న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!)
జాక్ మా.. 5వ ప్లేస్
ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజస్‌ను ఏప్రిల్‌లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్‌ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్‌లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్‌ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్‌కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?)
ముకేశ్ స్పీడ్
నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన ఆర్‌ఐఎల్‌ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్‌కల్లా ఆర్‌ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు.
జాక్ మాకు షాక్
చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్‌లో మార్కెట్ లీడర్‌గా నిలుస్తున్న నాంగ్‌ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment