
నాకో లెక్కుంది!
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. కథానాయిక రాధికా ఆప్టే ఇలా అనడంలేదు కానీ, ఇటీవల ఆమె లెక్కల గురించి మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్ట్ కావాలనుకోవడానికి ఓ లెక్కుంది’’ అన్నారు. రాధిక లెక్కల వెనక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
► నాకు చిన్నప్పట్నుంచీ ఆర్టిస్ట్ కావాలన్నదే ఆశయం. అందుకని ఎప్పుడూ నన్ను నేను ఓ హీరోయిన్‌గానే ఊహించుకునేదాన్ని. నా గ్రాండ్ మదర్ లెక్కల టీచర్. ఆవిడ 32 ఏళ్ల పాటు లెక్కల టీచర్‌గా చేశారు. మా ఫ్యామిలీలో విదేశాలు వెళ్లి చదువుకున్న మొదటి మహిళ ఆవిడే. ఇంట్లో ఒక జీనియస్ ఉంటే... వాళ్లంటే ఇష్టం ఏర్పడుతుంది. నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం నన్ను లెక్కలు ఇష్టపడేలా చేసింది. నేను కూడా లెక్కల్లో ఫస్ట్. పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నప్పుడే ఓ లెక్క వేసుకున్నా. ఆ లెక్క ప్రకారం హీరోయిన్ అయ్యాను. లేకపోతే లెక్కల టీచర్‌ని అయ్యుండేదాన్నేమో.
► నేను పెరిగింది పుణేలో. ఒకవైపు చదువుకోవడంతో పాటు మరోవైపు కథక్ క్లాసులకి వెళ్లేదాన్ని. ఎనిమిదేళ్ల పాటు ఆ డ్యాన్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత లండన్‌లో ఓ ఏడాది పాటు పాటలు–డ్యాన్స్ నేర్చుకున్నాను.
► నాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అంటే.. కాలేజీకి వెళ్లినా క్లాసులకు హాజరయ్యేదాన్ని కాదు. ఎప్పుడూ ఏదో ఒక నాటకం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. రాత్రంతా నిద్రపోయేదాన్ని కాదు. మా లెక్కల టీచర్.. అదేనండి నా గ్రాండ్ మదర్ కూడా సరిగ్గా నిద్రపోయేవారు కాదు. రాత్రంతా నాకు లెక్కలు నేర్పించేవారు. క్లాసులో అందరి స్టూడెంట్స్‌కన్నా నేను లెక్కల్లో సూపర్. ఎందుకంటే, ఆవిడ సిలబస్‌లో లేనివి కూడా నేర్పించేవారు. దాంతో నాకు లెక్కల్లో అన్ని ఫార్ములాలు వచ్చేసేవి.
► లెక్కలు బాగా చేసేవాళ్లను మేధావులంటారు. నేను కూడా ఆ టైపేనండి. నా మైండ్ చాలా షార్ప్. ఏ విషయంలో అయినా దాదాపు నేను అనుకున్న లెక్క తప్పదు. అందుకు ఓ ఉదాహరణ.. ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పుడు లెక్కేసుకున్నా. పెద్దయ్యాక నెరవేర్చేసుకున్నా.
► నటిగా నేనేం లెక్కేసుకున్నానంటే... ‘ఎలాంటి పాత్ర అయినా చేయాలి. కథ బాగుంటే గ్లామర్ అయినా డీ–గ్లామర్ క్యారెక్టర్ అయినా చేయాలి’ అనుకున్నా. అందుకు తగ్గట్టుగానే పాత్రలను సెలక్ట్ చేసుకుంటున్నా. నా సినిమాలు చూసినవాళ్లకు ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది.
► నా గ్లామర్ క్యారెక్టర్స్ చూసి ‘రాధికా చాలా హాట్’ అని కొంతమంది నాకు బిరుదు ఇచ్చారు. నో ప్రాబ్లమ్. మన దేశంలో ఏ కథానాయికను అయినా ఇలానే అంటారు. కొంచెం గ్లామరస్‌గా నటించినా చాలు ఈ బిరుదు ఇచ్చేస్తారు.
► జీవితంపట్ల నా లెక్క ఏంటంటే.. మనం ఏం అనుకున్నామో అది పూర్తిగా చేయాలి. ఒకవేళ నేను ఆర్టిస్ట్ కాకుండా మా అమ్మానాన్నలా డాక్టర్ అయ్యుంటే ఆ వృత్తికి కూడా న్యాయం చేసేదాన్ని. ఏ ప్రొఫెషన్‌లో ఉంటే దానికి ఫుల్ న్యాయం చేయాలనేది నా ఫిలాసఫీ.