినిమా, సన్నివేశాలు, డైలాగ్స్‌ను జనం పదే పదే చూసి ఆనందిస్తున్నారు. అందుకే, ఒక్క ముక్కలో - ‘అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ్టికీ ‘అతడు’ అంటే ప్రేక్షకులకు ప్రేమతో కూడిన అభిమానం వల్ల వచ్చిన గౌరవం!
- త్రివిక్రమ్ శ్రీనివాస్
 

హిట్ డైలాగ్స
గన్ చూడాలనుకోండి. తప్పులేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు. చచ్చిపోతారు!
జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది! మరి పులినే వేటాడాలంటే ఎంత ఓపిక కావాలి చెప్పు!
తాడే కదా అని తేలిగ్గా తీసేయకమ్మా: అది ఇక్కడ కడితే మొలతాడు. ఇక్కడ కడితే ఉరితాడు. ఇక్కడ కడితే కాశీతాడు. మరి అక్కడ కడితే...? పడతాడు!
 - పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement