
‘గబ్బర్‌సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యు సింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు. అలా ఆయనకు తెలుగులో భారీగా ఛాన్సులు దక్కించుకున్నాడు. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో బుక్కారెడ్డిగా వణుకు పుట్టించాడు. ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని అభిమన్యు నిరూపించకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. తన రెమ్యునరేషన్‌తో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.

2001లోనే అభిమన్యు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2010లో ఆర్జీవీ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. రక్తచరిత్రలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపుతుంది. సినిమా చూసే వారిలో భయాన్ని నెలకొలుపుతుంది. అలా తన నటనతో దుమ్మురేపాడు. ఆపై 2017లో అతను ఏకంగా శ్రీదేవితో కలిసి మామ్ చిత్రంలో నటించాడు. హిందీ చిత్రాలలో కనిపించడమే కాకుండా, ఆయన తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం పవన్ ఓజీలో చాలా కీలక పాత్రలో అభిమన్యు ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.
మొదటి రెమ్యునరేషన్
'నేను నటించిన మొదటి సినిమా (అక్స్) కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 12 వేలు మాత్రమే. చాలా ఏళ్ల పాటు ఒక సినిమాకు రూ. 20 వేల లోపే ఇచ్చేవారు. కానీ, రక్తచరిత్ర సినిమాకు రూ. 40 వేలు ఇచ్చారు. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీలో నటించాను కాబట్టే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్‌లో ఛాన్స్ వచ్చింది. నేను డబ్బును నమ్ముకోలేదు. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాను.
గబ్బర్ సింగ్ కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు. దీంతో లైఫ్ మొత్తం మారిపోయింది. అలా 2010లో తొలిసారి ఎక్కిన కార్వాన్ 2025 వచ్చినా సరే నేను ఇంకా దిగలేదు. ఆ రెండు సినిమాలు నా జీవితంలో అంతలా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఓజీలో పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని తెలిపాడు.

చీపురుతో ఫ్లోర్లు ఊడ్చేవాడు
అభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. ‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్. ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది.
అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి. పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అలా ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment