రివాజుగా వచ్చి సజావుగా ముగిసిపోయే అన్ని సంవత్సరాల్లా కాకుండా రాబోయే అనేక తరాలు గుర్తు పెట్టుకునేవిధంగా చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తోంది 2020. మానవాళి చరిత్రలో ఎన్నో విషాద అధ్యాయాలున్నాయి. 536లో ఉన్నట్టుండి బద్దలై ఒకేసారి ఆకాశంలో కోట్లాది టన్నుల బూడిదను వెదజల్లి యూరప్, పశ్చిమాసియా, ఆసియాల్లో 18 నెలలపాటు దట్టమైన చీకట్లు మిగిల్చి సుదూరతీరాల్లో సైతం కరువుకాటకాలకు కారణమైన ఐస్‌లాండ్ అగ్నిపర్వత విస్ఫోటనం... 541లో ఈజిప్ట్‌లో పుట్టుకొచ్చి తూర్పు రోమన్ సామ్రాజ్యంలో మూడోవంతుమందిని పొట్టనబెట్టుకున్న బ్యూబోనిక్ ప్లేగు...1348లో యూరప్‌లో విరుచుకుపడి ఆ ఖండంలోని 40 శాతం జనాభాను మింగిన బ్లాక్ డెత్... దాదాపు 5 కోట్లమంది ప్రాణాలు హరించిన 1918నాటి స్పానిష్ ఫ్లూ... ఇలా చరిత్ర నిండా విషాద ఘట్టాలు ఎన్నో వున్నాయి.
వాటితో పోలిస్తే కరోనా మహమ్మారి సృష్టించిన మారణకాండ చిన్నగానే కనబడొచ్చు. కానీ భూగోళం నలుమూలలా విస్తరించి 8 కోట్ల 25 లక్షల మందికిపైగా ప్రజానీకానికి సోకి, దాదాపు 18 లక్షలమందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి వీరంగం చిన్నదేం కాదు. దాని దెబ్బకు అగ్రరాజ్యాలనుకున్నవే విలవిల్లాడాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. సమాచార సాధనాలు అందుబాటులోకొచ్చినందువల్ల ముందు జాగ్రత్త చర్యలపై మెజారిటీ జనాభాకు తక్కువ సమయంలో అవగాహన ఏర్పడింది. శాస్త్ర విజ్ఞానం విస్తరించటం, పరిశోధనలు వేగం పుంజుకోవటం కారణంగా అనుకున్నకన్నా చాలాముందే... ఏడాది చివరిలో వ్యాక్సిన్‌లు రూపొందాయి. వీటి ప్రభావం ఏమేరకుంటుందనేది నిగ్గు తేలటానికి మరి కొంత కాలం పడుతుంది. కానీ జనాభాలో 70 శాతంమందికి టీకాలు వేస్తే తప్ప దీని వ్యాప్తిని నియంత్రించలేమని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు బెంబేలెత్తిస్తు్తన్నాయి. ఇదంతా పూర్తికావటానికి మూడేళ్లయినా పడుతుంది. ఒకపక్క టీకాల ప్రక్రియ మొదలైన తరుణంలోనే వైరస్ కొత్త వేషంతో, మరింత శక్తిమంతంగా మారి దాడికి సిద్ధమవుతోంది.
కరోనా వైరస్ కాలచక్రాన్ని వెనక్కి తిప్పింది. మాస్క్ ధరించటంతో మొదలుపెట్టి ఎన్నిటినో అల వాటుచేసింది. ఒకప్పుడు ఊహకైనా అందని ఉత్పాతాలకు కారణమైంది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో మాత్రమే విధించే కర్ఫ్యూ లాక్‌డౌన్ పేరిట దేశవ్యాప్తంగా రాత్రింబగళ్లు అమలైంది. జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదు కాగా... ఇంతవరకూ దేశంలో కోటి మూడు లక్షలమందికి అది సోకింది. 1,48,503మంది మరణించారు. మార్చి 24న 21 రోజులపాటు అమలు చేస్తామంటూ విధించిన లాక్‌డౌన్ అంచెలంచెలుగా 68 రోజులపాటు కొనసాగింది. రెక్కల కష్టం నమ్ముకున్నవారికి, చేతిలో విద్య వున్నవారికి సాపాటుకు లోటేమిటన్న పాత నమ్మకం పల్టీలు కొట్టింది. గ్రామసీమల నుంచి పొట్టచేతబట్టుకుని నగరాలు, పట్టణాలకు వలస వెళ్లటం మాత్రమే తెలిసిన అట్టడుగు జీవులు... అక్కడ ఉపాధి కోల్పోయి, రోజులతరబడి తిండీ నీళ్లు దొరక్క... చివరకు తలదాచుకోవటా నికి గూడు కూడా కరువై సొంత ఊళ్లకు లక్షలాదిగా నడకదారిపట్టారు.
మండుటెండల్లో, నడి రాత్రుళ్లలో గర్భిణులతో, చిన్న చిన్న పిల్లలతో, వృద్ధులతో వారంతా వేలాది కిలోమీటర్లు నడిచి పోతున్న దృశ్యాలు కొన్ని నెలలపాటు చానెళ్లలో నిరంతరాయంగా కనబడి అందరినీ కలచివేశాయి. ఈ క్రమంలో ఆకలికి తాళలేక, నడిచే సత్తువ లేక మరణించిన అభాగ్యులెందరో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారెందరో కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కల్లేవు. మే 8న నడకతో అలసి మహారాష్ట్రలోని జల్నా వద్ద పట్టాలపై విశ్రమించిన 17మంది వలసజీవులు రైలు చక్రాలకిందపడి కన్నుమూశారు. లాక్‌డౌన్ ప్రభావంతో దెబ్బతిన్న అనేక రంగాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి కోల్పోయిన దాదాపు కోటిమంది బతుకు ఇంకా అగమ్యగోచరమే. ఏదో రకమైన కొలువు చేస్తున్నవారిని కూడా అభద్రత వెన్నాడుతోంది. కిందికి దిగుతున్నట్టే కనబడిన దారిద్య్ర రేఖ కరోనా అనంతర పరిస్థితుల్లో పైపైకి ఎగబాకుతోంది. అర్ధాకలితో కాలం వెళ్లదీయక తప్పనివారి సంఖ్య హెచ్చింది. మన దేశంలో సామాజిక భద్రత ఎంత నాసిరకంగా వుందో, కోట్లాదిమంది ప్రభుత్వ సాయం పొందటానికి కూడా వీల్లేని నిస్సహాయ స్థితిలో ఎలా బతుకీడుస్తున్నారో కరోనా బయటపెట్టింది. ముఖ్యంగా ప్రజా వైద్య రంగం ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. సరిపడా సిబ్బంది లేక, వచ్చిపడుతున్న రోగులకు వైద్య సేవలు అందించలేక సర్కారీ ఆసుపత్రులు సతమతమయ్యాయి. ఎప్పుడూ ఊహకు కూడా అందని ఆన్‌లైన్ చదువులు రివాజుగా మారాయి.
సంక్షోభ సమయాలు మనుషుల్లో నిద్రాణమైవున్న శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తాయంటారు. వ్యక్తులుగా ఈ కష్టకాలంలో తోటి మనిషికి అండగా నిలిచి ఆదుకున్నవారు అసంఖ్యాకంగా వున్నారు. నిరంతరాయంగా సేవలందించిన అనేకానేక స్వచ్ఛంద సంస్థలు కూడా వున్నాయి. లక్షలాదిమంది వైద్యులు, ఇతర సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది విధి నిర్వహణను ఉద్యోగంగా కాక, కర్తవ్యంగా భావించారు. రోజుల తరబడి కుటుంబాలకు కూడా దూరమై విధుల్లో నిమగ్న మయ్యారు. ఇంతమంది సమష్టి కృషి కారణంగానే మన దేశం ఇప్పటికైతే తక్కువ నష్టాలతో గట్టెక్కగలిగింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా వుండకతప్పదని, ఈ పోరు మున్ముందు కూడా కొనసాగటం ఎంతో అవసరమని తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. మాంద్యం చుట్టుముట్టి, ఉపాధి కరువై, పైపైకి ఎగబాకుతున్న ధరలతో సాధారణ పౌరులు సతమత మవుతున్న వేళ నిరాశానిస్పృహలు ఆవరించిన మాట వాస్తవమే. కానీ కాలం పుటల్లో ఒదిగిపోతున్న ఈ ఏడాది నేర్పించిన గుణపాఠాలతో కొత్త సంవత్సరంలో అప్రమత్తంగా మెలగటం, అక్కడెదు రయ్యే సవాళ్లకు సన్నద్ధమై, వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం తప్పనిసరి. అప్పుడే మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment