Athadu
-
హీరోగా మాత్రమే చేస్తానంటూ.. ఆ హిట్ పాత్రలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా 'సోగ్గాడు'. అది ఎంత స్పెషల్ అంటే, 'వెండితెర సోగ్గాడు' అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. ఈ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్ బాబు. ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని కూడా ఆయన తిరస్కరించారని మీకు తెలుసా..? అందుకు కారణం కూడా ఆయన గతంలో ఇలా చెప్పారు. 'అభిమానులు, ప్రేక్షకులు నన్ను హీరోగా మాత్రమే చూశారు.. అదే స్థాయిలో వారి గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నా కెరీర్ మొత్తం హీరోగానే ముగిసిపోవాలి. మరో పాత్రలో నటించాలని లేదు.' అన్నారు. దీంతో ఆయన సహాయ, కీలక పాత్రల్లో నటించేందుకు ముందుకు రాలేదు. కానీ ఆయన తిరస్కరించిన పాత్రలు ఏవో ఒకసారి చూద్దాం. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అతడు'. ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి (నాజర్) పాత్ర ముందుగా శోభన్ బాబు దగ్గరకే వెళ్లింది. ఈ పాత్ర మీరే చేయాలంటూ నిర్మాత మురళీ మోహన్ కోరారు. అందుకు రెమ్యునరేషన్‌గా బ్లాంక్ చెక్‌నే ఇచ్చారు మురళీ మోహన్.. కానీ శోభన్ బాబు నో చెప్పడం విశేషం. పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లింది. అందుకు భీమినేని శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా శోభన్‌బాబు నో చెప్పారు. తెలుగు సినిమా చరిత్రంలో అన్నమయ్య చిరస్థాయిలో ఉంటుంది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం 1997లో విడుదల అయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర యూనిట్ కోరగా అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్‌గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్లింది. అందులో ఆయన కూడా ఒదిగిపోయాడు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన 'బ్లాక్' తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్.బి. చౌదరి. అందులో శోభన్ బాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందకు కూడా నో చెప్పారు శోభన్ బాబు. అలా ఎన్నో హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించిన శోభన్ బాబు ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన ఓకే చేశారు. అందులో శోభన్ బాబు,కృష్ణ, జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. -
మహేశ్-త్రివిక్రమ్ మూడు సినిమాలకు అదే ప్రాబ్లమ్!?
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్‌కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్‌గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో " అతడు " సీక్వెల్
-
ఆడు మగాడ్రా బుజ్జి..! అమ్మాయి కాదు రా!!
Cyber Crimes Wing Cyberabad: ‘ఏంజెల్ ప్రియా’.. ఈ పేరు గురించి తెలుసు కదా!.. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ల పుట్టుకకు ఒకరకంగా ఆజ్యం పోసింది ఈ పేరే. అయితే సరదాగా మొదలైన ఈ వ్యవహారం ఆ తర్వాతి కాలంలో మోసాలకు తెర లేపింది. ముఖ్యంగా మగవాళ్లే ఆడవాళ్ల పేర్లతో ఫేస్బుక్ యూజర్లను ముగ్గులోకి దించడం, కట్టుకథలు చెప్పి అందినంత దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో కొంతకాలం తగ్గాయనుకున్న ఈ తరహా నేరాలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయట!!. సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తాజాగా ట్విటర్లో ఫన్ అండ్ అవేర్నెస్ పోస్ట్ ఒకటి వేశారు. తివిక్రమ్-మహేష్ బాబు ‘అతడు’లోని ఓ ఫేమస్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్‌రిక్వెస్ట్ పంపి తెగ ఛాటింగ్ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ తండ్రి ఆ కొడుక్కి షాక్ ఇస్తాడు. ఆడు మగాడ్రా బుజ్జి..! Beware of #Fake #Facebook profile frauds @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @actorbrahmaji pic.twitter.com/oph4oL7Aoe — Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) October 4, 2021 తద్వారా ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చారు పోలీసులు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేసి పడేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కూడా. ఇక సోషల్ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్ పంథా. కరెక్ట్ టైమింగ్, రైమింగ్‌తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది. ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్‌ను సైతం వాడేస్తున్నారు. కేరళ, ముంబై పోలీసుల్లాగే.. తెలంగాణ పోలీసుల సోషల్ మీడియా వింగ్ సైతం హ్యూమర్‌ను పంచుతోంది. చదవండి: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!! -
తెలుగు తెరపై ‘త్రివిక్రమ్’ మాటల మంత్రం
మాటలతో మంత్రం వేసి...డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం ఆయనకి మాత్రమే సాధ్యం. పాత్రల మధ్య పంచ్ డైలాగులతో నవ్వించాలన్నా....అనుబంధాల గురించి గుండె బరువెక్కే మాటలు రాయాలన్నా అది ఆయన కలానికి మాత్రమే సాధ్యం. ‘తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది......మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ’లాంటి ఎన్నో డైలాగులు ఆయన గుండె లోతుల్లోంచి రాసుకున్నవే. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కదలించే ఎన్నో సీన్లు...సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుడి మదిలో కదలాడుతూనే ఉంటాయి. అయన డైలాగుల్లో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందంటారు ఆయన అభిమానులు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.... -
కరీంనగర్లో 'అతడు' సీన్ రిపీట్
సాక్షి, హైదరాబాద్ : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన అతడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటీకీ చూసినప్పుడల్లా తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే అచ్చు అతడు చిత్రంలో సన్నివేశం తరహాలోనే ఓ సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. అతడు చిత్రంలో విలన్ తనికెళ్ల భరణి, కొడుకు బ్రహ్మజీతో .. మర్డర్ చేయాలంటే కత్తులుండాలి కానీ, క్వాలీసులు, సుమోలు ఎందుకురా భుజ్జీ.. అన్ని బండ్లు వద్దురా పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా.. అందరూ కలిసి ఒకే బండిలో వెళ్లండిరా.. మీరెంత సైలెంట్‌గా ఉంటే మర్డర్ అంత వైలెంట్‌గా ఉంటది.. అంటూ చెబుతాడు ... తర్వాత సీన్లో అందరు రౌడీలు కలిసి ఇరుక్కుని మరీ ఒకే సుమోలో కూర్చోని వస్తారు.. సీరియస్ సిచ్చువేషన్‌లోనూ కామెడీ పూయించే ఆ సన్నివేశం అందరికీ గుర్తుండిపోతుంది. తెగ నవ్వు తెప్పించే అలాంటి సన్నివేశమే కరీంగర్‌లోని తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత పోలీసులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి లెక్కించారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతపై బాధ్యత వహించాలని దీనికి సంబంధించి వీడియోను కరీంనగర్ సీపీ కమాలాసన్ రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అంత కలర్ కూడా కాదు కదా...!
అక్కకి పెళ్లి చూపులు... ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేయాల్సిన చెల్లెలు గదిలో దాక్కుంటుంది. అంత కర్మేంటి? అంటే.. ‘అందం’గా ఉన్నందుకే. ‘అక్క కన్నా అందంగా ఉన్నావు కాబట్టి, వచ్చే అబ్బాయి నిన్ను చేసుకుంటాననే ప్రమాదం ఉంది. అందుకే దాక్కో’ అంటారు ఆ అమ్మాయి అమ్మానాన్న. ఏంటీ.. ‘అతడు’ సినిమాలో సీన్ గుర్తొస్తోంది కదూ. యస్... చెబుతున్నది దాని గురించే. అదే సీన్లో త్రిషను ఉద్దేశించి మహేశ్‌బాబు, ‘‘వాళ్లందరూ చెప్పడం వల్ల నీకలా అనిపిస్తుంది కానీ, నిజానికి నువ్వు అంత బాగుండవ’’నే టైప్‌లో ఆటపట్టిస్తాడు. ఆ సందర్భంలో గమ్మత్తై డైలాగులతో మహేశ్ తెగ ఆటపట్టిస్తున్నప్పుడు ఉక్రోషంగా త్రిష ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. త్రిష ఎంత మంచి నటో చెప్పడానికి ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అంత మంచి నటి కాబట్టే, పధ్నాలుగేళ్లయినా నటిగా ఆమె ‘స్టేల్’ కాలేదు. నిజానికి ఓ రెండు, మూడేళ్ల క్రితం త్రిష కెరీర్ కొంచెం పడిపోతున్నట్లు అనిపించింది. యువ కథా నాయికలు చాలామంది వచ్చేశారు కాబట్టి, పధ్నాలుగేళ్లుగా చేస్తున్న త్రిష ఇక సర్దుకోవాల్సిందే అని కొంతమంది అనుకున్నారు కూడా. కానీ, అలా జరగలేదు. జస్ట్ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో కానీ, కెరీర్ డౌన్‌ఫాల్ మాత్రం కాలేదు. పైగా గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాలు చేసి, ఆశ్చర్యపరిచారు. ఇన్నేళ్లయినా త్రిష ఇంకా ఫామ్‌లో ఉండగలగడానికి కారణం ఏంటి? అంటే.. ‘మంచి నటి కాబట్టి’ అనొచ్చు. నటన ఒక్కటే ఉంటే సరిపోదు. మీద పడుతున్న వయసును కనబడనివ్వక పోవడం పెద్ద ప్లస్. ఇటీవల విడుదలైన ‘కళావతి’లో బీచ్ సాంగ్ చూసినవాళ్లు త్రిషకు థర్టీ ఇయర్స్ అంటే నమ్మరు. ఫిజిక్ అంత బాగుంటుంది. తమిళ చిత్రం ‘మౌనమ్ పేసియదే’, తెలుగు చిత్రం ‘నీ మనసు నాకు తెలుసు’ ద్వారా పరిచయమైనప్పుడు త్రిష ఎంత సన్నగా ఉండేవారో ఇప్పటికీ దాదాపు అలానే ఉన్నారు. చెప్పాలంటే మరింత మెరుపుతో సినిమా సినిమాకీ ఇంకా ఆకర్షణీయంగా కనపడుతున్నారే తప్ప, వయసు ప్రభావం కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా త్రిష చేతిలో తక్కువ సినిమాలేం లేవు. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘నాయకి’తో పాటు ధనుష్ సరసన ‘కొడి’ చేస్తున్నారు. ఇంకా, యువహీరో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా అంగీకరించారు. మొత్తం మీద బిజీ బిజీగానే ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో సినిమాల పరంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసేశారు. విజయవంతంగా సెంచరీవైపు అడుగులు వేస్తున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే... ‘అతడు’ సినిమాలో మహేశ్ ఆటపట్టిస్తూ, ‘కళ్లు కూడా అంత పెద్దవి కావు... ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది.. అంత కలర్ కూడా కాదు కదా’ అనే డైలాగ్ త్రిషకు సరిగ్గా సరిపోతుంది. నిజమే. ఆమె అంత కలర్ కాదు. కళ్లు కూడా సోసోగా ఉంటాయి. ముక్కు తీరూ అంతే. మరి.. ఎందుకు త్రిష హవా తగ్గడం లేదు? అనడిగితే.. ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లోని ‘ఏండే.. ఓ పాట పాడండే..’ డైలాగ్‌లా, ‘ఏండే.. ఇక్కడ త్రిష అండే... కత్తి లాంటి బాడీ, నటనలో వాడి అలానే ఉన్నయండే’ అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఈ చెన్నై చందమామకు తిరుగు లేదంటే అతిశయోక్తి కాదు. -
పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం
సినిమా వెనుక స్టోరీ - 13 పవన్ కల్యాణ్ స్టూలు మీద కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో త్రివిక్రమ్. ‘ఇక మొదలుపెట్టు’ అన్నట్టుగా పవన్ చిన్నగా తల కదిల్చాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. 5...10...15...20 నిమిషాలు... పవన్ అలా చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. త్రివిక్రమ్ కథ ఆపేశాడు. పవన్‌కి మెలకువ వచ్చింది. త్రివిక్రమ్ నిశ్శబ్దంగా బయటికొచ్చేశాడు. పద్మాలయా స్టూడియో ఆఫీసు రూమ్. మహేశ్‌బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తికాగానే మహేశ్ సీరియస్‌గా లేచి వెళ్లిపోయాడు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్. రాసిన సినిమాలన్నీ సూపర్‌హిట్. తన రైటింగ్స్ కోసం హీరోలంతా వెయిటింగ్. అలాంటివాడికి ఈ ట్విస్టు అర్థం కాలేదు. కథ నచ్చలేదా? లేక సరిగ్గా చెప్పలేకపోతున్నానా? ఒకాయనేమో నిద్రపోయాడు. ఇంకొకాయన వెళ్లిపోయాడు. ఏంటిది?! ఇలాంటి ఆలోచనల్లో, ఏం చేయాలో పాలుపోక ఉన్న పరిస్థితుల్లో... కాసేపటికి లోపలికొచ్చాడు మహేశ్. ‘‘ఏంటి సార్... ఈ కథ! మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్పాను. ఈ సినిమా మనం చేస్తున్నాం. పద్మాలయా బ్యానర్లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు’’ అని ఉద్వేగంగా చెప్పేశాడు మహేశ్. ఆ చివరి మాటలకు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ‘నువ్వే నువ్వే’ కన్నా ముందే నన్ను డెరైక్షన్ చేయమని ‘జయభేరి’ సంస్థ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చారు. తొలి సినిమా ‘స్రవంతి’ రవికిశోర్ వాళ్ళకు చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి, ‘నువ్వే - నువ్వే’ వాళ్లకు చేస్తున్నాను. ఇప్పుడీ రెండో సినిమా ‘జయభేరి’కే చేద్దామండీ’’ చెప్పాడు త్రివిక్రమ్. ‘‘ఓకే సర్... ప్లాన్ చేద్దాం. నేనే మీకు కబురు చేస్తా’’ అన్నాడు మహేశ్. అప్పుడాయన ‘టక్కరిదొంగ’ చేస్తున్నాడు. ‘టక్కరిదొంగ’ రిలీజైపోయింది. ‘బాబి’ రిలీజైపోయింది. ‘ఒక్కడు’ రిలీజైపోయింది. ‘నిజం’ రిలీజైపోయింది. ‘నాని’ జరుగుతోంది. ‘అర్జున్’ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ ఫినిష్ చేసి ఇక్కడ వెయిటింగ్. నియర్లీ టూ ఇయర్స్. అప్పుడు మహేశ్ నుంచి కాల్ వచ్చింది. త్రివిక్రమ్ కారెక్కాడు. నటుడు - నిర్మాత ‘జయభేరి’ మురళీమోహన్ ఆఫీసులో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ కథ ఎయిటీ పర్సెంట్ పాశర్లపూడి అనే పల్లెటూళ్లో జరుగుతుంది. లంకంత కొంప కావాలి. మహేశ్‌తో సహా ఇంతమంది కాస్టింగ్‌తో ఎక్కడో పల్లెటూరుకు వెళ్లి షూటింగ్ చేయడం కష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి ఇల్లు దొరికినా అన్నేసి రోజులు షూటింగ్కివ్వలేరు. సెట్ వేసి తీరాల్సిందే. సీనియర్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణికి త్రివిక్రమ్ కథ చెప్పసాగారు. కథ చెప్పడం పూర్తయ్యే లోపే, పేపర్ మీద సెట్ డ్రా చేసి ఇచ్చేశారాయన. హైదరాబాద్ శివార్లలో నానక్‌రామ్‌గూడ అవతల ‘జయభేరి’ వాళ్లకు పెద్ద స్థలం ఉంది. అక్కడ కన్స్ట్రక్ట్ చేశారా బంగళాని! ‘వర్షం’ హిటై్ట త్రిష స్వింగ్‌లో ఉంది. మహేశ్‌కి పర్ఫెక్ట్గా సూటవుతుంది. ట్వంటీ డేస్ కాల్షీట్స్ ఓకే. సినిమాలో కీలకమైన సిక్స్టీ ప్లస్ ఏజ్డ్ కేరెక్టర్ ఒకటుంది. ప్రొడక్షన్‌వాళ్లు ఏజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్టు తెచ్చిపెట్టారు. త్రివిక్రమ్ దాని మొహం కూడా చూడలేదు. ఆయన మైండ్‌లో నాజర్ ఫిక్స్. 40 ఏళ్ల నాజర్‌తో 60 ఏళ్ల ముసలి వేషమా? కో డెరైక్టర్ రవికిరణ్‌తో పాటు మిగతా డెరైక్షన్ డిపార్ట్మెంట్ ఈ సెలక్షన్‌ని క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్.. మల్లి. మహేశ్‌తో కలసి దంధా నడిపే వ్యక్తి. మహేశ్లాగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. వెతుకుతున్నారు. ఎవ్వరూ ఆనడం లేదు. మణిరత్నం హిందీలో తీసిన ‘యువ’లో ఒకతను నచ్చేశాడు. అతనే సోనూసూద్. ‘నాని’కి గుహన్ కెమెరామన్. మన కథకు ఇలాంటివాడైతే కరెక్ట్ అని ‘నాని’ టైమ్‌లోనే అన్నాడు మహేశ్. త్రివిక్రమ్‌కి ఓకే. అప్పట్లో మహేశ్ సినిమాలన్నిటికీ మణిశర్మ పర్మినెంట్ మ్యూజిక్ డెరైక్టర్. త్రివిక్రమ్‌కి కూడా ఆయనంటే ఇష్టం. ఆయన ఫిక్స్. ఎన్నో నేషనల్ అవార్డులు గెలిచిన శ్రీకర్‌ప్రసాద్ ఎడిటింగ్ అంటే త్రివిక్రమ్‌కి ఓ అడ్మిరేషన్. ఆయన ఎంత బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఆయనే కావాలనుకున్నాడు. ‘అతడు’ స్టార్ట్ అయ్యింది. డెరైక్టర్‌గా త్రివిక్రమ్కిది రెండో సినిమా. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్. ఫుల్ క్లారిటీ. ఈ షూటింగ్ టైమ్‌కే మహేశ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ‘అర్జున్’ రిలీజై పైరసీ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు. తీరా లొకేషన్కొచ్చాక త్రివిక్రమ్ వర్కింగ్ స్టయిల్‌కి మహేశ్ ఫిదా అయిపోయాడు. ఇంతకుముందు సినిమాల్లోలాగా భారీ డైలాగుల్లేవు. అన్నీ ‘కట్టె... కొట్టె... తెచ్చె’ టైపు డైలాగులే. ముందుగా రాసుకున్న డైలాగుల్ని కూడా లొకేషన్కొచ్చాక తగ్గించేశాడు త్రివిక్రమ్. టాకీ పార్ట్ చకచకా అయిపోయింది. కానీ, ముందుంది ముసళ్ల పండగ. యాక్షన్ ఎపిసోడ్స్. ముఖ్యంగా క్లైమాక్స్. పద్మాలయాలో పాత చర్చి సెట్ వేశారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్తో హాలీవుడ్ లెవెల్లో క్లైమాక్స్ డిజైన్ చేశాడు త్రివిక్రమ్. కొన్ని మోషన్ కంట్రోల్ షాట్స్ తీయాలి. మోషన్ కంట్రోల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాని డేస్ అవి. మహేశ్ పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లడం, ఆ బుల్లెట్‌తో సమానంగా మహేశ్ పరిగెత్తడం, గ్లాస్ బ్రేక్ అవడం... ఇవన్నీ ఒకే షాట్లో కనబడాలి. ఎగ్జిక్యూషన్కి టైమ్ పట్టేసింది. దీనికి మొగుడి లాంటి షాట్ ఇంకోటుంది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, అంత కష్టపడ్డారు ఈ ఒక్క షాట్‌కి. మహేశ్, సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు. ఈ బిగ్ఫ్రీజ్ షాట్ తీయడానికి వచ్చిన ఫారిన్ కంపెనీవాళ్లు... వాళ్లల్లో వాళ్లకు ఏదో గొడవొచ్చి సడన్‌గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైమ్‌లో ఇలా జరిగింది. పీటర్ హెయిన్ పాపం కిందా మీదా పడి ఓ రిగ్ తయారు చేయించి, దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశాడు. దాంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి. 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో స్లో-మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లు, క్యాన్లు నెగిటివ్ కావాల్సిందే. మామూలు 70 ఎం.ఎం. క్యాన్ అయితే 400 ఫీట్లే ఉంటుంది. అదే 16 ఎం.ఎం. క్యాన్‌లో వెయ్యి ఫీట్ల నెగిటివ్ ఉంటుంది. కానీ 16 ఎం.ఎం. నెగిటివ్‌తో షాట్స్ తీసినా మానిటర్లో చూడలేరు. ఏదో తంటాలుపడి స్టడీకామ్ కెమెరాకు వాడే చిన్న మానిటర్‌ను తెచ్చి, దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది కానీ, మొత్తానికి షాట్ సూపర్‌గా వచ్చింది. మొత్తం క్లైమాక్స్ తీయడానికి 27 రోజులు పట్టింది. డిసెంబర్ 31 రాత్రి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే, వీళ్లు మాత్రం ఉదయం మొదలుపెట్టినవాళ్ళు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకూ షాట్స్ తీస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇంకో షాట్ ఉంది. బహిరంగ సభ వేదికపై ఉన్న శాయాజీ షిండేను దూరంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి మహేశ్ గన్‌తో షూట్ చేసే షాట్. అంత దూరంలో బిల్డింగ్ పైన ఉన్న మహేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి శాయాజీ షిండేను చూసే షాట్ అంటే... అంత దూరాన్ని కవర్ చేసే జూమ్ లేదు. దాంతో ఆలోచించి, ‘స్టిచ్ జూమ్’ ఎఫెక్ట్‌లో తీశారు. ఒక్కొక్క షాట్‌ను తీసుకుంటూ టోటల్‌గా దాన్ని ఒక్క షాట్లాగా స్టిచ్ చేశారు. వెరీ డిఫికల్ట్ షాట్. నెక్ట్స్డే బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ పంచ్ కొట్టే కామెడీ ఎపిసోడ్ తీయాలి. సడన్‌గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయ్యి, హాస్పిటల్లో చేర్చారు. తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. నిద్ర లేదు. అయినా ఇంటికెళ్లి స్నానం చేసి డెరైక్ట్‌గా లొకేషన్‌కెళ్లి, ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు. బాధంతా గుండెల్లో దాచుకుని, ఫుల్ ఫన్‌తో ఆ సీన్స్ తీసేశాడు త్రివిక్రమ్. సీబీఐ డెరైక్టర్ వేషం. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే ఆఫీసర్‌కు ఒక చిన్న హ్యూమన్ యాంగిల్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర. హాఫ్ డే కాల్షీట్ చాలు. కె.విశ్వనాథ్ లాంటి పెద్దాయన చేస్తే గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ అడగ్గానే ఓకే అన్నారాయన. ఎమ్మెస్ నారాయణది అయితే చాలా చిన్న వేషం. అయినా ఆయన కూడా చాలా ఇష్టపడి చేశారు. క్లైమాక్స్‌కి ముందు మహేశ్ - త్రిష మధ్య కాన్వర్జేషన్. ఏవేవో డైలాగ్స్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఆ ముందు సీన్లోనే మహేశ్‌ను ఉద్దేశిస్తూ, నాజర్ చాలా మాట్లాడతాడు. దానికి కొనసాగింపుగా వచ్చే ఇక్కడ కూడా డైలాగులు ఎక్కువైతే బోర్. ఒకటి, రెండు డైలాగ్స్‌తోనే మొత్తం ఎఫెక్ట్ కనబడాలి. త్రివిక్రమ్ బుర్ర షార్ప్‌గా పనిచేసింది. డైలాగ్సన్నీ కొట్టేసి రెండే రెండు డైలాగ్స్ పెట్టారు. మహేశ్‌కి నాజర్ గన్ ఇచ్చి పంపుతుంటే, ‘‘నేనూ వస్తాను’’ అంటుంది త్రిష. దానికి మహేశ్ ఆన్సర్ ‘‘నేనే వస్తాను’’! అంటే, విలన్ని తుద ముట్టించి మళ్లీ నీ దగ్గరకు వస్తానని హీరోయిన్‌కి హీరో చెప్పాడన్నమాట! సినిమా మొత్తం కలిపి మహేశ్‌కు నాలుగైదు పేజీల డైలాగులే ఉంటాయి. రెండు గంటల్లో డబ్బింగ్ చెప్పేశాడు. నాజర్ పాత్రకు ఎస్పీ బాలుతో డబ్బింగ్ చెప్పించాలి. ఆయనైతేనే కరెక్ట్. బాలూ చాలా బిజీ. త్రివిక్రమ్ చెన్నై వెళ్లి కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో దగ్గరుండి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. 174 రోజులు తీశారు సినిమా. ఫైనల్‌గా మణిశర్మ చేతిలోకి వెళ్లింది. మణికి సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తన రీరికార్డింగ్‌తో ఒక్కో రీలులో మేజిక్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఆయన ఆర్.ఆర్.నూ ఓ అద్భుతంలా చూస్తూ కూర్చున్నాడు. మహేశ్ పుట్టినరోజు... ఆగస్టు 9. ఆ తర్వాత రోజే ‘అతడు’ రిలీజ్. (2005 ఆగస్టు 10). సినిమా కొత్తగా అనిపించింది. మహేశ్ కొత్తగా అనిపించాడు. మేకింగ్ కొత్తగా అనిపించింది. డైలాగులూ కొత్తగా అనిపించాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్. క్రైమ్ థ్రిల్లర్‌లా కనిపించే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపించే ఎమోషనల్ స్టోరీ ఇది. ఫ్యామిలీ వాల్యూస్ కనిపించీ కనిపించకుండా... లవ్‌ను చూపించీ చూపించకుండా... త్రివిక్రమ్ చేసిన మేజికల్ యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది. పరిశ్రమ ప్రచారానికి అతీతంగా ప్రేక్షకులు తమ మనసుల్లో పట్టం కట్టారు. ‘ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు, లేదా ప్రేమతో తీస్తాడు. వీడేంట్రా... ఇంత శ్రద్ధగా తీశాడు... ఏదో గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు... చాలా జాగ్రత్తగా... పద్ధతిగా తీశాడు’ అన్నారు. టీవీలో కొన్ని వందల సార్లు ప్రసారమైనా, ఇప్పటికీ ఆ సినిమా, సన్నివేశాలు, డైలాగ్స్‌ను జనం పదే పదే చూసి ఆనందిస్తున్నారు. అందుకే, ఒక్క ముక్కలో - ‘అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ్టికీ ‘అతడు’ అంటే ప్రేక్షకులకు ప్రేమతో కూడిన అభిమానం వల్ల వచ్చిన గౌరవం! - త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ డైలాగ్స్ ⇒ గన్ చూడాలనుకోండి. తప్పులేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు. చచ్చిపోతారు! ⇒ జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది! మరి పులినే వేటాడాలంటే ఎంత ఓపిక కావాలి చెప్పు! ⇒ తాడే కదా అని తేలిగ్గా తీసేయకమ్మా: అది ఇక్కడ కడితే మొలతాడు. ఇక్కడ కడితే ఉరితాడు. ఇక్కడ కడితే కాశీతాడు. మరి అక్కడ కడితే...? పడతాడు! - పులగం చిన్నారాయణ -
బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం!
ఆకాశం కారుస్తున్న కన్నీటితో భాగ్యనగరం అప్పటికే తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావమే కాదు, ఉరుము లేని పిడుగులా ఆదివారం సాయంత్రం అంతకు కొద్ది సేపటి క్రితమే హఠాత్తుగా మీద పడ్డ బాపు అస్తమయ వార్తతో తెలుగు జాతి విషాదంలో మునిగిపోయింది. బాపు - రమణలకు ఆత్మీయుడూ, వారి చివరి మజిలీలో సన్నిహిత సహయాత్రికుడూ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు గుండెలు పిండే బాధ గొంతుకు అడ్డం పడుతోంది. మబ్బులు కమ్మేసిన ఆ సుదీర్ఘ... కాళరాత్రి... త్రివిక్రమ్ తన గుండె గది తలుపులు తెరిచారు. జాతి రత్నాన్ని పోగొట్టుకున్న తీరని బాధలోనూ ఓపిక కూడదీసుకొని, మాట రాని మౌనాన్ని అతి కష్టం మీద ఛేదించారు. కనీసం కలసి ఫోటో తీయించుకోవాలన్న ఆలోచనైనా రానందుకు చింతిస్తూనే, బాపు-రమణల మీద తన భక్తిని మనసు జ్ఞాపకాల చిత్రాలలో నుంచి వెలికి తీశారు. ముగిసిన ఓ శకానికి త్రివిక్రమ్ అర్పించిన అక్షర నివాళి... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఏదైనా అనుకొంటే, వెంటనే చేసేయాలి. అంతేతప్ప ఆలస్యం అస్సలు కూడదు. ఇవాళ కాలం నేర్పిన కొత్త పాఠం ఇది. బాపు గారికి అనారోగ్యంగా ఉందని తెలిసినప్పటి నుంచి స్వయంగా వెళ్ళి కలవాలని అనుకుంటూ వచ్చా. తీరా వెళ్ళి కలవక ముందే ఆయన కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఈ దుర్వార్త తెలియగానే, ఒక్కసారిగా డీలా పడిపోయా. బాపు లాంటి గొప్పవ్యక్తి ఇక లేరు అనగానే నాకు ఏడుపొచ్చేసింది. (గొంతు జీరబోగా...) ఆరు నెలలుగా బాపు గారు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కీమోథెరపీ చేయించుకుంటున్నారు. దాంతో బలహీనపడ్డారు. ఇవాళ ఆయన మరణంతో తెలుగు చలనచిత్ర, చిత్రకళా రంగాలకు సంబంధించి ఒక శకం ముగిసింది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం సహజమని తెలిసినప్పటికీ బాపు - రమణల లాంటి వ్యక్తులు వంద ఏళ్ళు కాదు... నూట పాతికేళ్ళు బతకాలనీ, ఆ చేతి వేళ్ళు ఇంకా రాయాలనీ, మరిన్ని బొమ్మలు గీయాలనీ మన లాంటి అభిమానులం కోరుకుంటాం. ఎందుకంటే, వాళ్ళు మనకిచ్చిన తీపి జ్ఞాపకాలు అలాంటివి. వాళ్ళున్నది మా ఇంటి పైనే! బాపు - రమణలతో నా తొలి పరిచయం వాళ్ళ ‘రాధాగోపాళం’ చిత్రం కన్నా చాలా ముందు నుంచే! అప్పటికి నేను దర్శకుడిగా ‘అతడు’ చిత్ర సన్నాహాల్లో ఉన్నాను. వాళ్ళు ‘శ్రీభాగవతం’ సీరియల్ తీస్తున్నారు. ‘రాధాగోపాళం’ టైమ్‌లో వాళ్ళకు సన్నిహితుడినయ్యా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో హైదరాబాద్‌లో మా అపార్ట్‌మెంట్స్‌లోనే నాలుగో అంతస్తులో అద్దె ఇంట్లో బాపు - రమణలు ఉన్నారు. వాళ్ళ షూటింగయ్యాక సాయంత్రాల్లో వారానికి రెండుసార్లయినా కబుర్లాడుకొనేవాళ్ళం. వాళ్ళు ఏదైనా చెబుతుంటే, చెవి ఒగ్గి వినేవాణ్ణి. అలా ఎన్నో సంగతులు తెలుసుకున్నా, నేర్చుకున్నా. అందరూ రమణ గారు బాగా మాట్లాడతారు, బాపు గారు పెద్దగా మాట్లాడరని అంటారు. కానీ, నా విషయంలో అది నిజం కాదు. విచిత్రంగా బాపు గారు, నేను ఎక్కువ మాట్లాడుకొనేవాళ్ళం. ఇప్పుడాలోచిస్తే, అలా కుదరడం చిత్రమనిపిస్తుంటుంది. బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం! నాకూ, ఆయనకూ ఉమ్మడి చర్చనీయాంశం - సినిమా. అలా కూర్చొని ఎన్నేసి గంటలు మాట్లాడుకొనేవాళ్ళమో! ఎక్కువగా అంతర్జాతీయ సినిమా గురించే మా సంభాషణ సాగేది. సినిమాల్లో, సంగీతంలో ఆయన అభిరుచి లోతైనది. ప్రాథమికంగా యూరోపియన్ సినిమా, ఇరానియన్ సినిమా బాగా ఇష్టం. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’, ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ లాంటి చిత్రాలు తీసిన సెర్జియో లియోన్ ఆయనకు బాగా ఇష్టమైన దర్శకుడు. క్లోజప్ షాట్లు, బోల్డ్ క్లోజప్ల విషయంలో అతని ప్రభావం తన మీద ఉందేమో అనేవారు. కానీ, నన్నడిగితే ఆ దర్శకుడు ఎక్కువగా యాక్షన్‌లో అలాంటివి చేశారు. బాపు గారు ప్రాథమికంగా రొమాన్స్ సన్నివేశాల్లో ఆ పద్ధతి వాడారు. అదీ చాలా కళాత్మకంగా ఉంటుంది. మూకీ చిత్ర యుగానికి చెందిన అమెరికన్ నటుడు జార్జ్ కూపర్ సినిమాలంటే ఆయనకు తెగ ఇష్టం. అలాగే, పాశ్చాత్య సంగీతజ్ఞుడు ఎనియో మొరికోన్ చేసిన నేపథ్య సంగీతం గురించి, ఆయన చేసిన ఆల్బమ్స్ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. ‘అవి వినండి. ఆ సంగీతంలో మీకు ఎన్నో కథలు దొరుకుతాయి’ అనేవారు. ఎందరో ఫిల్మ్ మేకర్లు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్ల పేర్లు ఆయన నోట్లో నానుతుండేవి. డెరైక్షన్‌కు సంబంధించిన రచనలు, గొప్ప సినిమాల స్క్రీన్‌ప్లేలు - ఇలా బాపు గారు నాకు చాలా పుస్తకాలిచ్చారు. చిన్న చిన్న కాగితాల మీద నోట్స్ లాంటి ఉత్తరాలు రాసేవారు. పచ్చళ్ళు పంపేవారు. అటు ఆయన... ఇటు మేము... ఏడ్చేశాం! ‘శ్రీరామరాజ్యం’ చిత్రం విడుదల తరువాత అంత గొప్ప చిత్రం చూసి, ఉండబట్టలేక రాత్రి 12 గంటల వేళ ఫోన్ చేశాను. నిర్మాత సాయిబాబు గారు తీసి, బాపు గారికి ఫోన్ అందించారు. సినిమాలో ఏవేం బాగా నచ్చాయో చెబుతూ, నేను, నా శ్రీమతి ఇటుపక్క ఫోన్లో నిజంగా ఏడ్చేశాం. అటుపక్కన బాపు గారూ ఫోన్లోనే ఏడ్చేశారు. ‘నాదేమీ లేదు. అంతా ఆ రాముడు, ఆ వెంకట్రావ్ (ముళ్ళపూడి వెంకట రమణ గారి అసలు పేరు. ఆయనను వెంకట్రావ్ అనే బాపు పిలిచేవారు)ల దయ’ అని పదే పదే తలుచుకున్నారు. రమణతో ఆయన స్నేహం అది. ఆయనకున్న గొప్ప సంస్కారం అది. నా గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. అది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ‘శ్రీరామరాజ్యం’ తప్పకుండా చూడమని హీరో పవన్ కల్యాణ్‌కు చెప్పాను. ఒకరోజు రాత్రి 11 నుంచి ఒకటిన్నర దాకా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన చూశారు కల్యాణ్. చూసి, చలించిపోయి, నాతో అరగంట మాట్లాడారు. ఆ వెంటనే రాత్రి 2 గంటలకు ప్రెస్ కెమేరాల ముందుకొచ్చి తన అనుభూతిని పంచుకున్నారు. ఆయనది అంతర్జాతీయ స్థాయి దర్శకుడిగా తొలి సినిమాగా ‘సాక్షి’ లాంటి ఆఫ్-బీట్ సినిమాను ఎవరైనా తీస్తారా? ఆ రోజు నుంచి చివరి దాకా బాపు - రమణలు వెండితెరపై చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఏయన్నార్ ఉచ్చస్థితిలో ఉండగా ఆయన పాత్రకు హీరోయిన్ లేకుండా, భార్య పోయి, బిడ్డ ఉన్న పూజారి పాత్రను ‘బుద్ధిమంతుడు’లో చేయించడం మరో సాహసం. ఆ చిత్రంలో గొప్ప ఫిలాసఫీ ఉంది. చివరలో భిన్నమైన ఆలోచనాధోరణులున్న హీరో పాత్రలు రెండూ నెగ్గినట్లు కన్విన్సింగ్‌గా చెప్పడానికి ధైర్యం కావాలి. సినిమాలన్నీ సాదాసీదాగా, ఒకే పద్ధతిలో లీనియర్‌గా ఉండే రోజుల్లో, అలా అనేక కోణాలున్న సినిమాను, పైకి కనిపించేదే కాకుండా, లోలోపల ఎన్నో భావాలు పొదిగిన సినిమాలు చేయడం కష్టం. ఆ సాహసం ఆయన చేశారు. అలాగే, పూర్తి కామెడీ సినిమాలు లేని ఆ రోజుల్లోనే ‘బంగారు పిచిక’ తీశారు. ఆయన సాహసించిన నలభై ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ ట్రెండ్ చిత్రాలు జోరందుకున్నాయి. ‘ముత్యాల ముగ్గు’ చూస్తే, అప్పటి దాకా వచ్చిన తెలుగు చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆఫ్-బీట్‌గా నేపథ్య సంగీతం ఉంటుంది. భార్యాభర్తలిద్దరి దాంపత్య ఘట్టాన్ని కేవలం మాండలిన్ బిట్‌తో నడిపితే, వారిద్దరూ విడిపోయే సీన్‌ను రీరికార్డింగ్ లేకుండా చేశారు. బాపు షాట్ కంపోజిషన్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం - అన్నీ అంతర్జాతీయ స్థాయివే. నా దృష్టిలో ఆయన తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్. అంతర్జాతీయ సినిమాలు చూసిన వ్యక్తిగా ఇది ఘంటాపథంగా చెబుతున్నా. ఒక్క మాటలో రేపటి సినిమాను... నిన్ననే ఆలోచించి... ఇవాళే తీసేసిన... దిగ్దర్శకుడు బాపు గారు. కాలాని కన్నా ముందస్తు ఆలోచనలున్న క్రియేటర్. ఇప్పటికీ నాకు ఎప్పుడు మనసు బాగా లేకపోయినా, బాపుగారి ‘బుద్ధిమంతుడు’, ‘అందాల రాముడు’ చూస్తా. తక్షణమే పాజిటివ్ ఎనర్జీనిచ్చే చిత్రాలవి. ఇక, ‘మన ఊరి పాండవులు’లో బాలూ మహేంద్ర, బాపుల విజువల్ జీనియస్ చూడవచ్చు. అభిరుచి గల మంచి సినిమాకూ, కమర్షియల్ హిట్టయ్యే సినిమాకూ మధ్య బంధం వేసి, ఆ రెంటినీ కలగలిపిన అద్భుతమైన వ్యక్తులు బాపు-రమణ. వాళ్ళకు తెలిసిందల్లా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ పోవడమే. హిట్టయితే ఆ డబ్బులు సినిమాలోనే పెట్టారు. ఫ్లాపైతే, ఆ అప్పులు తీర్చడానికి మరో సినిమా తీశారు. వాళ్ళు సంపాదించిన దాని కన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. చిరస్మరణీయమైన సినిమాలు మిగిల్చారు. చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ, దానినే దైవంగా చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఆయనలా పని చేస్తేనా... నన్నడిగితే బాపు చాలా గొప్ప థింకర్ కూడా! ఆయన భావవ్యక్తీకరణలో, గీసిన బొమ్మలో, తీసిన సినిమాలో అది స్పష్టంగా తెలుస్తుంటుంది. ఆయన తన శక్తిని మాటలతో వృథా చేసేవారు కాదు. చేస్తున్న పనిలోనే దాన్ని క్రమబద్ధీకరించి, వినియోగించేవారు. అలాగే, ఒక వ్యక్తిగా, కళాకారుడిగా బాపు గారు ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఆయన చేసినంత కఠోర పరిశ్రమ ఎవరూ చేయలేరు. లేకపోతే, పుస్తకాల ముఖచిత్రాలు, కార్టూన్లు, కథలకు బొమ్మలు, క్యారికేచర్లు - ఇలా ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఏకంగా ఒకటిన్నర లక్షల పైగా బొమ్మలు వేయడం సాధ్యమా చెప్పండి. ఇంకా యాడ్ ఏజెన్సీల్లో క్రియేటివ్ హెడ్‌గా వేసినవి, స్క్రిప్టు స్టోరీబోర్డుకు వేసుకున్న బొమ్మల లాంటివి లెక్కలోకి తీసుకోకుండానే అన్ని బొమ్మలయ్యాయంటే ఆశ్చర్యం. బొమ్మలేయడాన్ని పనిగా అనుకోలేదు. ఎవరో రాసిన నవలకు ముఖచిత్రం వేయడం కూడా ఆ వంకతో తాను ఆ కథ చదవవచ్చనే! అది చదివి, దాని మీద తన అభిప్రాయాన్నీ, సమీక్షనూ మాటలతో కాదు, బొమ్మతో చెప్పేసేవారు. అది ఆయన గొప్పతనం. బాపు గారు అసలు సిసలు కళాకారుడు. ఎంతో జీనియస్. లుంగీ కట్టుకొని, లాల్చీ వేసుకొని, ప్యాడ్, కుంచెలు పెట్టుకొని, కింద కూర్చొని, ఎదురుగా డీవీడీ ప్లేయర్లో సినిమా పెట్టుకొనో, పక్కనే సంగీతం వింటూనో బొమ్మలు వేసుకొనేవారు. చేయి నొప్పి పుడితే, కాసేపు ఆపి, సినిమా చూసేవారు. సినిమా బోర్ కొడితే, అది పాజ్ చేసి, బొమ్మలు వేసుకొనేవారు. ఇలా రోజూ 16 గంటలకు పైగా పనిచేయడం, పడుకోవడం! మళ్ళీ పొద్దున్నే లేవగానే అదే పని! ఎవరికో ఏదో నిరూపించడానికి కాక, మనస్ఫూర్తిగా పనిని అంతగా ఆస్వాదిస్తూ, ఆనందంగా చేస్తే శ్రమే తెలియదు. ఆయనలో కనీసం పది శాతమైనా మనం పని చేస్తే చాలు... ఎంచుకున్న రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. పక్కా తెలుగువాడు జీవితమంతా మద్రాసులో గడిపిన బాపుగారు పక్కా తెలుగువాడు. ఆయన కట్టుబొట్టు, ఆహారవ్యవహారాలు, ఇష్ట పడే రుచులు, మాట్లాడే మాట, రాసే రాత, గీసే గీత - అన్నీ తెలుగు వాతావరణానికి ప్రతిబింబాలే. ప్రపంచం మొత్తం తిరిగినా, పల్లెటూరు తెలుగువాడు ఎలా ఉంటాడో అలాగే, సింపుల్‌గా బతికారు. స్టీలు గ్లాసులో కాఫీ తాగడం నుంచి కింద కూర్చొని పని చేసుకోవడం దాకా - తాను ఏ వాతావరణం నుంచి వచ్చాడో ఆ వాతావరణాన్ని వదిలిపెట్టలేదు. అదే ఆయన సృజనలో ప్రతిఫలించింది. ఒక్క ముక్కలో - ఆయన నేల మీదే నిల్చొని, గాలిపటం ఎగరేశారు. దాన్ని ప్రపంచం మొత్తం చూపించారు. అదీ ఆయన ప్రత్యేకత. అరుదైన వ్యక్తులు, వ్యక్తిత్వాలు వ్యక్తులుగా కూడా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. అలాంటి వ్యక్తులు సినీ రంగంలో అరుదు. ఎదుటివారి వల్ల వాళ్ళు మోసపోయారే తప్ప, వాళ్ళు ఎవరినీ మోసం చేయలేదు. ప్రతిభతో పాటు అరుదైన వ్యక్తిత్వం వారి సొంతం. ఆ రెండింటి సమ్మేళనం కాబట్టే, జయాపజయాలను పట్టించుకోకుండా, నమ్మిన విలువలకే జీవితాంతం కట్టుబడగలిగారు. చివరి వరకు ఆ స్థాయిని కొనసాగించారు. ఇవాళ సినీ, సాహిత్య, కళా రంగాలతో పాటు సామాన్య తెలుగు సమాజంలోనూ వారికి ఇంత గౌరవ ప్రతిష్ఠలు దక్కడానికి కారణం అదే! స్నేహమంటే బాపు - రమణలంటారు. ‘ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఇద్దరు మనుషులు 66 ఏళ్ళ పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు, కలసికట్టుగా తమ రంగంలో కృషి చేశార’ని చెబితే చాలు... ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర లేదు. ఒకసారి నేను ఉండబట్టలేక, ‘మీరిద్దరి మధ్య ఎప్పుడూ అభిప్రాయ భేదాలు రాలేదా’ అని అడిగేశా. ‘ఎందుకు రావు! కథా చర్చల్లోనో, మరొకచోటో ఏదో అభిప్రాయ భేదం వస్తుంది. వాదించుకుంటాం. మళ్ళీ మామూలైపోతాం’ అన్నారు. వాళ్ళెప్పుడూ తమ జీవితాన్ని సంక్లిష్టం చేసుకోలేదు. సాదాసీదాగా గడిపేశారు. వాళ్ళలా సింపుల్‌గా బతకడం మనకేమో కాంప్లికేటెడ్ అయిపోతోంది! అలా బతకడం అంత సులభం కాదు! బాపు - రమణల స్నేహం, సాన్నిహిత్యం ఎంతంటే, రమణ గారు పోయాక బతకడం ఇష్టలేక బాపుగారు వెళ్ళిపోయారని నాకు అనిపిస్తోంది. బాపు గారు గుర్తొచ్చినప్పుడల్లా ఆయనలా హార్డ్‌వర్క్ చేయాలని స్ఫూర్తి కలుగుతుంటుంది. ఇక, రమణ గారి పేరు చెప్పగానే ఆయనంత గొప్పగా రాయాలనుకుంటా. ఎవరెస్ట్ అంటే ఎవరైనా ఎక్కాలనే అనుకుంటారు కదా! నేనూ అంతే! వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు, ఉపన్యాసాలివ్వలేదు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళలాగా భేషజం లేకుండా మామూలు వాళ్ళలా బతకడం అంత సులభం కాదు. అయినా సరే, అలా ఉండేందుకు ప్రయత్నించడం, వాళ్ళ సినిమాలు చూసి ఆనందించడమే మనమిచ్చే ఘనమైన నివాళి. అంత గొప్పవాళ్ళ జీవితంలోని చివరి రోజుల్లో కొన్ని క్షణాలైనా వారితో కలసి గడపడం నా జీవితకాలపు అదృష్టం. ఆ అదృష్టం మరింత కాలం కొనసాగకుండా, అంతలోనే ఆ మహానుభావులు భౌతికంగా దూరమైనందుకు ఇవాళ ఆగకుండా ఏడుపొచ్చేస్తోంది. ఇంతకాలం జాతి మొత్తాన్నీ నవ్వించిన బాపు గారూ! రమణ గారూ! మీకిది న్యాయమా సార్? - సంభాషణ: రెంటాల జయదేవ బాపు మార్కు సెటైర్లు ఆహార విహారాల్లో కూడా బాపు -రమణలది మంచి అభిరుచి. ఏదైనా మితంగా, హితంగా ఉండేది. బాపు గారు చాలా తక్కువ తినేవారు. కాకపోతే, వాటిల్లోకి పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉండాలి. అంత చక్కటి రాయల్ టేస్ట్. బాపు గారిలో హాస్యప్రియత్వానికి ఎన్నో ఉదాహరణలు. నటుడు బ్రహ్మానందం గారి బలవంతంతో వాళ్ళింటికి బాపు గారు ఒకసారి భోజనానికి వెళ్ళారు. ఆయనకు స్వయంగా వడ్డించాలని బ్రహ్మానందం గారి కోరిక. బాపు గారు సరేనన్నారు. ఆయన తింటుంటే, ‘ఇంకొంచెం తినండి’ అంటూ మరింత వడ్డించబోయారు బ్రహ్మానందం. ‘బాగుందని చెప్పాలంటే, ఇంకొంచెం తినాలాండీ!’ అని బాపు వ్యాఖ్యానించారు. ఒకటే నవ్వు. కొత్తల్లో ఒకసారి నేను ‘అతడు’ కథ చెబుతుంటే, రెండు మూడు సీన్లు విన్నాక ఆయన, ‘శ్రీనివాస్ గారూ! షాట్లు చెప్పకండి. కథ చెప్పండి’ అన్నారు. ‘నా బలహీనతను క్షమించి, భరించండి’ అని నేను సిగ్గుపడుతూ అన్నాను. ఇలా మా మధ్య చతురోక్తులు చాలా నడిచేవి. అది ప్రభుత్వం ఆయన మీద వేసిన అతి పెద్ద కార్టూన్! బతికుండగా ఎవరినీ గౌరవించాల్సినంతగా గౌరవించకపోవడమనేది ప్రాథమికంగా మన తెలుగువాళ్ళకున్న దౌర్భాగ్యం. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే ‘సీతా కల్యాణం’లో గంగావతరణ ఘట్టం కోసం ఒకే నెగటివ్ మీద ఏకంగా 27 ఎక్స్పోజర్లు చేసిన తెలివైన టెక్నీషియన్ బాపు. చుక్క నీళ్ళు లేకుండా కేవలం చాక్‌పీస్ పొడితో, గంగానది ఉత్తుంగ తరంగంలా కిందకు దూకుతున్న అనుభూతి తెరపై కల్పించిన జీనియస్. తెలుగు భాషకు తన రాతతో ఒక ప్రత్యేకమైన ఫాంట్ అందించారు. ఆడపిల్ల అంటే, బాపు బొమ్మలా అందంగా ఉండాలన్న నిర్వచనానికి కారణమయ్యారు. ఇవాళ ‘ప్రీ-విజ్’ అని అందరూ చెబుతున్న స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్‌ను ఉత్తరాదిన సత్యజిత్ రే, దక్షిణాదిన బాపు ఏనాడో చేశారు. పిల్లల కోసం బాపు-రమణలు ఉచితంగా వీడియో పాఠాలు తీసి ఇచ్చారు. పత్రికల్లో, ప్రకటన రంగంలో, పుస్తక ప్రచురణ రంగంలో, సినిమాల్లో - ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక, వ్యక్తిగతంగానూ ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అలాంటి వాళ్ళను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే, ఇంకేం చేస్తే గుర్తిస్తారో? భారతీయ సినిమాకూ, ప్రపంచ సినిమాకూ, తెలుగు చిత్రకళా రంగానికీ ఇంత సేవ చేసిన వారికి కనీసం ‘పద్మవిభూషణ్’ అన్నా ఇవ్వాలి కదా! కానీ, ఇన్నేళ్ళ తరువాత, రమణ గారు కూడా గతించాక, గత ఏడాది బాపు గారికి ఉత్తి ‘పద్మశ్రీ’ ఇచ్చారు. నా దృష్టిలో బాపు గారిపై ప్రభుత్వం వాళ్ళు చేసిన అతి పెద్ద కార్టూన్ అది!