రైల్వేస్టేషన్ అంటే రైళ్లు, ప్రయాణికులే కాదు. ఒక జీవన సముదాయం. లగేజీ మోసుకెళ్లే కూలీలు, ప్రయాణికులతో పరుగులు పెట్టే ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లు, పండ్లు అమ్ముకొనేవాళ్లు, చాయ్‌వాలాలు, స్నాక్స్ సెంటర్లు. ఇలా స్టేషన్ చుట్టూ ఎన్నో జీవితాలతో విస్తరించుకొని ఉంటుంది. కానీ కోవిడ్ సృష్టించిన విలయంలో ఎంతోమంది చిరువ్యాపారుల బతుకు బండి గతి తప్పింది. ఉపాధి కోల్పోయి దిక్కుతోచని దుస్థితిలో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: 2020లో కరోనా మహమ్మారితో నగరం ఆదాయం భారీగా కుప్పకూలింది. హైదరాబాద్‌లో 60 శాతానికి పైగా ప్రజలు తమ ఆదాయం కోల్పోయినట్టు ఇటీవల పైసాబజార్ సర్వే రిపోర్ట్ వెల్లడించింది. కరోనా వైరస్‌తో 2020 ఆదాయాలు ఎక్కువగా కోల్పోయి, లోన్‌ల రీపేమెంట్ కెపాసిటీ తగ్గిపోయిన నగరాల్లో ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు ముందంజలో ఉన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఎక్కువగా నష్టపోయింది హైదరాబాద్‌వాసులే అని తెలిపింది. టాప్ 6 మెట్రోల్లో చెన్నై అత్యంత తక్కువగా ప్రభావితమైందని వెల్లడించింది. 35 నగరాల నుంచి 24 ఏళ్ల నుంచి 57 ఏళ్ల మధ్య వయసున్న 8,500 మందికి పైగా కన్జూమర్లపై పైసాబజార్ డాట్ కామ్ ఈ సర్వే చేసింది.
లక్ష రూపాయలు లేదా ఆపై అప్పు ఉన్న వారిని ఈ సర్వేలో లెక్కల్లోకి తీసుకున్నారు. సర్వే ప్రకారం, కరోనా లాక్‌డౌన్ ఆంక్షలతో 86 శాతానికి పైగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు ఆదాయాలను నష్టపోయారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్లు తమ ఇన్‌కమ్‌లు జీరోగా ఉన్నట్టు చెప్పారు. శాలరీడ్ కస్టమర్లపైనా లాక్‌డౌన్ ప్రభావం బాగా చూపిందని సర్వే తెలిపింది. 56 శాతం మంది వేతన జీవుల జీతాలు కరోనా మహమ్మారితో ప్రభావితమైనట్లు సర్వే వెల్లడించింది. 12 శాతం మందికి ఉద్యోగాలు పోయాయి. వారికి ఎలాంటి ఆదాయ వనరు లేకుండా పోయిందని సర్వే తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment