
అచ్చు అతడు చిత్రంలో సన్నివేశం తరహాలోనే ఓ సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.
సాక్షి, హైదరాబాద్ : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 2005లో వచ్చిన అతడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటీకీ చూసినప్పుడల్లా తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే అచ్చు అతడు చిత్రంలో సన్నివేశం తరహాలోనే ఓ సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. అతడు చిత్రంలో విలన్ తనికెళ్ల భరణి, కొడుకు బ్రహ్మజీతో .. మర్డర్ చేయాలంటే కత్తులుండాలి కానీ, క్వాలీసులు, సుమోలు ఎందుకురా భుజ్జీ.. అన్ని బండ్లు వద్దురా పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా.. అందరూ కలిసి ఒకే బండిలో వెళ్లండిరా.. మీరెంత సైలెంట్‌గా ఉంటే మర్డర్ అంత వైలెంట్‌గా ఉంటది.. అంటూ చెబుతాడు ... తర్వాత సీన్‌లో అందరు రౌడీలు కలిసి ఇరుక్కుని మరీ ఒకే సుమోలో కూర్చోని వస్తారు.. సీరియస్ సిచ్చువేషన్‌లోనూ కామెడీ పూయించే ఆ సన్నివేశం అందరికీ గుర్తుండిపోతుంది.
తెగ నవ్వు తెప్పించే అలాంటి సన్నివేశమే కరీంగర్‌లోని తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత పోలీసులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి లెక్కించారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతపై బాధ్యత వహించాలని దీనికి సంబంధించి వీడియోను కరీంనగర్ సీపీ కమాలాసన్ రెడ్డి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.