వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! | Ram Gopal Varma Self Realisation After Watching Satya Movie | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: సక్సెస్‌తో తాగుబోతునయ్యా.. అలా పతనం మొదలైంది.. నా కన్నీళ్లకు కారణం..

Published Mon, Jan 20 2025 12:18 PM | Last Updated on Mon, Jan 20 2025 12:38 PM

Ram Gopal Varma Self Realisation After Watching Satya Movie

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఆల్‌ టైం క్లాసిక్‌ చిత్రాల్లో సత్య ఒకటి. గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పేయి, ఊర్మిళ మటోండ్కర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 1998లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలైంది.

ఎవర్నీ పట్టించుకోకుండా ఏడ్చేశా..
రీరిలీజ్‌ సందర్భంగా సత్య సినిమాను వీక్షించిన దర్శకుడు ఆర్జీవీ (Ram Gopal Varma) భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. రెండు రోజుల క్రితం సత్య సినిమా చూశాను. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లాగలేవు. నా కన్నీళ్లు ఎవరైనా చూస్తారేమో అని కూడా పట్టించుకోకుండా ఏడ్చేశాను. సినిమా చూసి ఎమోషనలవలేదు. సత్య తర్వాత నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాను.

సినిమా అంటే బిడ్డకు జన్మనివ్వడం లాంటిదే
ఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే! సినిమాను ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఫైనల్‌ అవుట్‌పుట్‌ ఎలా వస్తుందనేది తెలియదు. షూటింగ్‌ అయ్యాక దాన్ని చూసినవాళ్లు ఇది హిట్టనో, ఫట్టనో చెప్తూ ఉంటారు. నేను మాత్రం నేను సృష్టించిన సినిమా అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ఈ సినిమాను లక్ష్యం లేని నా ప్రయాణంలో ఓ అడుగుగా మాత్రమే భావించాను. రెండు రోజుల క్రితం వరకూ అదే అభిప్రాయంతో ఉన్నాను. 

నా కన్నీళ్లకు కారణం..
అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమా (Satya Movie)ను బెంచ్‌మార్క్‌గా తీసుకుని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదో అర్థం కావడం లేదు. నేను సినిమాలోని విషాదం చూసి చలించిపోలేదు. నన్ను నేను చూసుకుని ఏడ్చేశాను. సత్య సినిమాతో నన్ను నమ్మినవారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని అపరాధ భావనతో కుమిలిపోయాను. సక్సెస్‌, అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను. రంగీలా, సత్య సినిమా సక్సెస్‌ వల్ల నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పుడే నా విజన్‌ను కోల్పోయాను. 

కళ్లకు గంతలు కట్టుకున్నా..
తర్వాత నా సినిమాల్లో ఏవో జిమ్మిక్కులు, అసభ్యకరమైన ప్రదర్శనలు.. ఇలా అర్థంపర్థం లేని ప్రయోగాలు చేశాను. అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెసయ్యాయి. కానీ సత్య మూవీలో ఉన్నంత దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. చిత్రపరిశ్రమలో కొత్త తరహా చిత్రాలు చేయాలన్న ఆలోచనతో నా కళ్లకు నేనే గంతలు కట్టుకున్నాను. నా విలువ అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు పెట్టాను. ఈ క్రమంలో నేను సృష్టించిన అందమైన గార్డెన్‌ను కాళ్ల కిందే తొక్కిపెట్టాను. 

తప్పుల్ని సరిదిద్దుకోలేను
అప్పుడే నా పతనం మొదలైంది. నేను చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేను. కానీ ఇకపై దర్శకుడిగా నన్ను మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను. రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది! సత్యలాంటి సినిమాను నేను మళ్లీ తీయలేకపోవచ్చు. కానీ అలాంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించకపోవడం క్షమించరాని నేరమవుతుంది. దీనర్థం నేను సత్యలాంటి సినిమాలు మాత్రమే తీస్తానని కాదు. 

ఇకపై ఆ రూల్‌ పాటిస్తా
జానర్‌ ఏదైనా సరే, తీసుకునే అంశం ఏదైనా సరే సత్యపై చూపించినంత నిజాయితీ ఇకమీదట ప్రతి సినిమాపై చూపిస్తాను. సత్య తర్వాత నేను చేయబోయే సినిమా ఎలా ఉంటుందని నన్నెవరూ అడగలేదు. కానీ ఆ ప్రశ్న నాకు నేను వేసుకోకపోవడం దారుణం. అందుకే మళ్లీ నేను వెనక్కు వెళ్లాలనుకుంటున్నాను. ఇకపై ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ చూడాలనుకుంటున్నాను. ఇదేదో ముందు నుంచీ పాటించుంటే చాలావరకు నా సినిమాలు వచ్చేవే కాదు.

ఒట్టేసి చెప్తున్నా..
ప్రతి దర్శకుడికి ఇదొక మేల్కొలుపుగా చెప్తున్నాను. చివరగా నా జీవితంలో మిగిలిన భాగం.. సత్యలాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్తానని సత్య మూవీపై ఒట్టేసి చెప్తున్నాను అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఆర్జీవీ కొత్త వర్షన్‌ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement