శింగరకొండలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంపీ
ఒంగోలు : ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని, అంతిమంగా హోదాను కూడా సాధించి తీరుతామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన.. గురువారం రాత్రి స్థానిక చర్చి సెంటర్‌లో వైఎస్సార్, వెస్లీ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీ కావడానికి కారకులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజానీకం సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం పదవిని త్యజించడం తన బాధ్యతని
పేర్కొన్నారు. ప్రాణత్యాగానికి సైతం తాను సిద్ధమేనని అంటూ.. తాను ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో అండగా నిలిచిన వారికి, సంఘీభావం ప్రకటించిన వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. నాలుగేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, దీక్షలు, బంద్‌లు చేస్తూ హోదా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీస్థాయిలో ప్రజలు చర్చించుకునేలా చేయగలిగారన్నారు.
చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు...
హోదా అడిగిన వారిని జైళ్లకు కూడా పంపి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని ఎంపీ విమర్శించారు. రాష్ట్రం ఈ రోజు దుర్భర పరిస్థితిలో ఉందంటే.. అందుకు కారణం చంద్రబాబే అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణకు వెళ్తున్నందున కేవలం వ్యవసాయక ప్రాంతాలైన 13 జిల్లాలతో ఏపీ అభివృద్ధి చెందడం అసాధ్యమని పేర్కొంటూ పార్లమెంట్‌లో 5 సంవత్సరాల పాటు హోదా ప్రకటించడం జరిగిందన్నారు. అయితే, పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని కాదని చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఎవరినడిగి ప్రత్యేక హోదాను వద్దని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పదేళ్లపాటు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టాయని, ఈ విషయం ప్రజలందరికీ గుర్తుందని పేర్కొన్నారు.
గత నాలుగేళ్లుగా హామీలను విస్మరించి ప్రజలకు అన్యాయం చేస్తున్నా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు స్పందించలేదో ప్రజలు నిలదీయాలన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంట్ లోపల, బయట తాము అకుంఠిత దీక్షతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్‌లో తొలిసారిగా అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు. కేవలం తాము ఐదుగురిమే ఉన్నప్పటికీ 5 కోట్ల ఆంధ్రుల అభిమానంతో వారి ఆకాంక్షను ప్రతిబింబించేలా తాము పదవులకు రాజీనామా చేసి దీక్ష చేపడితే.. చివరకు ఆ దీక్షను సైతం పోలీసులతో బలవంతంగా చంద్రబాబు భగ్నం చేయించారని విమర్శించారు. తాము ఐదుగురుం రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా రాకపోవచ్చుగానీ, తద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయం గురించి దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకునేలా చేయగలిగామన్నారు. ఐదుగురు రాజీనామా చేస్తే హోదా వస్తుందా..? అంటూ ఒకసారి, ఆ తర్వాత అరగంటలోనే హోదా ఉద్యమం ఎవరు చేసినా మద్దతిస్తామని, మరో అరగంటలోనే తాము కూడా అవిశ్వాసం పెడుతున్నామని చంద్రబాబు చేసిన ప్రకటనలు ఒక సీఎంగా ఉండి చేయతగినవేనా అని ప్రశ్నించారు.
దీక్ష కోసం ఖర్చు చేసే సొమ్మంతా ప్రజలదే...
తాను కూడా హోదా కోసం దీక్ష చేపడతానంటూ చంద్రబాబు పేర్కొంటున్నారని, కానీ ఆ దీక్షకు ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల సొమ్మేనన్న విషయం గమనించాలని ఎంపీ పేర్కొన్నారు. హోదా ఏమైనా సంజీవనా అంటూ ఎగతాళి చేసిన ఆయన.. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం కార్యకర్తలపై కేసులు పెట్టించి జైళ్లకు పంపారని, ఆ విషయం ఇప్పుడు చంద్రబాబుకు గుర్తులేదా అని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము పదవులకు రాజీనామా చేశామని, ఇక నుంచి ప్రజలతోనే మమేకమై హోదా కోసం మరింతగా ఉద్యమిస్తామని అన్నారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి చెబుతుంటే.. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతుండటం హాస్యాస్పదమన్నారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి ఉంటే కేంద్రం తప్పక దిగి వచ్చి ఉండేదన్నారు. తద్వారా హోదా వచ్చి ఉండేదన్నారు. తన రాకకు అడుగడుగునా అభిమానాన్ని చాటిన ప్రతిఒక్కరికీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కృతతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వెంట వైఎస్సార్ సీపీ పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి రామనాథంబాబు, బాచిన చెంచుగరటయ్య, ఐవీ రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పటాపంజుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, గోలి తిరుపతిరావు, ఎస్.రవణమ్మ, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, చుండూరి రవిబాబు, నాగిరెడ్డి, కేవీ ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, పులుగు అక్కిరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, లంకపోతు అంజిరెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, వీఆర్‌సీ రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, పటాపంజుల అశోక్, దుంపా చెంచిరెడ్డి, కొమ్ము సామేలు, భక్తవత్సలరెడ్డి, షేక్ నాగూర్, పి.రామసుబ్బారెడ్డి, పల్లెర్ల పుల్లారెడ్డి, ఆర్లారెడ్డి, వర్దుశేషయ్య, కండే రమణయ్యయాదవ్, వెంకాయమ్మ, ఈశ్వరమ్మ, గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, నాగూర్, ఇనగంటి పిచ్చిరెడ్డి, వాకా రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వేణు, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment