సంస్కరణ అడుగులు.. రక్షణ కవచాలు | Crime Statistics In Kurnool | Sakshi
Sakshi News home page

సంస్కరణ అడుగులు.. రక్షణ కవచాలు

Published Wed, Dec 30 2020 10:37 AM | Last Updated on Wed, Dec 30 2020 10:37 AM

Crime Statistics In Kurnool - Sakshi

ఈనెల 11వ తేదీన ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.4.35 కోట్ల విలువ చేసే వెండి ఆభరణాలను వాహనంలో తరలిస్తుండగా అమకతాడు టోల్‌గేట్‌ వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు

సాక్షి, కర్నూలు: క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘా... సమర్థవంతంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరస్తుల కదలికలపై డేగ కన్ను.. కరడుగట్టిన నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగం.. తరచూ సమస్యాత్మక గ్రామాల్లో కార్డెన్‌ అండ్‌ సర్చ్‌ (నాకా బందీ).. వీటికి తోడు పోలీసు శాఖలో వినూత్న మార్పులు.. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నేరాల శాతం తగ్గుముఖం పట్టింది. అయితే సైబర్‌ మోసాలు, చిన్నారులపై అత్యాచారం (పొక్సో) తదితర నేరాలు పెరిగాయి. ఆస్తి తగాదాలు, చిన్న చిన్న ఘర్షణలు, మహిళా వేధింపులు మాత్రం తగ్గలేదు. చోరీల సంఖ్య తగ్గినప్పటికీ సొత్తుల రికవరీలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో కొత్తగా వస్తున్న సంస్కరణలతో కొంత కాలంగా అవగాహన పెరిగింది. పీడీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో హింసాత్మక ఘటనలు తగ్గాయి. దొంగతనాలు, దోపిడీలతో పోల్చితే సైబర్‌ నేరాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. 2020 సంవత్సరం జిల్లాలో చోటు చేసుకున్న నేరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..  

సాంకేతికత తోడుగా.. 
మారుతున్న పరిస్థితులను బట్టి పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసుల విచారణలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. కేసు నమోదు దగ్గరి నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిఘా, నియంత్రణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దాతలు, ప్రజల సహకారంతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం ఇటీవల పలు కేసులను చేధించారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు)

మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,856 
ఆలయాలు, 921 మసీదులు, 745 చర్చీలు మొత్తం 3,522 ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్‌ చేయించారు. బహిరంగ ప్రదేశాలు, ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులపై కూడా ప్రజలు, ప్రైవేట్‌ వారి సహకారంతో గృహాలు, వ్యాపార దుకాణాలు, మద్యం షాపులు, డాబాల్లో సీసీటీవీ కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 15,662 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మ్యాట్రిక్స్, బృహస్పతి టెక్నాలజీకి సంబంధించిన కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడంలో నిఘానేత్రాలు కీలకంగా మారాయి.  

నిఘా నీడలో..
ఎవరూ ఊహించని విధంగా ఈ ఏడాది కరోనా వైరస్‌ జనజీవనాన్ని కట్టి పడేసింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 3వ వారం నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో జిల్లాలో 4 నెలల పాటు పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ కాశారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దులను రెండు నెలల పాటు పూర్తిగా మూసేశారు. పట్టణాల్లో చెక్‌పోస్టులు, ప్రతివీధిలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గస్తీ పెంచడంతో దొంగతనాల సంఖ్య భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌ సమయంలో పగటి పూట అందరూ ఇళ్లలోనే ఉండటంతో చోరీలకు అవకాశం లేకుండా పోయింది. 

లాక్‌డౌన్‌ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువ కావడంతో 80 శాతం ప్రమాదాలు తగ్గాయి. అలాగే శాంతి భద్రతలు, మతసామరస్య పరిరక్షణకు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు జిల్లాలో వినూత్నంగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాల వ్యవస్థ సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో ప్రజలు, యువత స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ దళాలు తమ పనితీరుతో పోలీసు ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్నాయి. జిల్లాలో 83 పోలీసుస్టేషన్లు, 19 సర్కిళ్లు ఉండగా వీటి పరిధిలో 1,450 గ్రామరక్షక దళాలు ఏర్పాటు చేశారు.

కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్‌   
రిమాండు ఖైదీలను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సంఘటనల నేపథ్యంలో వీడియో లింకేజీ ద్వారా జైళ్ల నుంచే ఖైదీలను హాజరు పరిచే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,426 కేసుల్లో 2,318 మంది సబ్‌ జైలు రిమాండులో ఉన్న ముద్దాయిలను సంబంధిత జడ్జీల ద్వారా వీడియో లింకేజీల ద్వారా రిమాండ్‌ గడువు పొడిగించేటట్టు చర్యలు చేపట్టారు. నేర ప్రవృత్తి మార్చుకోని నూకల మనోహర్‌రావు, గంగదాసరి రవిచంద్రరెడ్డి, నకిలీ విత్తనాల వ్యాపారి మణిగొండ రత్నాకరరావు, నకిలీ మద్యం తయారీ ముఠా నాయకుడు వినోద్‌ ఖలాల్‌ తదితరులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపారు. 

సెబ్‌తో కిక్కుకు కళ్లెం 
అక్రమ మద్యం రవాణాకు సంబంధించి జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు కాక ముందు 574 కేసులు నమోదు చేసి 622 మందిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ప్రత్యేకంగా సెబ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి డిసెంబర్‌ 20వ తేదీ వరకు జిల్లాలో 9,060 మద్యం కేసులు నమోదుచేసి 11,606 మందిని అరెస్ట్‌ చేసి 3,373 వాహనాలను సీజ్‌ చేశారు. 59,873 లీటర్ల నాటుసారా, 69,002 లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యం సీజ్‌ చేసి 11,363 మందిని అరెస్ట్‌ చేశారు. సెబ్‌ తీసుకుంటున్న చర్యలతో సరిహద్దు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు దాదాపు అడ్డుకట్ట పడింది. 

పోలీసు శాఖకు మచ్చ తెచ్చిన ఘటనలు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అందులో పనిచేస్తున్న కొంతమంది వ్యవహారం వల్ల మచ్చ తెచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు సెబ్‌ విస్తృత దాడులు చేస్తున్నా కాసులకు కక్కుర్తి పడి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ సుమారు 10 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఒక సీఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్ట్‌ కావడం, ప్రేమ వ్యవహారంలో తుగ్గలి ఎస్‌ఐని విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి.  

ఇసుక దోపిడీకి అడ్డుకట్ట 
సెబ్‌ ఏర్పాటుతో ఇసుక అక్రమ రవాణాదారులకు కూడా కళ్లెం పడింది. అనుమతులులేని ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న వారిపై నిఘా ఉంచి 435 కేసులు నమోదు చేసి 833 మందిని అరెస్ట్‌ చేసి 505 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే 6,661 మెట్రిక్‌ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. 

సైబర్‌ నేరాలతో ముచ్చెమటలు 
ఈ ఏడాది తీవ్ర నేరాలు తగ్గినప్పటికీ సైబర్‌ నేరాలు 19 శాతం పెరిగాయి. కరోనా సమయంలో ఇంటర్‌నెట్‌ వినియోగం పెరగడంతో సైబర్‌నేరాలు పెరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది 136 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 163 కేసులు నమోద య్యాయి. ఈ కేసులు దర్యాప్తు చేపట్టి రూ.3.36 కోట్లు రికవరీ చేశారు. అధునాతున సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మరో 230 కేసులను చేధించారు.   

ఛేదించిన సంచలన కేసులు 
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 9 రోజుల బాలిక కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం అందిన వెంటనే ఐదు స్పెషల్‌పార్టీ బృందాలు రంగంలోకి దిగి రెండు గంటల్లోనే కేసును చేధించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు.  
కర్నూలులో ప్రగతి మహిళా పరస్పర పొదుపు సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్న కేసులోని నిందితుల ఆస్తులను ప్రభుత్వానికి అటా^Œ చేసేలా దర్యాప్తు చేపట్టి బాధితులకు ఊరట కలిగించారు. 
ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన నకిలీ ఏసీబీ అధికారుల సంచలన కేసును సెప్టెంబర్‌ 2వ తేదీ అరెస్ట్‌ చేసి రూ.14.34 లక్షలు రికవరీ చేశారు.  
ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలో కాలభైరవ విగ్రహంలోని ఓ భాగాన్ని తొలగించిన దుండగున్ని సెప్టెంబర్‌ 28న అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపారు.   
జాతీయ రహదారుల సమీపంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఎరుకల నల్లబోతుల నాగప్పతో పాటు మరో ఇద్దరు మహిళలను అక్టోబర్‌ 17న అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపారు. వీరు 20 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.
ప్రభుత్వ పథకాల ద్వారా దొడ్డిదారిలో లబ్ధికి వీలుగా ఆధార్‌ కార్డులో డేటా మార్పి మోసాలకు పాల్పడిన 30 మందిని అక్టోబర్‌ 28న అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.
ఇంటలిజెన్స్‌ డీఎస్పీనని మోసాలకు పాల్పడిన కుమార్‌ అనే వ్యక్తిని నవంబర్‌ 2న అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.
ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ.4.35 కోట్లు విలువ చేసే 686.5 కిలోల వెండితో పాటు కారును డిసెంబర్‌ 11వ తేదీ అమకతాడు చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.
ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.9 కోట్లు నగదును డిసెంబర్‌ 13వ తేదీన  కర్నూలు శివారులో పోలీసులు స్వాధీనం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు.
పి.రుద్రవరంలో ప్రత్యర్థులను అంతమొందించేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసి ఆరుగురు నిందితులను ముందుగానే అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపడమేగాక గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు.
నాదస్వరం కాయ మహిమల పేరిట మోసాలకు పాల్పడిన అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు.

శభాష్‌ పోలీసు.. 
శాంతి భద్రత పరిరక్షణలో పోలీసు శాఖ తీసుకున్న పటిష్టమైన చర్యలకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి పలు ప్రసంశలతో పాటు పలు అవార్డులు దక్కాయి. ఎన్నికల్లో ఈ–సీజర్, ఈ–నాకాబంది, ఎలక్షన్‌ ఏపీ పోలీసు డాట్‌కామ్‌ వెబ్‌ అప్లికేషన్లకు సంబంధించిన టెక్నాలజీలను వినియోగిస్తూ చెక్‌పోస్టులల్లో ఈ–టెక్నాలజీ ద్వారా రియల్‌ టైం బేసిస్‌లో వాహన తనిఖీల ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తూ అడ్డుకట్ట వేశారు. ఇందు కోసం బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డు 2019, గవర్నెన్స్‌ నౌ–ఇండియా పోలీసు అవార్డు 2020, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహించినందుకు స్వచ్ఛ్‌ సుర్వేక్షణ్‌ 2021 అవార్డు మున్సిపల్‌ కార్యాలయాల నుంచి అందుకున్నారు. అలాగే ఫిబ్రవరి 14న టెక్నాలజీ సభ అవార్డు, కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్, డీపీఓ సమాచార్‌ నిర్వహణకు సంబంధించి రెండు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు కూడా వ్యక్తిగతంగా స్కోచ్‌ అవార్డు, ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డును గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement