లాభాల పొద్దు.. ఆకాశమే హద్దు | Rewind 2020: A to Z Things In Agriculter Sector In Prakasam | Sakshi
Sakshi News home page

లాభాల పొద్దు.. ఆకాశమే హద్దు

Published Thu, Dec 31 2020 9:20 AM | Last Updated on Thu, Dec 31 2020 11:14 AM

Rewind 2020: A to Z Things In Agriculter Sector In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: ఆశల విత్తనాన్ని బతుకు పంటలో వెదజల్లుతూ బువ్వ కంకులను సమాజానికి అందించే రైతులు ఈ ఏడాది సంతోషంగా ఉన్నారు. వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవడంతో వాగూవంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడాయి. గత ఏడాది మాదిరిగానే ఈఏడాదీ హలధారులు సిరులు పండించారు. పచ్చని పైర్లతో గ్రామ సీమలు విలసిల్లుతున్నాయి. ధాన్యపు రాశులతో రైతు లోగిళ్లు కళకళలాడాయి. ‘విత్తు విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉంటాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న దశలోనూ రైతులకు సర్కారు దన్నుగా నిలిచింది. నివర్‌ తుఫాన్‌ కాస్త ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడంతో అన్నదాతల మోముల్లో ఆ బాధ ఛాయలు కనుమరుగయ్యాయి. మొత్తం మీద 2020వ సంవత్సరం కర్షక మహారాజులకు మేలు చేకూర్చింది. 

వర్షపాతం  
జిల్లాలో వర్షపాతం ఈ ఏడాది ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా నమోదైంది. సాధారణంగా ఈ ఏడాది 757.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 905.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ ఏడాది సాధారణ వర్షం కంటే 148.50 మిల్లీమీటర్లు అధికంగా కురిసింది. 

పంటల సాగు  
ఈ ఏడాది పంటల సాగు గత ఏడాదికంటే అధిక మొత్తంలో సాగు చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు పాలనలో వరుసగా ఐదేళ్లు కరువు సంభవించి జిల్లా రైతులు అల్లాడిపోయారు. గత ఏడాది వ్యవసాయ సీజన్, ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్‌లో విస్తారంగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2,18,248 హెక్టార్లు కాగా అందులో 2,02,749 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ 2020–21 సీజన్‌లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,997 హెక్టార్లు కాగా ఇప్పటికే 1,80,210 హెక్టార్లు పంటలతో కళకళలాడుతున్నాయి. 

రైతు భరోసా కేంద్రాలు  
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయాన్ని పండగలా మార్చింది. రైతులకు వ్యవసాయ సేవలు అందుబాటులో ఉంచేందుకు విప్లవాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా మొత్తం 879 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధకం, మార్కెటింగ్‌ శాఖలకు సంబంధించిన సేవలన్నీ గ్రామ స్థాయిలో ఒకేచోట అందిస్తున్నాయి. 

3,692 టన్నుల విత్తనాలు, ఎరువులు పంపిణీ  
రైతు భరోసా కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 3,692 టన్నుల విత్తనాలు ఎరువులు, పురుగు మందులను రైతులకు సరఫరా చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను నిత్యం రైతులకు అందుబాటులో ఉంచేందుకు 870 ఎరువుల నిల్వ గోడౌన్లు కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, విజ్ఞాన ప్రదర్శనలు, వ్యవసాయ లైబ్రరీ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, వివిధ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించడం, పంటల నమోదు తదితర సేవలు రైతులకు నిరాటంకంగా అందుతున్నాయి.

12 వ్యవసాయ ప్రయోగశాలలు  
జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 వ్యవసాయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. వీటికి వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలుగా నామకరణం చేశారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వీటి సొంత భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

56,000 క్వింటాళ్ల పంట ఉత్పత్తుల కొనుగోలు 
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన పంట ఉత్పత్తులు దాదాపు 56 వేల క్వింటాళ్లను ప్రభుత్వం నేరుగా  కొనుగోలు చేసింది. ధాన్యంతోపాటు సజ్జ, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు రైతుల గ్రామాల్లోనే సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో సజ్జ కొనుగోలుకు 69 కేంద్రాలు, మొక్కజొన్నకు 37, కొర్ర 46, వరి 115, పత్తి కొనుగోలుకు 3 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

వేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు
జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం డ్యామ్‌ నుంచి నీరు సరఫరా చేసే రెండు సొరంగాల్లో ఒక టన్నెల్‌ తవ్వకం ఇటీవల పూర్తయింది. ఒకటవ టన్నెల్‌ పొడవు 18.787 కిలోమీటర్లు కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి 15.600 కి.మీ తవ్వారు. మిగతా 3.187 కి.మీ సొరంగాన్ని 18 నెలల్లోనే తవ్వేసి రెండో టన్నెల్‌ నిర్మాణం వైపు దృష్టి సారించారు. ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.102 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆ పనులు టెండర్ల దశలో ఉన్నాయి. వీటితో పాటు కొరిశపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులు సాగుతున్నాయి. పాలేరుపై నిర్మించ తలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. 

రైతు భరోసా.. రూ.542.83 కోట్లు  
వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం జిల్లా రైతులను ఆదుకుంటోంది. ఈ ఏడాది మూడు విడతలుగా రైతు భరోసా పథకం నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది మొదటి విడత మే నెల 15న 3,90,019 మంది రైతులకు రూ.292.51 కోట్లు, రెండో విడత అక్టోబర్‌ 27న 3,93,840 మంది రైతులకు రూ.162.15 కోట్లు, డిసెంబర్‌ 29న 4,06,568 మంది రైతులకు రూ.88.17 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశారు.

సున్నా వడ్డీ చెల్లింపు.. రూ.10.01 కోట్లు
జిల్లా ఖరీఫ్‌–2019 పంట కాలానికిగాను రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ రూ.10.01 కోట్లను ప్రభుత్వం వైఎస్సార్‌ వడ్డీ లేని పంట రుణాల కింద బ్యాంకులకు చెల్లించింది. జిల్లాలో మొత్తం 3,55,252 మంది రైతులు రూ.4,067 కోట్ల పంట రుణాలు తీసుకోగా అందులో 44,591 మంది సున్నా వడ్డీకి అర్హులుగా ఎంపికయ్యారు. రూ.లక్ష రుణం పొంది ఏడాదిలోగా చెల్లించిన వారికి ప్రభుత్వం పూర్తిగా వడ్డీ చెల్లించింది.

విత్తన రాయితీ.. రూ.9.34 కోట్లు
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు మొత్తం రూ.9.34 కోట్ల మేర విత్తన రాయితీని ప్రభుత్వం కల్పించింది. 42,927 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రైతులకు సరఫరా చేశారు. వాటిలో పచ్చిరొట్ట విత్తనాలు, కంది, మినుము, శనగ మొదలైనవి ఉన్నాయి. 

పంట నష్ట పరిహారం.. రూ.112.58 కోట్లు
జిల్లాలో ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.112.58 కోట్ల పరిహారం చెల్లించింది. నవంబర్‌లో నివర్‌ తుఫాను కారణంగా దాదాపు 20 రకాల పంటలు 88,742.02 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మొత్తం 1,30,086 మంది రైతులు నష్టపోయారు. అందుకుగాను ప్రభుత్వం రూ.103.49 కోట్లు రైతులకు అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ.8.95 కోట్లు చెల్లించింది. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాలకు 2,885 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 4,955 మంది రైతులకు రూ.4.14 కోట్లు అందజేసింది. నష్టపోయిన రైతులకు నెలలోపే పరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ సీపీ సర్కారుకే దక్కింది. 

పంటల బీమా.. రూ.426.22 కోట్లు
జిల్లాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ ఏడాది రూ.426.22 కోట్లు అందించారు. 2018–19కి సంబంధించి 1,44,219 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.186.30 కోట్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ప«థకాన్ని ఖరీఫ్‌ 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఖరీఫ్‌ 2019లో 2.88 లక్షల మంది రైతుల బీమా ప్రీమియంను మే నెలలో ప్రభుత్వం చెల్లించింది. ఖరీఫ్‌లో పంట కోల్పోయిన 1,30,106 మంది రైతులకు రూ.239.92 కోట్ల బీమా సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసింది. రబీ 2019–20లో 2,74 లక్షల మంది రైతుల వివరాలు పంటల బీమా పథకంలో నమోదు చేశారు.

నిండు కుండల్లా ప్రాజెక్టులు  
జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు ఈ ఏడాది ప్రారంభం నుంచి నిండుకుండలను తలపించాయి. సాగునీటి చెరువులు మొత్తం 956 ఉండగా అందులో 700కు పైగా చెరువులు నిండాయి. మిగిలిన చెరువులకు 70 నుంచి 90 శాతం మేర నీరు చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement