వదల బొమ్మాళీ... వదల | Arundhati Movie Behind Story | Sakshi
Sakshi News home page

వదల బొమ్మాళీ... వదల

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

వదల బొమ్మాళీ... వదల

వదల బొమ్మాళీ... వదల

అరుంధతి : సినిమా వెనుక స్టోరీ - 11
అయిదేళ్ల కష్టం ‘అంజి’ సినిమా. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి. కానీ దెబ్బకొట్టింది. ఆ బాధను మర్చిపోవడం కోసం పైరసీ కంట్రోల్ ప్రోగ్రామ్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారాయన. అయినా మనిషిలో ఏదో లోటు. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ కనబడే మనిషి అలా డీలాపడిపోయేసరికి కంగారుపడిపోయారు శ్యామ్ భార్య. మనుషులతో కలిస్తే కొంచెం తేరుకుంటారనిపించింది. దాంతో ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే బంధువులతో, ఫ్రెండ్స్‌తో డిన్నర్ పార్టీలు అరేంజ్ చేయడం మొదలు పెట్టారు.

ఆ వీక్ శ్యామ్ మేనత్త ఒకావిడ వచ్చారు. గద్వాల్ సంస్థా నానికి చెందిన ఆమె గద్వాల్ కోటకు సంబంధించి నాన్‌స్టాప్‌గా ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ఇవన్నీ చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నారు శ్యామ్. తెలిసిన విష యాలే అయినా మళ్లీ వినాలనిపిస్తోంది.
 
ఆ డిస్కషన్‌లోనే శ్యామ్ తాతగారు ఎప్పుడో చెప్పిన ఓ ఇన్సిడెంట్ ప్రస్తావన కొచ్చింది. శ్యామ్ తాతగారు వెంకటగిరి సంస్థానం అధీనంలోని ఓ గ్రామ పెద్ద. చాలా తరాల క్రితం అక్కడ ఓ సంఘటన జరిగిందట. రాజావారి కూతురు పనివాణ్ణి ఇష్టపడింది. ఓ రోజు రాజావారు పనిమీద బయటకు వెళ్ళి, ఎందుకో వెనక్కు తిరి గొచ్చారు. అప్పుడు గదిలో రాకుమారి, పనివాడు మాత్రమే ఉన్నారు. రాజావారికి అర్థమైపోయింది. ఆయన సేవకులందరినీ పిలిచి గదినే సమాధిలా చేసేయమన్నారు. లోపల ఉన్నవారికి విషయం తెలిసినా బయటకు రాలేని పరిస్థితి. ఆ గదిని క్లోజ్ చేసేశాక రాజా వారు ఆ కోట మొత్తం ఖాళీ చేసేసి ఊరి చివరి బిల్డింగ్‌కి షిఫ్ట్ అయి పోయారు. వారం రోజుల పాటు ఆ కోటలో నుంచి అరుపులు వినిపించేవని ఊళ్లోవాళ్లు చెప్పేవారట.
 ఈ ఎపిసోడ్ శ్యామ్‌ను కదిలించేసింది. నిద్రపట్టలేదు. అవే ఆలోచనలు. గద్వాల్ కోట... వెంకటగిరి సంస్థానం... రాకుమారి, పనివాడు... గదిలో సమాధి...
    
‘అంజి’కి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్. శ్యామ్‌లో హుషారు. తమ ప్రయత్నానికి ఓ గొప్ప రికగ్నిషన్. ప్రెసి డెంట్ నుంచి అవార్డు తీసుకున్నాక, ఆ రాత్రి తన టీమ్‌కు పార్టీ ఇచ్చారు శ్యామ్. ఆ పార్టీ తన జీవితాన్ని మలుపు తిప్పు తుందని శ్యామ్‌కు కూడా తెలీదు. అందరూ జాలీ మూడ్‌లో ఉన్నారు. మార్నింగ్ ఫంక్షన్‌లో ‘అంజి’ గ్రాఫిక్స్ గురించి అందరూ ప్రశంసించిన విషయం గుర్తొచ్చింది శ్యామ్‌కి. ‘‘మళ్లీ గ్రాఫిక్స్‌తో ఓ వండర్ చేద్దామా?’’ అన్నారు శ్యామ్ తన టీమ్‌తో. అందరూ ‘‘ఓకే... ఓకే’’ అంటూ హుషారుపరిచారు. ఆ రాత్రి శ్యామ్‌కు మళ్లీ నిద్ర రాలేదు. వెంటనే సినిమా తీయాలి.
    
శ్యామ్ ఆధ్వర్యంలో కథ రెడీ అవు తోంది. రకరకాల మెమొరీస్... రకరకాల ఇన్‌స్పిరేషన్స్. ముఖ్యంగా గద్వాల్ కోట నేపథ్యం... వెంకటగిరి సంస్థానంలో ఎన్నో తరాల కింద జరిగిన రాకుమారి సమాధి... వీటన్నింటితో కథ ఓ కొలిక్కి వచ్చింది.
 టైటిల్ ఏం పెట్టాలి? అందరికీ తెలి సిన అమ్మాయి పేరు కావాలి. పెళ్లిళ్లలో అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. అంతకు మించిన పాపులర్ నేమ్ ఏముంటుంది!
 ‘అరుంధతి’... టైటిల్ ఓకే!
    
మంచి హైట్ - రాయల్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలి. ‘అరుంధతి’ అంటే అలానే ఉండాలి. ఎవ్వరూ కనబడడం లేదు. హైట్ ఉంటే లుక్ లేదు. లుక్ ఉంటే ఇంకో డిఫెక్ట్. ఫైనల్‌గా దొరికింది మమతా మోహన్‌దాస్. మలయాళీ అమ్మాయి. ఆఫర్ వెళ్లింది. పాపం మమతకు ఎవరో రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. శ్యామ్‌తో సినిమా అంటే మంత్స్ కాదు... ఇయర్స్ కావాలి. మొత్తం కెరీర్ స్ట్రక్ అయిపో తుంది. మమత ‘నో’ చెప్పేసింది. మళ్లీ సెర్చింగ్ స్టార్ట్. ఈసారి దుర్భిణిలో ‘అనుష్క’ కనబడింది. ‘సూపర్’లో నాగార్జునతో చేసి, ప్రస్తుతం రాజమౌళి డెరైక్షన్‌లో ‘విక్రమార్కుడు’ చేస్తోంది. శ్యామ్ నుంచి కాల్ వెళ్లగానే అనుష్క కంటే రాజమౌళి ఎగ్జైట్ అయిపోయాడు.
 ‘‘శ్యామ్ గ్రేట్ ఫిల్మ్‌మేకర్. ఆయనతో సినిమా చేయడం నీ అదృష్టం’’ అని రాజమౌళి లాంటివాడు పొగుడుతుంటే అనుష్క థ్రిల్లయిపోయింది.
    
‘అరుంధతి’లో కీ-రోల్ పశుపతి. స్క్రిప్టు దశలోనే ఆ పాత్రకు తమిళ నటుడు పశుపతిని ఫిక్సయిపోయారు శ్యామ్. అందుకే ఆ పేరే పెట్టేశారు. కానీ ప్రాక్టి కల్‌గా వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్. అఘోరా గెటప్ వరకూ పశుపతి సూపర్. కానీ, అరుంధతిని మోహించాల్సిన చోట ఆనడం లేదు. ఇంకొకరిని వెతకాల్సిందే. ‘అశోక’ అనే హిందీ సినిమా చూస్తుంటే సోనూసూద్ తళుక్కుమన్నాడు.

అతనప్ప టికే తెలుగులో ‘సూపర్’, ‘అతడు’ లాంటి సినిమాలు చేశాడు. పిలవగానే ఫొటో షూట్‌కొచ్చాడు. అఘోరా మేకప్‌కే నాలుగైదు గంటలు పట్టింది. అవసరమా అనిపించింది సోనూసూద్‌కి. శ్యామ్ స్కెచ్‌లు చూపించి, క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఇదేదో గ్రేట్ జర్నీలా ఉందే అనుకుని, అప్పుడు ఓకే చెప్పాడు.
 ఫకీర్ పాత్రకు నజీరుద్దీన్ షా అయితే సూపర్బ్. నో చాన్స్. నానా పటేకర్. నో డేట్స్. అతుల్ కులకర్ణి. నాట్ అవైలబుల్. దాంతో సాయాజీ షిండేను పిలిచారు. హీ పర్‌ఫెక్ట్లీ సూట్స్ ద రోల్.
    
డెరైక్టర్ సభాపతి. తమిళంలో మంచి సినిమాలు తీశాడు. ‘అంజి’ డెరైక్టర్ ఫస్ట్ అతనే. తర్వాత కోడి రామకృష్ణ వచ్చారు. సభాపతిని పిలిచారే కానీ, శ్యామ్‌లో డౌట్. ‘అరుంధతి’ని హ్యాండిల్ చేయగలడా? అందుకే క్లైమాక్స్‌ను డమ్మీగా వీడియో షూట్ చేసివ్వమన్నారు. సభాపతి అవ లీలగా చేసిచ్చేశాడు. శ్యామ్‌కు నచ్చలేదు. ‘‘టీవీ తారలతో వీడియో కెమెరాతో ఇంత కన్నా బాగా ఎలా వస్తుంది?’’ సభాపతి క్వశ్చన్.

అయితే నిజం తారలతోనే రియల్‌గా చేయమన్నారు శ్యామ్. అయినా నో క్వాలిటీ. సభాపతి చెన్నై ఫ్లయిటెక్కే శాడు. కోడి రామకృష్ణ ఇంటికి కారు వెళ్లింది. శ్యామ్‌కి కోడి రామకృష్ణ ఓ బల హీనతేమో! ఆయన లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు. ఒక్క ‘ఆగ్రహం’ తప్ప ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘అమ్మోరు’, ‘అంజి’... అన్నింటికీ ఆయనే దర్శకుడు. మళ్లీ ఇద్దరూ కలవడంతో ప్రాజెక్ట్ స్పీడందుకుంది.
    
పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మేకింగ్‌కు చాలా కష్టపడాల్సి వచ్చింది. 1920ల నాటి సెట్స్, కాస్ట్యూమ్స్... అన్నీ జాగ్రత్తగా చూస్కోవాలి. పెద్ద ప్యాలెస్ కట్టాలి. 250 అడుగుల ఫ్లోర్ కావాలి. అన్నపూర్ణా స్టూడియోలో రెండు ఫ్లోర్లు తీసుకుని ఆ ప్యాలెస్ సెట్‌ను రెండుగా విభజించి, రెండు ఫ్లోర్లలో చెరో సగం సెట్ వేశారు. 4 నెలలు పట్టింది. ఖర్చు 85 లక్షలు. 15 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ తీశారా సెట్‌లో. 106 రోజులు వర్క్ చేశారు. బనగాన పల్లిలో ఉన్న ఓ పాడుబడ్డ కోటలో ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు.

కోట మొత్తం వార్నిష్ చేయించారు. కడియం నుంచి పాతిక లారీల మొక్కలు తెప్పించి ఓ గార్డెన్ సృష్టించారు. డ్రమ్ డ్యాన్స్ తీయడానికి 45 రోజులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఒకసారైతే అర్ధరాత్రి ఒంటి గంటకు డ్యాన్సు చేస్తూ అనుష్క కళ్లు తిరిగి పడి, స్పృహ కోల్పోయింది. అందరూ టెన్షన్ పడ్డారు. అంత ఇది జరిగినా మార్నింగ్ 7 గంటలకే మేకప్‌తో మళ్ళీ రెడీ. అంతలా లీనమైపోయి పనిచేసింది.
 
క్లైమాక్స్ కోసం 8 కంప్రెషర్లు, 10 ఫ్యాన్లు, వయొలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం లారీల కొద్దీ ఫైన్ డస్ట్... వీటన్నిటి మధ్య కూడా అనుష్క పనిచేసింది. నోట్లోకి, ముక్కులోకి డస్ట్ వెళ్లిపోయినా ప్రొడ్యూసర్‌కి ఒక్కసారీ కంప్లయింట్ చేయలేదు. ఫిజికల్లీ టైరింగ్, మెంటల్లీ చాలెంజింగ్.
 
‘చంద్రముఖి’లో రజనీకాంత్ తరహాలో ఇందులో సోనూసూద్‌కు డిఫరెంట్ మేనరిజమ్ పెడదామనుకున్నారు. కానీ సోనూసూద్ బాడీ లాంగ్వేజ్ వెరీ నార్మల్. మరెలా? ఏదైనా పాట పెడితే? కనెక్ట్ అవు తుందనే గ్యారెంటీ లేదు. ఏదైనా డైలాగ్ పెడదామని కన్ క్లూజన్‌కి వచ్చారు. ఈ బాధ్యత డైలాగ్ రైటర్ చింతపల్లి రమణకు అప్పగించారు. రమణ కిందా మీదా పడి ఎనిమిది పంచ్ డైలాగులు రెడీ చేశాడు. వాటిలోంచి కోడి రామకృష్ణ ఒకటి సెలక్ట్ చేశారు. అదే ‘బొమ్మాళి’.
 
ఈ ప్రాజెక్ట్‌కి మెయిన్ పిల్లర్ రాహుల్ నంబియార్. ‘అంజి’కి స్పెషల్ ఎఫెక్ట్స్ చేశాడు. శ్యామ్‌కి ఈ మలయాళీ కుర్రాడి మీద విపరీతమైన గురి. ‘అరుంధతి’ స్టోరీ సిట్టింగ్స్ దగ్గర్నుంచీ రాహుల్ పార్టిసిపేట్ చేశాడు. విలన్ మేకప్, సెట్స్ తాలూకు స్కెచెస్ ముందే రెడీ చేసేసుకున్నాడు. షూటింగ్ టైమ్‌లో డెరైక్టర్‌తో పాటే ఉన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌లో ఆర్టిస్టుల కదలికలు, కెమెరా యాంగిల్స్... ఇదంతా రాహుల్ రెస్పాన్స్‌బిలిటీనే. అందుకే రాహుల్‌కి క్రియేటివ్ డెరైక్టర్ పోస్ట్ ఇచ్చేశారు శ్యామ్.
    
‘అరుంధతి’ రెడీ. రష్ చూసి శ్యామ్ డల్ అయిపోయారు. ఏదో అసంతృప్తి. ఎక్కడో ఏదో కొడుతోంది. రీ-షూట్. బాగున్నవి ఉంచేసి, బాగోలేనివి మళ్లీ తీశారు. ఇంకో 40 రోజులు ఎక్స్‌ట్రా.  ఫైనల్‌గా సినిమా రెడీ. 55 రోజుల్లో తీయా లనుకున్న సినిమా 264 రోజులు పట్టింది. 3 లక్షల 20 వేల అడుగుల నెగిటివ్ ఎక్స్ పోజ్ చేశారు. బడ్జెట్ రూ. 14.5 కోట్లు తేలింది. ఒక్క ఏరియా కూడా బిజినెస్ చేయలేదు. అన్నిచోట్లా సొంతంగా రిలీజ్.
 
శ్యామ్ నమ్మకమే ఫలించింది. ‘అరుంధతి’కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్. అన్ బిలీవబుల్ ఓపెనింగ్స్. ఫస్ట్ 35 ప్రింట్స్‌తో రిలీజ్ చేసిన సినిమా, సెకండ్ వీక్ 290 ఫిజికల్ ప్రింట్స్‌కి, డిజిటల్ ప్రింట్స్‌కి ఎగ బాకింది. ఫైనల్‌గా 360 ప్రింట్స్ వేశారు. దటీజ్ ద పిక్చర్స్ స్టామినా. ‘వదల బొమ్మాళీ నిన్నొదలా’ అంటూ బాక్సా ఫీస్‌కు అతుక్కుపోయింది ‘అరుంధతి’.
    
శ్యామ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ. ఆ రోజు శ్యామ్ పాతికేళ్ల వెడ్డింగ్ యానివర్సరీ. ‘అరుంధతి’ సక్సెస్‌తో ఆ పార్టీలో డబుల్ జోష్. ‘‘నీకేం గిఫ్ట్ కావాలి?’’ అడిగారు శ్యామ్ తన భార్యను. ‘‘ఇంకో రెండు సినిమాల వరకూ మీరు గ్రాఫిక్స్ జోలికి పోకూడదు’’ అడిగారామె. శ్యామ్ పగలబడి నవ్వేశారు.
 
వెరీ ఇంట్రెస్టింగ్...
* సోనూసూద్ ఈ సినిమాకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 43 లక్షలు. ముందు మాట్లాడింది 18 లక్షలైతే, ఎక్స్‌ట్రా కాల్షీట్స్ తెచ్చింది 25 లక్షలు.
* తమిళ, మలయాళ భాషల్లోకి కూడా ‘అరుంధతి’ని డబ్ చేశారు. అక్కడా బాగా ఆడింది. హిందీలో అనుష్క, రజనీకాంత్ (ఫకీర్ పాత్ర), షారుక్ ఖాన్ (పశుపతి పాత్ర)లతో రీమేక్ చేయాలని శ్యామ్ ఓ దశలో అనుకున్నారు. ఎందుకనో కుదర్లేదు.
- పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement