ఒంగోలు నగరంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
సాక్షి, ఒంగోలు : జనాభిమానం కదం తొక్కింది. ఒంగోలు నగర వీధుల్లో గురువారం సుమారు నాలుగు గంటలపాడు జనరథం కదిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఉదయాన్నే తొలుత బాలినేని నివాసంలో ఆయన సతీమణి శచీదేవి విజయ తిలకం దిద్ది నామినేషన్ కార్యక్రమానికి భర్తను సాగనంపారు. అక్కడి నుంచి లోక్‌సభ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఒకే వాహనంలో స్థానిక లాయర్‌పేట షిరిడీసాయిబాబా దేవాలయం, గద్దలగుంట రామాలయం, వల్లూరులోని వల్లూరమ్మ తల్లి, బైపాస్ ఫ్లయిఓవర్ సెంటర్‌లోని వినాయక ఆలయంలో బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ర్యాలీ సాగిందిలా..
ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ర్యాలీ కర్నూలురోడ్డు బైపాస్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు కొనసాగింది. రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. కార్యకర్తలు ఉత్సాహంగా బైక్‌లు నడుపుతూ వైఎస్సార్ సీపీ జెండాలను రెపరెపలాడించారు. నాయకులు ప్రత్యేక వాహనంపై నిలబడి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేశారు.
బస్టాండ్ సెంటర్, అద్దంకి బస్టాండ్, పాత కూరగాయల మార్కెట్, మస్తాన్ దర్గా సెంటర్ మీదుగా వాహనాల ర్యాలీ కొనసాగగా.. మహిళలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డికి అడుగడుగునా హారతులు పట్టారు. ఎండతీవ్రతను సైతం లెక్కచేయక వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు కూడా జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు వచ్చి ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.
ముహూర్తానికే నామినేషన్ల దాఖలు
సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు చర్చి సెంటర్‌కు చేరుకున్న కాన్వాయ్ దిగి ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తొలుత నిర్ణయించిన ముహూర్తానికే ఆయన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆ సమయాన ఆయన పక్కన సతీమణి స్వర్ణలతరెడ్డి, సోదరుడు వైవీ భద్రారెడ్డి, దర్శి అసెంబ్లీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ ఉన్నారు. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రిటర్నింగ్ అధికారి ఎంఎస్ మురళికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
గెలుపు మాదే..
అనంతరం వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపును తాము ఛాలెంజ్‌గా తీసుకున్నామని బాలినేని, వైవీ స్పష్టం చేశారు. ర్యాలీకి ప్రజలు వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారని, ఒన్‌సైడ్ ఓటింగ్‌తో అన్ని స్థానాలనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందగానే ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రోజూ మంచినీరు సరఫరాకు కృషి చేస్తామని బాలినేని హామీ ఇచ్చారు.
దేశ సమగ్రతను కాపాడతా : వైవీ
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా దేశసమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేశారు. తొలుత సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి, సోదరుడు వైవీ భద్రారెడ్డిలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 2.06 గంటలకు వైవీ నామినేషన్‌ను దాఖలు చేయాల్సి ఉంది. అయితే 1.45 గంటలకే స్వర్ణలతారెడ్డి, వైవీ భద్రారెడ్డిలు న్యాయవాదితో రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి 2.05 నిమిషాలకు రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి వచ్చారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వైవీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.