అమితాబ్, రేఖ వెల్‌కమ్ బ్యాక్!
కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ భలే వర్కవుట్ అవుతుంది. వాళ్లని తెరమీద ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడబుద్ధేస్తుంది. అలాంటి జంటే అమితాబ్ బచ్చన్-రేఖ. ముప్ఫయేళ్ల క్రితం బాలీవుడ్‌ని ఏలిన చూడముచ్చటైన జంటల్లో వీరిది మొదటి స్థానం అనే చెప్పాలి. ఈ ఇద్దరూ కలిసి దాదాపు 18 సినిమాల్లో నటించారు. ఈ జంట నటించిన చివరి చిత్రం ‘సిల్‌సిలా’. ఆ తర్వాత అమితాబ్, రేఖ జతకట్టలేదు. వెండితెరపై ఎన్నో చిత్రాల్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ తెరవెనుక కూడా లవర్సే అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రేఖ మెడలో అమితాబ్ మూడు ముళ్లు వేస్తారని కూడా చాలామంది ఊహించారు.
కానీ అమితాబ్ జీవితంలోకి జయబాధురి రావడంతో, రేఖతో అనుబంధానికి తెరపడింది. ఆ విధంగా ఈ ఇద్దరి కాంబినేషన్ తెరపై కూడా కనుమరుగైంది. 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఓ చిత్రంలో నటించబోతున్నారన్నది బాలీవుడ్ టాక్. ‘వెల్‌కమ్’కి సీక్వెల్‌గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో ఫిరోజ్ నడియాడ్‌వాలా నిర్మించనున్న ‘వెల్‌కమ్ బ్యాక్’లోనే అమితాబ్, రేఖ కాంబినేషన్ కనిపించనుందని వినికిడి. ఇందులో అమితాబ్ డాన్‌గా నటించబోతున్నారట. ధనవంతురాలి పాత్రకు రేఖను అడిగారట.
అటు అమితాబ్, ఇటు రేఖ ఈ చిత్రంలో నటించడానికి సుముఖంగానే ఉన్నారని సమాచారం. ఈ ఇద్దరూ జంటగా నటించకపోయినా వీరి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంకా అమితాబ్, రేఖ అధికారికంగా సైన్ చేయలేదట. ఒకవేళ ఈ ఇద్దరూ అంగీకరిస్తే.. చాలా విరామం తర్వాత కలిసి నటించబోతున్నారు కాబట్టి కచ్చితంగా ‘వెల్‌కమ్ బాక్’కి అదనపు ఆకర్షణ అవుతారని చెప్పొచ్చు.