పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను! | i am acting if Rs 25 is given,says srinu | Sakshi
Sakshi News home page

పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను!

Published Sun, Sep 21 2014 8:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను!

పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను!

సంభాషణం:  కామెడీని పండించడంలో శ్రీనుకి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అదే ఆయనను ఈ రోజు బిజీ ఆర్టిస్టును చేసింది. విక్రమార్కుడు, మిస్టర్ ఫర్‌ఫెక్ట్, గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో తన విభిన్నమైన యాసతో, వైవిధ్య భరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించిన శ్రీను చెప్పిన విశేషాలివి... 
 
నటుడు అవ్వాలని అయ్యారా? అనుకోకుండా అయ్యారా?
అది చెప్పాలంటే పెద్ద ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. నేను ‘తగరపు వలస’లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ చదువు కంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే ఆసక్తి. ఓసారి నేను ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటే అమ్మ చూసింది. ‘డ్యాన్స్ అంటే ఏమిటో చూపిస్తాను చూడు’ అంటూ క్లాసికల్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. సాధారణ గృహిణిలా ఉండే అమ్మలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు కొన్నాళ్లపాటు నేర్చుకునే స్థోమత లేక వదిలేసిందట. దాంతో నేనైనా మంచి డ్యాన్సర్‌ని అవ్వాలనుకున్నాను. పెళ్లిళ్లకీ, ఫంక్షన్లకీ ప్రోగ్రాములివ్వసాగాను. అది చూసి నాన్నగారు, తన స్నేహితుడు శరత్‌బాబు (నటుడు) దగ్గర నా గురించి ప్రస్తావించారు. చదవడం లేదు, ఎప్పుడూ డ్యాన్సులవీ అంటాడు అని చెబితే... ఆయన నన్ను మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చమని సలహా ఇచ్చారు. నాన్న అది ఫాలో అయిపోయారు. నాన్న చెప్పింది నేను ఫాలో అయిపోయాను.

అంటే మీకు ఆసక్తి లేకుండానే చేరారా?
దాదాపు అంతే. అయితే అక్కడ చేరాక బాగా ఆసక్తి పెరిగింది. తర్వాత సత్యానంద్‌గారి దగ్గర శిక్షణకు చేరాను. అక్కడే నాకు ప్రభాస్ పరిచయమయ్యాడు. ఇద్దరం స్నేహితులమయ్యాం. తను చెప్పాడు, ‘నాతో ఉండు, పరిచయాలు పెరుగుతాయి, మెల్లగా మంచి అవకాశాలు వస్తాయి’ అని. దాంతో పదేళ్లపాటు ప్రభాస్ వెంటే ఉన్నాను. సర్వం చూశాను.

అందుకేనా మిమ్మల్ని ‘ప్రభాస్ శ్రీను’ అంటారు?
అవును. శ్రీను అనేది మామూలు పేరు కదా. ప్రభాస్ శ్రీను అంటే వెరైటీగా ఉంటుందని అలా కంటిన్యూ అయిపోయాను. నా ఫ్రెండ్స్ అంటూంటారు... ‘ఆడపిల్లకి పెళ్లయ్యాక ఇంటిపేరు మారుతుంది. కానీ ఇంటిపేరు మారిన మొట్టమొదటి మగాడివి నువ్వే’ అని.

అంటే పదేళ్లపాటు అవకాశాలే రాలేదా?
చిన్న చిన్న అవకాశాలు వస్తే చేశాను. ‘విక్రమార్కుడు’తో బ్రేక్ వచ్చింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత బిజీ అయిపోయాను.

ఇంతమంది కమెడియన్స్ మధ్య ఎలా నిలబడగలుగుతున్నారు?
మీ పళ్లు మెరిసిపోతాయి అంటూ బోలెడు పేస్ట్ కంపెనీలు ప్రకటనలిస్తాయి. కానీ ‘కాల్గేట్’ వాడే వాడు దాన్నే వాడతాడు. అలాగే ఎందరు నటులున్నా ఏ పాత్రకు పనికొచ్చే నటుడిని ఆ పాత్రకు తప్పక తీసుకుంటారు దర్శకులు. కాబట్టి నాకు తగ్గవి నాకే వస్తాయి. అయినా ఎవరి టాలెంట్ వారిది. ఒకరిలా అవ్వాలనుకుంటే అవ్వలేం. బ్రహ్మానందం గారినే తీసుకోండి. ఆయనలాంటివాడు మరొకడు లేడు, రాడు. ఆయన సరస్వతీ పుత్రులు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ ఆయన స్థాయికి చేరడం మాత్రం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు.

డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా?
‘ఇలాంటిది చేయాలి’ అనుకోను కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలనుకుంటాను. చిన్నదా పెద్దదా, రెమ్యునరేషన్ ఎక్కువా తక్కువా అని చూడను. పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను.

నాన్నగారిలా ఏ కలెక్టరో అయ్యుంటే బాగుండేదని అనిపించలేదా?
లేదు. ఒకప్పుడు నన్ను ఎర్రయ్యగారి అబ్బాయనేవారు. ఇప్పుడు నాన్నను సిద్ధప్ప శ్రీను (గబ్బర్‌సింగ్‌లో పాత్ర) వాళ్ల నాన్నగారు అంటున్నారట. మేం కొన్నాళ్లు నరసన్నపేటలో ఉన్నాం. ఆ ఊరి వినాయకుడి వల్లే మేమంతా బాగున్నామని నమ్ముతాం. అందుకే ఇరవై మూడేళ్లుగా అక్కడ యేటా వినాయక చవితి ఘనంగా చేస్తున్నాం. నాన్న బిజీగా ఉండటం వల్ల ఈ యేడు పండుగ ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డారు. దాంతో నేనే కొన్ని లక్షలు ఖర్చుపెట్టి మొత్తం చేయించేశాను. పండక్కి వచ్చిన నాన్న రైలు దిగుతూనే వచ్చి నన్ను వాటేసుకుని ఏడ్చేశారు. ‘ఇంకేం కావాల్రా నాన్నా నాకు’ అన్నారు. ఓ కొడుకుగా అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది నాకు!

భవిష్యత్ ప్రణాళికలేంటి?
పెద్దగా ఏం లేవు. నేనెప్పుడూ నా కూతురు సాయివర్ణిక గురించే ఆలోచిస్తుంటాను. నటించినా, వ్యాపారం చేసినా, మరింకేదైనా చేసినా... నా కూతురికి ఓ గొప్ప జీవితాన్నివ్వడమే నా జీవిత లక్ష్యం.

తననూ మీ దారిలో నడిపిస్తారా?
లేదు. వెంకటేష్‌గారిలా ఒక్కసారి ఇంటికి చేరిన తర్వాత మళ్లీ సినిమా వాతావరణం కనిపించకూడదు అనుకుంటాను నేను. నా కూతుర్ని కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతాను.

ఒకవేళ తను అవుతానంటే?
ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందని చెబుతాం. అయినా మారాం చేస్తే ఏం చేస్తాం! తనను నాకు నచ్చినట్టుగా పెంచుతాను. తనకి నచ్చినవీ ఇస్తాను. ఏం చేసినా కానీ... నాకైనా, నా భార్య విజయకైనా పాప సంతోషమే ముఖ్యం. (నవ్వుతూ) అయినా తనకిప్పుడు మూడున్నరేళ్లే. ఇవన్నీ ఆలోచించడానికి చాలా టైముంది. చూద్దాం ఏం జరుగుతుందో!

 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement