సాక్షి, హైదరాబాద్: ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుని.. వేల ఆశలతో కొత్త సంవత్సరం 2020లోకి అడుగుపెట్టినా.. కంటికి కనిపించని ఓ శత్రువు చేసిన విలయానికి అన్ని వ్యవస్థలూ అస్తవ్యస్తమయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ నిశ్శబ్దయుద్ధంలో వేలాది చిరునవ్వులు చెదిరిపోయాయి. లక్షల బతుకులు తలకిందులయ్యాయి. మహమ్మారి కారణంగా మృతిచెందిన కుటుంబాల్లో విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. కడసారి చూపులకు నోచుకోకుండా కరోనా రక్కసి సంకెళ్లు వేసింది. ఇంటి నుంచి ‘నిలకడ’గానే ఆస్పత్రికి వెళ్లి.. అటు నుంచి అటే శ్మశానానికి తరలివెళ్లిన దయనీయ దృశ్యాలు ఇంకా కళ్లముందు నుంచి చెదిరిపోలేదు. బంధాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. వైరస్ బారిన పడి కోలుకున్న వారిలోనూ గాయాల తడి మాత్రం ఆరలేదు.
⇔ కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ప్రకంపనలను సృష్టించింది. బాగా బతికిన మనుషులు రోడ్డున పడ్డారు. ఐటీ నిపుణులు ఇంటిబాట పట్టారు. పర్యాటక రంగం పడకేసింది. నెలల తరబడి మహానగరం స్తంభించింది. స్కూల్ టీచర్లు, ఆటోవాలాలు, క్యాబ్‌డ్రైవర్ల బతుకులు చితికిపోయాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. వాటిని ఆశ్రయించుకొని బతికిన లక్షలాది మంది ఆకస్మాత్తుగా ఉపాధి కోల్పోయారు.
⇔ భవన నిర్మాణరంగం కుదేలైంది. వలస కార్మికులు రాష్ట్రాలను దాటుకొని నెత్తురోడిన కాళ్లతో సొంత ఊరికి తరలివెళ్లిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. 400 ఏళ్ల మహోన్నత చరిత్ర కలిగిన భాగ్యనగరంలో బహుశా ఈ శతాబ్దకాలంలో రెండో విషాదం ఇది.
⇔ నిజాం కాలంలో చుట్టుముట్టిన స్పానిష్ ఇన్‌ఫ్లుయెంజాతో జనం పిట్టల్లా రాలారు. అప్పటి నిజాం ప్రభుత్వం క్వారెంటైన్లు ఏర్పాటు చేసింది. ప్రాణాలను నిలుపుకొనేందుకు మాస్కులు, భౌతిక దూరం పాటించారు. వందేళ్ల తర్వాత తిరిగి కోవిడ్–19 కారణంగా తిరిగి అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఏం మిగిల్చింది ఈ ఏడాది ఒక భారమైన నిట్టూర్పు తప్ప.
⇔ ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు.. పోగొట్టుకున్న చోటే తిరిగి వెదుక్కోవడం కూడా ఈ ఏడాది కనిపించింది. లాక్‌డౌన్ వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. పాఠాలు చెప్పిన టీచర్లు టీస్టాళ్లు, కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యతరగతి వర్గాలు నిరుపేదలయ్యారు. చిరుద్యోగులు కూలీలయ్యారు. ఇవిగో ఆ కూలిన జీవన శిఖరాల గాథలు..
టీస్టాల్ నడుపుతున్నాను
భరత్‌నగర్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో 25 సంవత్సరాలుగా పీఈటీగా పనిచేస్తున్నాను. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో జీవితం ప్రశ్నార్థకమైంది. కుటుంబ పోషణ కోసం భరత్‌నగర్ కాలనీలోనే టీస్టాల్‌ను ప్రారంభించాను. ‘మిత్రుల సాయంతో టీస్టాల్ పెట్టుకున్నాను. బతకాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఇప్పటి వరకు మా స్కూల్ మేనేజ్‌మెంట్ పలకరించలేదు. అప్పుడప్పుడు పిల్లలు కనిపిస్తారు. కబడ్డీ నేర్పించాలని అడుగుతారు. కానీ కోవిడ్ నిబంధనలు కదా..’
– పాపారావు, పీఈటీ
మానసిక ఒత్తిడిలో పనిచేశాం
వైరస్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో భయాందోళనకు గురయ్యాం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాం. వైద్య వృత్తిలో ఉంటూ భయపడితే ఎలా అనిపించింది. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బాధితులకు వైద్య సేవలు అందించాం. కోవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణులకు ప్రసవం చేయడంతోపాటు, కడుపులో ఉన్న శిశువుకు వైరస్ సోకకుండా తల్లీబిడ్డలను ప్రాణాలతో కాపాడాం.
– నీలాబాయి, గాంధీ ఆస్పత్రి హెడ్‌నర్సు
అప్పుల పాలయ్యాం
కరోనాతో వైద్య రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆరు నెలలుగా ఆసుపత్రిని మూసివేశాం. సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆసుపత్రిని తెరుస్తున్నా.. రోగులు భయంతో రావడంలేదు. ఇంకా అప్పులు మిగిలి ఉన్నాయి.
– డాక్టర్ చంద్రమోహన్, రాజేశ్వరీ నర్సింగ్ హోం, హయత్‌నగర్
కుటుంబ పోషణ కష్టంగా ఉంది
మాదాపూర్‌లోని గూగుల్ కంపెనీలో క్యాబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చాను. కోవిడ్‌తో జీవితం తలకిందులైంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. క్యాబ్ ఒప్పందం రద్దయింది. కానీ ప్రతి నెలా రూ.15 వేలు ఈఎంఐ కట్టాల్సిందే కదా. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉంది. ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాను. కారు రుణం ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు.
– రామ్మోహన్ గౌడ్, క్యాబ్ డ్రైవర్, పాపిరెడ్డి కాలనీ
కరోనాతో తీవ్రంగా నష్టపోయాం
రవాణా వ్యవస్థ, పాఠశాలలు మూతపడటంతో అప్పులు తీవ్రమయ్యాయి. ఫైనాన్స్‌లో తీసుకొచ్చిన ఆటో, కార్లు నడవకపోవడంతో డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం. కరోనా లాక్‌డౌన్‌తో మా వాహనాలు గ్యారేజ్‌కే పరిమితమయ్యాయి. పలు పాఠశాలలు, ప్రైవేటు ట్రావెల్స్‌కు మా వాహనాలు నడపకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఫైనాన్స్, చిట్టీల డబ్బులు కట్టకపోవడంతో నిర్వాహకులు డబ్బులు చెల్లించమంటూ ఒత్తిడి తెస్తున్నారు.
– రమేశ్, ట్రావెల్స్ నిర్వాహకుడు, ఉప్పుగూడ
అనాథ ఆశ్రమాలు దయనీయం
కరోనాతో అనాథాశ్రమంలో ఉండే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు ముందుకు రావడం లేదు. ఆరు నెలల నుంచి ఆశ్రమం కిరాయి కూడా చెల్లించలేదు. చాలా కష్టంగా ఉంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఎలాంటి స్పందన లభించడం లేదు. ఇప్పటికే చాలా ఆశ్రమాలు మూతపడ్డాయి.
– డి.రాఘవేంద్ర, వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment