వ్యవసాయం అంటే.. ట్రాక్టర్ల పరుగులు, పవర్ టిల్లర్ల ఉరుకులు, కోత యంత్రాల సందడే కనిపిస్తాయి. దుక్కి దున్నాలన్నా.. కలుపు తీయాలన్నా.. కోత కోయాలన్నా.. ఏ పని చేయాలన్నా యంత్రాలు రావాల్సిందే. వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. కానీ.. ఆ ఊళ్లో మాత్రం మచ్చుకైనా యంత్రాలు కనిపించవు. అలాంటి మాటలూ వినిపించవు. అలాగని అదేదో మారుమూల పల్లె కాదు. అక్కడి వారికి ఆధునిక యంత్రాల వల్ల కలిగే ప్రయోజనం తెలియనిదీ కాదు. పోనీ.. ఆ ఊరోళ్లంతా కాడి వదిలేశారా అంటే అదీ కాదు. ఆ ఊరి రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే.. కాడెద్దులు, నాగలి, సహజసిద్ధ ఎరువులు, కూలీలే. అందుకే.. ఇప్పటికీ కాడెద్దులను వదలడం లేదు. విత్తనం నాటడం నుంచి.. పంటను ఇంటికి చేర్చే వరకూ ఆ ఊళ్లో నేటికీ ఎద్దులదే ప్రధాన పాత్ర.
సాక్షి, బేస్త వారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లెలో ఏ గ్రామంలో లేనంతగా కాడెద్దులు కనబడతాయి. సూర్యోదయం ముందే కాడెద్దుల మువ్వల చప్పుళ్లు.. చర్నాకోల సవ్వడులే వినిపిస్తాయి. చూడగానే వరుస కట్టిన జోడెద్దులు.. హలం పట్టిన రైతన్నలే కనిపిస్తారు. ఏ మూలకెళ్లినా నాగలితో పొలం దున్నడం, నాగలి గొర్రుతో కలుపు తీయడం.. ఆ వెనుకే పక్షుల ఒయ్యారపు నడకలు కనువిందు చేస్తాయి. ఎద్దుల మాట వినిపించినా.. ఎద్దులు కనిపించినా అన్నదాతల మోముల్లో నూతనోత్సాహం ఉట్టిపడుతుంది.
100 జతల ఎడ్లు.. 2,500 ఎకరాల్లో వ్యవసాయం
ఆర్.కొత్తపల్లెలో ప్రస్తుతం 100 జతల ఎడ్లు ఉన్నాయి. 2,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఎక్కువగా మిరప, పత్తి, పప్పు శనగ పంటల్ని సాగు చేస్తున్నారు. పంట ఏదైనా కాడెద్దులతోనే సేద్యం చేయడం ఇక్కడి రైతులకు అలవాటుగా మారింది. ఇక్కడి వారు బయటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసిన సందర్భాలు లేవు. గ్రామంలో ఒక్కొక్కరికీ 6 నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ కాడెద్దులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
రెండిళ్లకో ఎడ్ల జత
గ్రామంలో ప్రతి రెండిళ్లలో ఒకరు ఎద్దుల్ని పెంచుతారు. పత్తి, మిరప మొక్కలు పెరిగిన తర్వాత ట్రాక్టర్‌తో పొలం దున్నకం చేస్తే మొక్కలు విరిగిపోతాయన్న ఉద్దేశంతో పంట పూర్తయ్యే వరకు కాడెద్దులనే ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్ ఉపయోగిస్తే పంట దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయం రైతుల్లో ప్రబలంగా నాటుకుపోయింది. భూమిని దున్నడం, విత్తనం నాటడం, కలుపు తీయడం, ఎరువుల్ని వ్యవసాయ క్షేత్రాలకు తరలించడం, ధాన్యం మిర్చి వంటి పంటల్ని ఇంటికి లేదా మార్కెట్‌కు తరలించడం వంటి పనులన్నిటికీ అక్కడి రైతులు ఎడ్లను, ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తారు.
