సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో సంచలనం సృష్టించిన గడ్డి కుమార్ హత్య మిస్టరీ వీడింది. ఎవరూ ఊహించనిస్థితిలో సమీప బంధువు అయిన అతడి స్నేహితుడే కుమార్‌ను గొంతునులిమి హత్య చేశాడు. విషయం ఎవరికీ తెలియకుండా పరువుహత్యగా చిత్రీకరించాడు. మృతుడి కుటుంబసభ్యుల వెన్నంటే ఉండి పోలీసుస్టేషన్ వెంట తిరిగాడు. తొమ్మిది రోజులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు సీసీఫుటేజీ, ఫోన్‌డాటా ఆధారంగా నిందితుడు తాడికల్‌కు చెందిన ఊరడి వెంకటేశ్‌గా తేల్చారు. బుధవారం అతడిని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకురాగా... కుమార్‌ను ఎలా చంపాడో సీపీ కమలాసన్‌రెడ్డి, పోలీసులకు వి వరించాడు. ఇది పరువు హత్య కాదని, తాగిన మైకంలో వెంకటేశే.. కుమార్‌ను గొంతునులిమి హత్య చేశాడని సీపీ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇదీ జరిగింది...
తాడికల్‌కు చెందిన గడ్డికుమార్ హుజూరాబాద్‌లోని ఓ సెల్‌పాయింట్‌లో పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఈనెల 6న నిజామాబాద్ వెళ్లి వచ్చారు. మరుసటి రోజు నుంచి కుమార్ కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. శంకరపట్నం పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న తాడికల్ శివారులోని పత్తిచేనులో శవమై తేలాడు. సదరు బాలిక బంధువులే హత్య చేశారని కుమార్ కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎస్సైపై దాడికి యత్నించారు. పోలీసు జీపు ధ్వసం చేశారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు..
కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సీపీ కమలాసన్‌రెడ్డి విచారణకు టాస్క్‌పోర్స్ ఏసీపీ శోభన్‌కుమార్ నే తృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐ కి రణ్, సైబర్‌ఇన్వెస్టిగేషన్ ఎస్సై మరళి, హుజురా బాద్ రూరల్ సీఐ రవికుమార్ కేసును తొమ్మిదిరోజుల పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. బా లి క కుటుంబ సభ్యులను, కుమార్ కుటుంబసభ్యులను, స్నేహితులను, ఆటో డ్రైవర్‌ను పలు కో ణా ల్లో విచారించారు. 128మంది కాల్‌డేటాలను పరిశీలించారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. (కరీంనగర్ జిల్లాలో పరువు హత్య?)
పట్టించిన సీపీ ఫుటేజీ...
కేశవపట్నంలోని మద్యం దుకాణంలో సీసీ ఫుటేజీని పరిశీలించగా.. కుమార్‌తో పాటు అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన వూరడి వెంకటేశ్ కలిసి మద్యం తీసుకుని బైక్‌పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. ఆ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే విధంగా కాల్‌డాటా పరిశీలించగా.. కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యేంతవరకు ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన పద్ధతిలో పలుమార్లు విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
మద్యంమత్తులోనే హత్య..
నిందితుడిని బుధవారం ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్కడే విచారించారు. కుమార్‌ను ఎలా చంపాడో వెంకటేశ్ అక్కడ వెల్లడించాడు. ‘ఇద్దరం మద్యం తీసుకుని తాడికల్ సమీపంలోని పత్తిచేలకు వెళ్లాం. తాగుతుండగా.. కుమార్ ప్రేమికురాలి నుంచి ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యులు తనను కొడుతున్నారని, పెళ్లి చేసుకుందామని అమ్మాయి ఒత్తిడి తేవడంతో కుమార్ అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో అమ్మాయితో మాట్లాడే పద్దతా అని గట్టిగా వారించా. కానీ నాతో దుర్బాషలాడాడు. ఆ తరువాత మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. మాటమాట పెరిగి... కుమార్‌ను గొంతునులిమాను. అక్కడి నుంచి వెళ్లి మరోసారి మద్యం తీసుకుని వచ్చే సరికి కుమార్ చనిపోయి ఉన్నాడు’ అని నిందితుడు వెంకటేశ్ పోలీసులకు వెల్లడించారు.
పరువు హత్యకాదు..
అనంతరం సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. కుమార్‌ది పరువుహత్య కాదని, తాను ప్రేమించిన బాలిక కుటుంబసభ్యులకు, హత్యకు ఎలాంటి సబంధం లేదని, వెంకటేశ్ తాగిన మైకంలో కుమార్‌ను గొంతునులిమి చంపాడని సీపీ వెల్లడించారు. అయితే ఈ కేసును మరింత విచారిస్తామని, ఇంకెవరైనా నిందితులు ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. హత్య జరిగిన రోజున ఎస్సైపై దాడికి దిగి, పోలీసు జీపును ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసులను సీపీ ఈ సందర్భంగా అభినందించారు. (హైదరాబాద్‌లో మరో మారుతీరావు)
Comments
Please login to add a commentAdd a comment