అంత కలర్ కూడా కాదు కదా...!
అక్కకి పెళ్లి చూపులు... ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేయాల్సిన చెల్లెలు గదిలో దాక్కుంటుంది. అంత కర్మేంటి? అంటే.. ‘అందం’గా ఉన్నందుకే. ‘అక్క కన్నా అందంగా ఉన్నావు కాబట్టి, వచ్చే అబ్బాయి నిన్ను చేసుకుంటాననే ప్రమాదం ఉంది. అందుకే దాక్కో’ అంటారు ఆ అమ్మాయి అమ్మానాన్న. ఏంటీ.. ‘అతడు’ సినిమాలో సీన్ గుర్తొస్తోంది కదూ. యస్... చెబుతున్నది దాని గురించే. అదే సీన్‌లో త్రిషను ఉద్దేశించి మహేశ్‌బాబు, ‘‘వాళ్లందరూ చెప్పడం వల్ల నీకలా అనిపిస్తుంది కానీ, నిజానికి నువ్వు అంత బాగుండవ’’నే టైప్‌లో ఆటపట్టిస్తాడు. ఆ సందర్భంలో గమ్మత్తై డైలాగులతో మహేశ్ తెగ ఆటపట్టిస్తున్నప్పుడు ఉక్రోషంగా త్రిష ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేం.
త్రిష ఎంత మంచి నటో చెప్పడానికి ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అంత మంచి నటి కాబట్టే, పధ్నాలుగేళ్లయినా నటిగా ఆమె ‘స్టేల్’ కాలేదు. నిజానికి ఓ రెండు, మూడేళ్ల క్రితం త్రిష కెరీర్ కొంచెం పడిపోతున్నట్లు అనిపించింది. యువ కథా నాయికలు చాలామంది వచ్చేశారు కాబట్టి, పధ్నాలుగేళ్లుగా చేస్తున్న త్రిష ఇక సర్దుకోవాల్సిందే అని కొంతమంది అనుకున్నారు కూడా. కానీ, అలా జరగలేదు. జస్ట్ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో కానీ, కెరీర్ డౌన్‌ఫాల్ మాత్రం కాలేదు. పైగా గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాలు చేసి, ఆశ్చర్యపరిచారు.
ఇన్నేళ్లయినా త్రిష ఇంకా ఫామ్‌లో ఉండగలగడానికి కారణం ఏంటి? అంటే.. ‘మంచి నటి కాబట్టి’ అనొచ్చు. నటన ఒక్కటే ఉంటే సరిపోదు. మీద పడుతున్న వయసును కనబడనివ్వక పోవడం పెద్ద ప్లస్. ఇటీవల విడుదలైన ‘కళావతి’లో బీచ్ సాంగ్ చూసినవాళ్లు త్రిషకు థర్టీ ఇయర్స్ అంటే నమ్మరు. ఫిజిక్ అంత బాగుంటుంది.
తమిళ చిత్రం ‘మౌనమ్ పేసియదే’, తెలుగు చిత్రం ‘నీ మనసు నాకు తెలుసు’ ద్వారా పరిచయమైనప్పుడు త్రిష ఎంత సన్నగా ఉండేవారో ఇప్పటికీ దాదాపు అలానే ఉన్నారు. చెప్పాలంటే మరింత మెరుపుతో సినిమా సినిమాకీ ఇంకా ఆకర్షణీయంగా కనపడుతున్నారే తప్ప, వయసు ప్రభావం కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా త్రిష చేతిలో తక్కువ సినిమాలేం లేవు. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘నాయకి’తో పాటు ధనుష్ సరసన ‘కొడి’ చేస్తున్నారు. ఇంకా, యువహీరో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా అంగీకరించారు. మొత్తం మీద బిజీ బిజీగానే ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమాల పరంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసేశారు. విజయవంతంగా సెంచరీవైపు అడుగులు వేస్తున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే... ‘అతడు’ సినిమాలో మహేశ్ ఆటపట్టిస్తూ, ‘కళ్లు కూడా అంత పెద్దవి కావు... ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది.. అంత కలర్ కూడా కాదు కదా’ అనే డైలాగ్ త్రిషకు సరిగ్గా సరిపోతుంది. నిజమే. ఆమె అంత కలర్ కాదు. కళ్లు కూడా సోసోగా ఉంటాయి. ముక్కు తీరూ అంతే. మరి.. ఎందుకు త్రిష హవా తగ్గడం లేదు? అనడిగితే.. ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లోని ‘ఏండే.. ఓ పాట పాడండే..’ డైలాగ్‌లా, ‘ఏండే.. ఇక్కడ త్రిష అండే... కత్తి లాంటి బాడీ, నటనలో వాడి అలానే ఉన్నయండే’ అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఈ చెన్నై చందమామకు తిరుగు లేదంటే అతిశయోక్తి కాదు.