కష్టమైనా.. అదే ఇష్టం
ఎడ్లను పెంచడమనేది ప్రస్తుతం చాలా కష్టమైన పనిగా మారింది. అయినా ఇక్కడి రైతులు ఎంతో ఇష్టంతో వాటిని పెంచుతున్నారు. వాటికి దాణా అందించడం ఖర్చుతో కూడుకున్న పని అయినా.. వ్యవసాయంలో అవి చేసే సేవలు అంతకంటే విలువైనవని రైతులు చెబుతున్నారు. ఖర్చులతో పోల్చుకున్నా.. ఎద్దుల వినియోగం వల్ల పెట్టుబడి వ్యయం బాగా తగ్గి మంచి లాభాలొస్తాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. లాభసాటి వ్యవసాయం ఎద్దుల వల్లే సాధ్యమని నిరూపిస్తున్నారు.
ఖర్చుల ఆదా ఇలా..
ఎద్దుల్ని పెంచడం వల్ల వ్యవసాయ ఖర్చులు చాలా వరకు ఆదా అవుతున్నాయని ఇక్కడి రైతులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తే.. దుక్కి దున్నడం, గొర్రులు తీయడం, విత్తనాలు నాటడానికి ట్రాక్టర్‌ను వినియోగిస్తే రూ.5,600 ఖర్చవుతుంది. కలుపు తీతకు మరో రూ.3,500 ఖర్చవుతుంది. పంట రవాణా, ఆరబెట్టడం వంటి పనులకు మరో రూ.2వేల వరకు వెచ్చించాలి. అంటే 5 నెలల పంట కాలంలో ట్రాక్టర్‌ను వినియోగిస్తే ఎకరానికి రూ.11 వేల వరకు వినియోగించాలి. ఎద్దులను ఉపయోగించడం వల్ల ఆ ఖర్చులేమీ ఉండవు. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రంలో ఎద్దులతో పనులు చేయించడం వల్ల ఎకరానికి 1.5 నుంచి 2 క్వింటాళ్ల పత్తి దిగుబడి పెరుగుతుంది. పైగా ఎద్దుల నుంచి వచ్చే పేడ, అవి తినగా మిగిలే గడ్డి, చొప్ప వంటి వ్యర్థాలు 4 ట్రక్కులకు పైగా వస్తాయి. వీటిని పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగిస్తారు. దీనిని బయట కొనుగోలు చేయాలంటే రూ.12 వేల వరకు వెచ్చించాలి. ఎద్దుల మేతకు పప్పుశనగ పొట్టు, చొప్ప ఖర్చు లేకుండానే దొరుకుతుంది. రెండు ఎద్దులకు ఎండుగడ్డి కోసం ఏడాదికి రూ.20 వేలు మాత్రమే ఖర్చయినా.. వాటివల్ల వ్యవసాయ ఖర్చుల రూపంలో ఏటా కనీసం రూ.50 వేల వరకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. వాటిని సాకడం, ఆలనాపాలనా చూడటం అనేది తమకో మంచి వ్యాపకమని స్పష్టం చేస్తున్నారు.
గ్రామంలోని మొత్తం కుటుంబాలు : 200
వ్యవసాయ విస్తీర్ణం : 2,500 ఎకరాలు
గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఎడ్ల జతలు : 100
పుట్టినప్పటి నుంచీ ఎద్దులతోనే..
నేను పుట్టినప్పటి నుంచీ ఎద్దుల సాయంతోనే సేద్యం చేయడం అలవాటు. పత్తి, మిరప పంటలకు ట్రాక్టర్ ఉపయోగిస్తే మొక్కలు విరిగిపోయి చనిపోతాయి. పప్పుశనగ విత్తనం కూడా ఎద్దులతోనే వేయడం జరుగుతుంది. ఎడ్లతో పంట సాగుచేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుంది. వ్యవసాయానికి ఎడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.
- కంకర పెద్దవెంకటరెడ్డి, రైతు
ఖర్చు లేని సేద్యం ఎడ్లతోనే సాధ్యం
గ్రామంలో ప్రతి కుటుంబానికి పొలం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. పూర్వం నుంచీ ప్రతి కుటుంబానికి ఎడ్లు ఉంటున్నాయి. సేద్యం ఖర్చు లేకుండా వ్యవసాయం చేయడానికి ఎడ్లు తప్పక ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఆధునిక యంత్రాలు వచ్చినా మా గ్రామంలో ఎడ్ల పెంపకాన్ని వదిలిపెట్టడం లేదు.
- రెడ్డి చిన్న మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment